లక్షల ఓట్ల మెజార్టీ కట్టబెట్టే కడప జిల్లా, వైఎస్ జగన్ ఇలాకాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం రోడ్ షో నిర్వహించారు. పర్యటనలో భాగంగా వైఎస్ వర్గానికి మహా పట్టున్న పులివెందుల, వేంపల్లిలోనూ పర్యటించారు.
చంద్రబాబు నాయుడు రోడ్ షోకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆగిన చోటల్లా వైఎస్ జగన్ పై బాబు విమర్శల వర్షం కురిపించారు. జగన్ అక్రమ ఆస్తులను కోట్లలో కూడబెట్టారనీ, వేల ఎకరాలు స్వాహా చేసి ఆ డబ్బుతో సాక్షి పత్రికను నెలకొల్పారని దుమ్మెత్తి పోశారు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చివుంటే సోనియా గాంధీ దేవత అంటూ అక్కడే జపం చేస్తూ ఉండేవారనీ, పదవి రాకపోయే సరికి సోనియా దెయ్యమంటూ నిందిస్తూ సొంత కుంపటికి సమాయత్తమయ్యారన్నారు.
ఇలా పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్ నాటకమాడుతుంటే, బాబాయ్ వైఎస్ వివేకా పార్టీలోనే ఉంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ మంత్రిగా ఉన్నా రైతులను కష్టాల నుంచి గట్టున పడేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు.
కోటానుకోట్ల అక్రమ ఆస్తులను వెనకేసుకున్న నాయకులను పక్కనపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. తెలుగుదేశం పార్టీ రైతు ప్రయోజనాలకోసం అవిశ్రాంత పోరాటం చేస్తుందని అన్నారు.
త్వరలో పులివెందుల, కడప లోక్‌సభ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగనున్న నేపధ్యంలోనే బాబు రోడ్ షో నిర్వహించారని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం జగన్ గెలుపుకు కళ్లెం వేయాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిన చిరంజీవి కడపలో పర్యటించనున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment