Sunday, February 6, 2011

కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం: చిరంజీవి




 సోనియాతో భేటీ అనంతరం ప్రకటించిన చిరు 
 సామాజిక న్యాయం కోసమే విలీనం 
 మంత్రివర్గంలో చేరతామన్న చిరు 

సస్పెన్స్‌ వీడిపోయింది. హస్తంలో ఒదిగిపోయాడు సూర్యుడు. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు చిరంజీవి. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పినప్పటికీ దీపముండగానే ఇల్లు చక్కబెట్టేసుకున్నారు చిరు. పొత్తా, విలీనమా ఇలా ఇప్పటివరకు సాగిన ఊహాగానాలకు పుల్‌స్టాప్‌ పడింది. కాంగ్రెస్‌ పార్టీలో పీఆర్పీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమై పార్టీ విలీనంపై చర్చించారు. సామాజిక న్యాయం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు చిరు. వ్యక్తిగత ప్రయోజనాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలిపారాయన. రాష్ట్ర మంత్రి వర్గంలో చేరనున్నట్లు చెప్పిన చిరు...పార్టీ నేతల అభిమతం మేరకే ఈ డెసిషన్‌ తీసుకున్నట్లు తెలిపారు. సామాజిక న్యాయం, రాష్ట్ర ప్రయోజనాలంటూ విలీనానికి చిరంజీవి చాలా కారణాలే చెప్పినా దీని వెనుక పెద్ద ఎత్తుగడే ఉన్నట్లు కన్పిస్తోంది. సమైక్య నినాదం ఎత్తుకోవడంతో ఇప్పటికే తెలంగాణలో పీఆర్పీ చరిత్ర క్లోజ్‌ అయింది. సీమాంధ్రలోనూ పలువురు ఎమ్మెల్యేలు, నేతలు జగన్‌కే జై కొట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని నడపడం చిరుకి శక్తికి మించిన పనిగా మారింది. ఈ టైంలో జగన్‌ ఫ్యాక్టర్‌ కాంగ్రెస్‌ను షేక్‌ చేయడం చిరుకు బాగా లాభించింది. జగన్‌ వెనుక దాదాపు 30 మంది ఎమ్మెల్యేలుండడంతో పీఆర్పీ మద్దతు కాంగ్రెస్‌కు కీలకంగా మారింది. అంతే చిరంజీవి కాంగ్రెస్‌కు ఆపన్న హస్తం అందిస్తానంటూ ముందుకొచ్చారు. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో ఇరుపార్టీల పొత్తు కూడా ఇందులో భాగమే. అప్పట్నుంచీ జరుగుతున్న ప్రక్రియ ఇప్పుడు ఫైనలైంది. ఇక తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా చిరు బాగానే లాభపడ్డారనే టాక్‌ విన్పిస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో పీఆర్పీకి ఐదు పదవులతోపాటు చిరుకు పార్టీలో సముచిత స్థానం దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. పీఆర్పీ విలీనంతో తమ బలం మరింత పెరిగిందన్నారు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ వీరప్పమొయిలీ. పార్టీలో చిరుకు సముచిత స్థానం ఇస్తామని తెలిపారాయన.

No comments:

Post a Comment