Thursday, February 24, 2011

సంక్షేమమే మా పథం!,,,మంత్రి ఆనం


అభివృద్ధికీ సమ ప్రాధాన్యం.. మాంద్యం నుంచి రికవరీ
మంత్రి ఆనం తొలి బడ్జెట్ ప్రసంగం

రూ.2లకు కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ, వృద్దాప్య పించన్లు, గృహ నిర్మాణం, పావలా వడ్డీ, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌, అభయహస్తం, తదితర సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు ఆర్థికమంత్రి ఆనం వారు గణాంకాల బడ్జెట్‌ను ఘనంగా రచించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమతౌల్యం చేశామని విరచించారు. ప్రాధాన్యతా రంగాలకు ఇంతింతలేసి నిధుల మూటలను కేటాయించినట్టు ఢంకా భజాయించారు. ఎన్నో ఒడుదుడుకుల మధ్య రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి దాదాపు 19 శాతం సాధించేశామని లెక్కల చిట్టా విప్పారు. అందరినీ అసహనానికి గురిచేస్తున్న ఫీజుల రీయంబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాలకు ఒక్క పైసా కూడా తగ్గించలేదని విడమరచారు. పించన్లు, పక్కా ఇళ్లు, పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, బియ్యం, విద్యుత్‌ పథకాలు కొనసాగుతాయని వక్కాణించారు. గుడిసె రహిత ఆంధ్రప్రదేశ్‌ను సాధిస్తామన్నారు. అయితే, కొండంత పెరిగిపోయిన ద్రవ్యలోటును ఎలా పూడుస్తారో, రుణాంధ్రప్రదేశ్‌గా మారుతున్న రాష్ట్రాన్ని ఏవిధంగా ఒడ్డున పడేస్తారో మాత్రం ఆనం వారు ఆనతీయలేదు. మొత్తానికి ఇందిరమ్మ మార్క్‌ బడ్జెట్‌ అని కాంగ్రెస్‌ జబ్బలు చరుచుకోగా… ముందుచూపు, అవగాహనా రాహిత్య బడ్జెట్‌ అని ప్రధాన విపక్షం తెదేపా పెదవి విరిచింది.  హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి : సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేసే ప్రయత్నంలో ప్రాధాన్యత రంగాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తూ రూ.1,18,542 కోట్ల వ్యయంతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2011-12ను ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో రూ.80,984 కోట్లు ప్రణాళికేతర వ్యయంగా, రూ.47,558 కోట్లు ప్రణాళిక వ్యయం కింద కేటాయించారు. రెవెన్యూ మిగులు రూ.3,826 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ.17,602 కోట్లు ఉంటుందనే అంచనాతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. వార్షిక ప్రణాళిక వ్యయాలను తదనుగుణంగా పెంచుకుంటూ ప్రణాళిక వ్యయంలో రాష్ట్ర ప్రణాళిక రూ.42,931 కోట్లు, కేంద్ర ప్రతిపాదిత పథకాల ఖాతాలకు రూ.4,627 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో ఆర్థిక ప్రణాళిక వ్యయంలో ఆర్థిక సేవలకు 57.64 శాతం, సామాజిక సేవలకు 40.78 శాతం, సాధారణ సేవలకు 1.58 శాతం నిధులు కేటాయించారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2010-11లో పన్ను ఆదాయం రూ.46,999 కోట్లు బడ్జెట్‌ అంచనాలు వేయగా, 20 శాతం పెరుగుదల రేటుతో 2011-12లో రూ.56,435 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 13వ ఆర్థిక సంఘం 2010-15 అవార్డు కాలానికి రూ.13,919 కోట్లు సిఫారసు చేసింది. 2011-12లో ఈ సిఫారసుల కింద రూ.2,359 కోట్ల మొత్తాన్ని పొందుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే రాష్ట్రానికి కేంద్ర నిధుల నుంచి రూ.32,218 కోట్లు ఉంటాయని, అందులో కేంద్ర పన్నులలో రూ.16,826 కోట్లు, ఏఐబిపి, ఇతర కేంద్ర ప్రతిపాదిత పథకాల కింద రూ.15,392 కోట్లు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక మాంధ్య ప్రభావంతోపాటు భారీ, అకాల వర్షాలు, వరదలు, ప్రకృతి విపత్తుల వంటి అన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమించి జాతీయస్థాయికంటే మెరుగైన అభివృద్ధి సాధించగలమని రాంనారాయణరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుత ధరల సూచీ ప్రకారం 2009-10లో రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి రూ.4,75,267 కోట్లు ఉండగా, 2010-11లో 18.89 శాతం వృద్ధిని నమోదు చేస్తూ రూ.5,65,066 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. అలాగే తలసరి ఆదాయం కూడా 18 శాతం పెరుగుదలతో రూ.51 వేల నుంచి రూ.60 వేలకు పెరగనున్నట్లు అంచనా వేశామని ఆయన చెప్పారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 156 లక్షల టన్నుల నుంచి 190 లక్షల టన్నులకు పెరగనుందని ఆయన పేర్కొన్నారు. రాబడి వసూళ్ళు 20 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని, వీటిని ప్రణాళికేతర వ్యయం కింద జీతాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులతోపాటు ప్రణాళికబద్ధుల కింద సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వ్యయం చేయనున్నట్లు రాంనారాయణరెడ్డి చెప్పారు.  రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రెండు రూపాయలకు కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణం, పావలా వడ్డీ, ట్యూషన్‌ ఫీజు రీయంబర్స్‌మెంటు, అభయహస్తం తదితర సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బడ్జెట్‌లో సాగునీరు, రోడ్లు, భవనాలు, తాగునీటి సరఫరా, విద్యుత్‌ ప్రాజెక్టుల లాంటి మౌలిక సదుపాయాలకు గణనీయమైన కేటాయింపులు కొనసాగించనున్నట్లు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను గుడిసెరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అర్హతగల పేదలందరికీ పక్కా గృహాలు మంజూరు చేస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు. సబ్సిడీ బియ్యం పథకం కోసం 2011-12 బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 1.19 కోట్ల కుటుంబాలకు రూ.14.69 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ కార్యక్రమం కింద ఇప్పటివరకు 33.79 లక్షల ఇళ్ళు పూర్తి చేశామని, మరో 13.20 లక్షల ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. అర్హులైన మిగిలిన వారికి 4.71 లక్షల ఇళ్ళు ఈ ఏడాది మంజూరు చేశామని రాంనారాయణరెడ్డి తెలిపారు. 2011-12లో 6 లక్షల అదనపు ఇళ్ళను పూర్తి చేయాలని ప్రతిపాదించామని, ఈ ఏడాది బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ళకు రూ.2,300 కోట్లు కేటాయించినట్లు ఆయన వివరించారు. వ్యవసాయం: ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు వ్యవసాయ రంగాన్ని యాంత్రీకరించి, రైతాంగాన్ని మరింత ఆదుకునేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు. పంటల బీమా పథకం కింద 2009 ఖరీఫ్‌లో 11.54 లక్షల మంది రైతులకు రూ.699.48 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. 2010-11లో ఖరీఫ్‌లో రూ.24,978 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రబీలో రూ.12.63 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.7.63 వేల కోట్లు పంపిణీ చేసినట్లు రాంనారాయణరెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.2,606 కోట్లు, పశుసంవర్థన, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమల శాఖకు మొత్తం రూ.931 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సాగునీరు: జలయజ్ఞం కింద 43 భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 29.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రెండేళ్ళలో 13.85 లక్షల ఎకరాల్లో సాగునీటిని స్థిరీకరించవచ్చునని ఆయన చెప్పారు. ఇందిరా సాగర్‌ పోలవరం ప్రాజెక్టు, అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అన్ని అవసరమైన ఆమోదాలను పొంది జాతీయ ప్రాజెక్టుగా పరిగణించేందుకు అన్నివిధాలా అర్హత కలిగి ఉందన్నారు. ప్రాణహిత-చేవెళ్ళకు ఏఐబిపి కింద ఆమోదాల కోసం ప్రయత్నిస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు. నాగార్జున్‌సాగర్‌ ఆధునీకరణకు రూ.4,444 కోట్ల ఖర్చుతో ప్రపంచ బ్యాంకు రుణ సహాయం కింద చేపడుతున్నామని, ఇందులో రూ.2,025 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా అందిస్తుందని ఆయన తెలిపారు. అనావృష్టి ప్రాంతాల్లో చెరువులు, కుంటల మరమ్మతులు చేస్తున్నామని, వీటికి 25 శాతం కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌, మిగిలిన 75 శాతం ప్రపంచ బ్యాంకు రుణంతో చేపడుతున్నట్లు చెప్పారు. 2004 నుంచి 2010 వరకు 26.81 లక్షల ఎకరాలకు సాగునీటి సామర్థ్యం కల్పించగా, 22.94 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును ఏర్పాటు చేశామని, 3.87 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని మంత్రి పేర్కొన్నారు. సాగునీటి శాఖకు రూ.15,010 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.  పరిశ్రమలు : రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమల ప్రగతిపైనే ఆధారపడినందున మెరుగైన మౌలిక సదుపాయాల ఏర్పాటుతో కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాయితీలతో 2010-15 నూతన పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహక విధానాన్ని రూపొందించామని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద విద్యుత్‌ పరికరాల తయారీ కోసం ఎన్‌టిపిసి-బిహెచ్‌ఇఎల్‌ ప్రాజెక్టును రూ.6 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఆరు వేల మందికి ప్రత్యక్షంగా, 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని రాంనారాయణరెడ్డి వివరించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి రూ.858 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ : ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎగుమతుల వాటా, జాతీయ ఐటి ఎగుమతుల్లో 15 శాతం ఉందని, రాష్ట్రంలోని అన్ని రంగాల ఎగుమతుల్లో ఐటి రంగం వాటా 49 శాతం ఉందని మంత్రి చెప్పారు. ఐటి రంగం రాష్ట్రంలో దాదాపు 2.75 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తుందని, ఇతర రంగాల్లో పది లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఐటి రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు 2010-15 కొత్త ఐటి విధానాన్ని రూపొందించిందని, ఈ రంగానికి రూ.51 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.  