Monday, February 28, 2011

దీక్షావివేకి


ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రాజకీయనాయకులు ఎంచుకునే మార్గం దీక్ష. ఏదైనా డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గనప్పుడు దీక్షలకు దిగడం సాధారణం. ఎంతోమంది ఇలా చేసే ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టారు. కానీ, ఇప్పుడో దీక్షాదక్షుడు వచ్చాడు. అతడే జగన్. ఆయన చేస్తున్న దీక్షలే ఇప్పుడు హాట్ టాపిక్..ఫీజు చెల్లింపుల కోసం వారం రోజుల పాటు దీక్షకు దిగిన జగన్.. చివరకు నిమ్మరసం తాగి విరమించారు. కానీ, విరమిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన దీక్షను పట్టించుకోలేదన్నారు. జగన్ వర్గం కూడా ఈ వారంరోజుల్లో అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ దుమ్మెత్తిపోశారు. కానీ, అక్కడే అసలు విషయాన్ని వారు గుర్తించలేరు. ఒక్కరోజు, రెండు రోజుల దీక్షలు చేస్తూ వచ్చిన జగన్ .. ఫీజు కోసమూ ముందు ఒక్కరోజే దీక్ష చేస్తానని ప్రకటించారు. ఇలా దీక్ష ఎన్నిరోజులు చేస్తామన్నది ప్రకటించి చేయడం సమకాలీన రాజకీయాల్లో ఒక్కజగన్‌కే చెల్లింది. ఎంత వివేకం లేని రాజకీయనాయకుడైనా ముందుగానే ముగింపు రోజును ముందుగానే ప్రకటించి దీక్షకు దిగలేదు. కానీ, జగన్‌కు బహుశా వివేకం ఎక్కువనుకుంటా.. అందుకే ముందుగానే తాను విరమించే రోజునూ ప్రకటించేశారు. ఎలాగూ వారంరోజుల్లో ముగిసిపోతుందని తెలిసినప్పుడు ప్రభుత్వం స్పందిస్తుందా..? సరిగ్గా అదే జరిగింది. అనుకున్నట్లే జగన్ దీక్షా శిబిరాన్ని ఎత్తేశారు. అయితే, ఈ వారం రోజుల్లో ఎలాగైనా ప్రభుత్వం తనతో దీక్షను విరమింపజేస్తుందని ఆయన భావించారు. అది జరగలేదు. ఇక 24వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామంటూ జగన్ వర్గం ప్రకటించింది. కానీ, బడ్జెట్ తర్వాత రోజు అసెంబ్లీకి సెలవన్న విషయం మర్చిపోయింది. మొత్తంమీద రాజకీయంగా జగన్ ఇంకా ఎదగలేదన్న విషయం ఈ దీక్షతో మరోసారి తేలిపోయింది.... 

No comments:

Post a Comment