Tuesday, April 5, 2011

చైతన్యశీలి డాక్టర్జీ ...


చైతన్యశీలి డాక్టర్జీ

సార్థకమైన జీవితానికి గీటురాయి ఎంత కాలం జీవించారు అనేది కాదు, ఆ వ్యక్తి తన జీవితంలో ఏమి సాధించాడు అనేది అవుతుంది. అట్లాగే ఏ మహాపురుషుడినైనా అర్థం చేసుకోవాలంటే ఆ మహాపురుషుడు జీవించి ఉన్న కాలంలోని సమకాలీన పరిస్థితులు, ఆ సమయంలో వారు సాదించిన విజయాలు, ఆలోచనలు, అన్నీ కలగలసి ఆ మహాపురుషుడిని అర్థం చేయిస్తాయి. భారతదేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో అనేకమంది మహాపురుషులు జన్మించారు. వారిలో స్వామి వివేకానంద, అరవింద, బంకించంద్ర, డాక్టర్‌ హెడ్గేవార్‌లు హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో వారు చేయవలసిన పనులను ఒకరి తరువాత ఒకరు చేసుకుంటూ వెళ్ళారు.
వారిలో డా||హెడ్గేవార్‌ హిందూ సమాజాన్ని శక్తివంతం చేసేందుకు ప్రారంభించిన కార్యం క్రమంగా విస్తరిస్తూ ఈ రోజున ప్రపంచంలోనే స్వచ్ఛందంగా పనిచేసే ఏకైక అద్భుత వ్యవస్థగా నిలబడింది. సమాజంలోని అన్ని రంగాలలో తనదైన శైలిలో పనిచేస్తూ అందరి మనస్సులను గెలుస్తూ ముందుకు పోతున్నది. ఇంతటి మహత్తర కార్యరచనకు డాక్టర్జీకి ప్రేరణ ఇచ్చిన అంశం ఏమిటి? అని ఆలోచిస్తే ఒకే ఒక అంశం మనకు కనబడుతున్నది. అదే ''ఇది మన మాతృభూమి, మనం మన మాతృభూమి వైభవం కోసం పని చేయాలి. దానికోసం ప్రతిరోజూ ఒక గంట సమయమిచ్చి అందరం ఒకచోట కలవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. దేశం గురించి మనం కలిసి పనిచేయటం నేర్చుకోవాలి ఈ సరళమైన కార్యపద్ధతికి, ఆలోచనకు సమాజంలోని అన్నివైపుల నుండి స్వాగతం లభించింది. ప్రతి రోజు కనీసం గంట సమయం ఇవ్వాలనే ఆలోచన నుండి తమ జీవితాలలో సంపూర్ణ సమయాన్ని సమర్పణ చేసి పనిచేసే వ్యక్తులు వేలాదిమంది తయారైనారు. ఆ విధంగా సంపూర్ణ సమయం సమాజం కోసం సమర్పణ చేసి పనిచేసే కార్యకర్తలు ఈ రోజున మూడు వేలమందికి పైగా కనబడతారు. సంఘ కార్య పద్ధతిని వికసింప చేయ డంలో పూజనీయ డాక్టర్జీకి ఆ సమయంలో ఎదురైన సమస్యలు ఏ రకంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లోరో మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. అవి కాంగ్రెస్‌ వేదికగా స్వాతంత్య్రపోరాటం ఉధృతంగా నడుస్తున్న రోజులు. 1920వ సంవత్సరం తరువాత కాంగ్రెస్‌ స్వతంత్ర పోరాటం కోసం మూడు పర్యాయాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చింది. మొదటి ఆందోళన 1920-21లో ప్రారంభై 1924 ఫిబ్రవరిలో గాందీజీ జైలు నుండి విడుదలవ
టంతో నిలిచిపోయింది. 1930-31లో ప్రారంభమైన రెండవ ఆందోళన 1934 మే నెలలో గాంధీజీ ఆందోళనను వెనుకకు తీసుకోవడంతో ఆగిపోయింది. మూడవ ఆందోళన 1941 అక్టోబర్‌ 17న వినోబా భావే వ్యక్తిగత సత్యాగ్రహంతో ప్రారంభమై 1942లో పూర్తి ఆందోళనగా రూపుదిద్దుకొంది. 1945 జూన్‌ 15వ తేదీన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులను విడుదల చేయటంతో ఈ ఆందోళన ఆగి పోయింది.