రోడ్లు, భవనాలు : రాష్ట్రంలో రోడ్‌ సెక్టార్‌ ప్రాజెక్టును రూ.8,072 కోట్లతో చేపట్టగా, ఇందులో రూ.1568 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణం, రాష్ట్ర వాటా రూ.1597 కోట్లు, మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 5, 7, 9వ నెంబర్ల జాతీయ రహదారులను నాలుగు లైన్ల రోడ్లుగా అభివృద్ధి చేసే కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో స్వర్ణచతుర్భుజి పథకం కింద 1,016 కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేసినట్టు చెప్పారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల కింద ఖమ్మం జిల్లాను కేంద్రం గుర్తించి 599 కిలోమీటర్ల రోడ్డును, 11 వంతెనలను మెరుగుపరిచేందుకు రూ.1,115 కోట్లు ఆమోదించిందని ఆయన తెలియజేశారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖకు రూ.4,108 కోట్ల నిధులను ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు పాతబస్సులను మార్చి రూ.1,000 కోట్ల వ్యయంతో 6 వేల కొత్త బస్సులను సేకరించాలని ప్రతిపాదించింది. ఆర్టీసికి రూ.200 కోట్ల రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.  మౌలిక సదుపాయాలు, పెట్టుబడి : ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక అభివృద్ధి కోసం మెరుగైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం మౌలిక సదుపాయాల ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేసి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఓడరేవులు, విమానాశ్రయాలు చేపట్టినట్లు చెప్పారు. కృష్ణపట్నం, నిజాంపట్నం వాడరేవు, మచిలీపట్నం ఓడరేవుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయికి పెంచే పనులు చేపట్టినట్లు చెప్పారు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.143 కోట్లు ప్రతిపాదించినట్లు రాంనారాయణరెడ్డి చెప్పారు. ఇంధనం: విద్యుత్‌ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించిన ప్రభుత్వం ఉత్పత్తిని పెంచేందుకు అనేక ప్రాజెక్టులు చేపడుతుందన్నారు. ప్రస్తుతం 14,781 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన శక్తి కలిగి ఉందని, వచ్చే ఏడాది అదనంగా 1,033 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన శక్తిని పెంచాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. 2010-11లో 539 మెగావాట్లను అదనంగా ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 28.35 లక్షల పంపుషెడ్లకు ఏడు గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, ఈ ఏడాది అదనంగా మరో 1.5 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని ప్రతిపాదించి డిసెంబర్‌ నాటికి 66,106 వ్యవసాయ సర్వీసులను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. విద్యుత్‌ రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.4,940 కోట్లు కేటాయింపులు ప్రతిపాదించినట్లు రాంనారాయణరెడ్డి తెలిపారు. పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య : పాఠశాల విద్యను గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా ప్రోత్సహించేందుకు, మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. సర్వశిక్షా అభియాన్‌, బాలికల విద్య కోసం జాతీయ కార్యక్రమం, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను రాజీవ్‌ విద్యామిషన్‌ కింద అమలు చేస్తున్నామని, ఈ పథకాల అమలుకు ఈ బడ్జెట్‌లో రూ.805 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. సెకండ్రీ విద్య అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టామని, దీనికి రూ.1394 కోట్లు కేంద్రం 75 శాతం, రాష్ట్రం 25 శాతం ఖర్చుతో 355 ఆదర్శ పాఠశాలలను పటిష్టపరుస్తున్నట్లు తెలిపారు. రూ.518 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ కింద 1650 ఉన్నత పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, సైన్స్‌ ప్రయోగ శాలలు తదితర మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 6,300 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.14,025 కోట్లు కేటాయింపును ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 14 కొత్త విశ్వవిద్యాలయాలను ఇప్పటికే నెలకొల్పామని, వీటిలో మౌలిక సదుపాయాలు పెంచేందుకు విస్తరిస్తున్నామన్నారు. 