మొదటి ఆందోళన సమయానికి సంఘ స్థాపన జరగలేదు. డాక్టర్జీ కాంగ్రెస్‌లో పనిచేస్తున్న రోజులవి. ఆ ఆందోళనలో డా|| హెడ్గేవార్‌ క్రియాశీలంగా పనిచేసిన సంగతి అందరికీ తెలుసు. 1930వ సంవత్స రంలో సత్యాగ్రహంలో పాల్గొనేందుకు డాక్టర్జీ నిర్ణయించుకున్నారు. ఆందోళనకు తాత్కాలిక మహత్య మెంత ఉన్నా అది ఒక నైమిత్తిక కార్యక్రమం మాత్రమే. ఈ నైమిత్తిక కార్యం పూర్తి కావాలి. కాని ఈ పనుల వల్ల సంఘ నిత్యకార్యానికి ఆటంకం కలగరాదు. ఈ సంతులనాన్ని పరిరక్షించాల్సి ఉంది. దానికి కావలసిన ఆలోచనలను డాక్టర్జీ చేశారు. కాబట్టి డాక్టర్జీ సత్యాగ్రహంలో పాల్గొనేముందు సరసంఘ చాలక్‌ బాధ్యత వేరేవారికి అప్పగించారు. సత్యాగ్రహానికి డాక్టర్జీ ఎంచుకున్న సమయం చూసినట్లైతే వాస్తవానికి సత్యాగ్రహం మార్చి మాసంలో ప్రారంభమైనా సంఘ శిక్షావర్గ పూర్తి అయిన తరువాత మాత్రమే డాక్టర్జీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1937వ సంవత్సరం వరకు డాక్టర్జీ సంఘకార్య పద్ధతి కాంగ్రెస్‌ కార్యక్రమాలకు మధ్య సంతులనం ఉంచడానికి ప్రయత్నం చేశారు. ఆ సంవత్సరం కాంగ్రెస్‌ సంకీర్ణ దశ స్వరూపాన్ని ధరించింది. ఆ సమయంలో డాక్టర్జీ ఇలా చెప్పాడు.
కాంగ్రెస్‌ జాతీయ స్వరూపాన్ని వీడనంతవరకు నేను దానిలో సభ్యునిగానే ఉన్నాను. కాంగ్రెస్‌ కేవలం ఒక పార్టీగా రూపాన్ని ధరించటం ప్రారంభించినప్పటి నుండి నేను దానిలో సభ్యుడిని కాను. మరోపక్క డాక్టర్జీ ప్రారంభం నుండి హిందూ మహాసభలో క్రియీశీలంగా ఉండేవారు. అందులో అనేక రకాల బాధ్యతలు నిర్వహించారు. హిందూ మహాసభ వారు డాక్టర్జీ ప్రారంభించిన సంఘం స్వయం సేవకులు తమ పనులన్నీ చేసిపెట్టాలి అని భావిస్తుండేవారు. నిత్య, అనిత్య వివేకంతో డాక్టర్జీ వ్యవహరించిన కారణంగా అన్ని రకాల ఉద్యమాల మధ్య సంఘకార్యం స్థిరంగా నిలబడింది. అంతిమ లక్ష్యం మీద దృష్టి ఉన్నా, తాత్కాలిక అంశాలను పట్టించుకోకుండా ఉండటం అవ్యవస్థిత మానసిక స్థితిగా డాక్టర్జీ భావించేవారు. అదే విధంగా తాత్కాలిక ఆవేశంతో కొట్టుకు పోవటం వల్ల అంతిమ లక్ష్యానికి దెబ్బ తగిలేటట్లయితే అది కూడా అవ్యవస్థిత మానసిక లక్షణంగానే భావించారు. అంతిమం తాత్కాలికం అయినా ఆవశ్యకతలో నిత్య కార్యాన్ని సంఘాను కూలంగా సంతులితంగా ఉండటం పరమ ఆవశ్యకం. ఈ సంతులనంలో వ్యక్తి నిరపేక్షతా, ధ్యేయనిష్ఠ స్పస్టంగా కనిపిస్తుంది. ఈ సంతుల నాన్ని డాక్టర్జీ ఎప్పుడూ కోల్పోలేదు. ఈ విషయాలను చాలామంది సరిగా అర్థం చేసుకోక పోవటం కారణంగా డాక్టర్జీ విషయంలో, సంఘం విషయంలో అసంతుష్టిగా ఉండేవారు. డాక్టర్జీ సంతులన స్థితికి లభించిన మూల్యం ఒకవైపు కాంగ్రెసీల అసంతుష్టి, మరొకవైపు హిందూ సోదరుల అసంతృప్తి రెండు వైపుల అసంతృష్టి వాయువులు వీస్తున్నా చింతించకుండా డాక్టర్జీ రాష్ట్ర నిర్మాణ కార్యంలో నిమగ్నమై పనిచేశారు.
దేశంలో పనిచేసే హిందూ సంస్థల ధోరణులను కూడా అర్థం చేసుకోవాలి. గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు అర్థం చేసుకొని పరిస్థితులను అధిగమించేందుకు డాక్టర్జీ వ్యవహార కుశలతను అర్థం చేసుకొని ముందుకు సాగాలి.
,,, భారతి....

No comments:

Post a Comment