13 విశ్వవిద్యాలయాల్లో ఫైనాన్షియల్‌ సర్వీసులు, మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌, టూరిజం, హాస్పిటాలిటీ, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌లలో ఫినిషింగ్‌ పాఠశాలలను ప్రారంభించామని తెలిపారు. డిగ్రీ స్థాయిలో సాఫ్ట్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్పేందుకు 75 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆంగ్ల భాష ప్రయోగ శాలలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ శాఖకు బడ్జెట్‌లో రూ.3,337 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదించినట్లు రాంనారాయణరెడ్డి తెలిపారు. ఆరోగ్యం : ప్రభుత్వ ప్రధాన కార్యక్రమమైన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టపరిచి ఏకీకృతం చేస్తున్నామని, దీనికింద లక్షలాది రూపాయలకు ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారానే త్వరలో సేవలు అందిస్తామని స్పష్టంచేశారు. గిరిజనులకు, వలస కార్మికులు, ఇళ్ళు లేనివారికి, మత్స్యకారులు, ఎస్సీలకు సరసమైన ధరలకు ప్రామాణికమైన మందులు అందించేందుకు జన ఔషధి, జనజీవని కేంద్రాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి కోసం రూ.200 కోట్ల ఖర్చుతో కొత్త భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.5,040 కోట్లు ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. సంక్షేమం : సాంఘిక సంక్షేమ శాఖకు రూ.2,352 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.1,230 కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.2,104 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.301 కోట్లు, మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి రూ.1,948 కోట్ల కేటాయింపును ప్రతిపాదించినట్లు రాంనారాయణరెడ్డి వెల్లడించారు.  నిరుపేదలకు పక్కా గృహాలు, ఎస్సీ విద్యార్థులందరికీ స్కాలర్‌షిప్‌లు, పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తున్నామన్నారు. సంక్షేమ సంస్థలకు బాకీ ఉన్న మార్జిన్‌ మణి రుణాలను మాఫీ చేశామని, ఆదాయం సమకూరే కార్యకలాపాలకు 50 శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు ఏర్పాటు చేస్తూ, షెడ్యూల్డ్‌ కులాల వారికి సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం విద్యకు కేటాయించినట్లు చెప్పారు. ఇప్పటికే ఉన్న 143 హాస్టళ్ళకు అదనంగా మరో 126 కొత్త పోస్టు మెట్రిక్‌ హాస్టళ్ళను మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది లక్షా 46 వేల మంది ఎస్టీ విద్యార్థులకు పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు ఇచ్చామన్నారు. అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు సరికొత్త విధానంలో స్కాలర్‌షిప్‌లను, బోధనా రుసుంలను రీయంబర్స్‌మెంటు చేయనున్నట్లు రాంనారాయణరెడ్డి స్పష్టంచేశారు. బీసీల కోసం 1442 ప్రీీ-మెట్రిక్‌ హాస్టళ్ళు ఉన్నాయని, బీసీల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. లక్ష రూపాయల ఆదాయం లోపుగా ఉన్న మైనారిటీ విద్యార్థులకు రెండవ తరగతి నుండి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకు ఫీజు రీయంబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్‌లను వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. మైనారిటీ ఆర్థిక సంస్థ ద్వారా క్రిస్టియన్‌లకు, ముస్లింలకు స్కాలర్‌షిప్‌లను ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.  6 లక్షల మంది గర్భిణీ స్త్రీలు, పిల్లతల్లులకు, 22 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని 231 ఐసిడిఎస్‌ బ్లాకుల్లో ప్రవేశపెట్టామని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పిల్లతల్లులకు పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు వారానికి రెండు గుడ్లను అందిస్తున్నట్లు మంత్రి వివరించారు.  గ్రామీణ, పట్టణాభివృద్ధి, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా : గ్రామీణాభివృద్ధికి రూ.3,341 కోట్లు, గ్రామీణ రోడ్లకు రూ.627 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.773 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు రూ.5,080 కోట్లు కేటాయించినట్లు రాంనారాయణరెడ్డి వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన రాజీవ్‌ పల్లెబాట, రాజీవ్‌ నగరబాట లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధి పథకం కింద ఈ బడ్జెట్‌లో రూ.400 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు.

No comments:

Post a Comment