శాంతి... సేవ అదే బాబా అభిమతం
సమత.. మమత.. మానవత మూర్తీభవించిన దైవ స్వరూపమే పుట్టపర్తి సత్యసాయి బాబా. ఓవైపు తన బోధనలతో మానవాళిని సన్మార్గం వైపు నడిపిస్తూనే చేతలతో ఆర్తులకు అండగా నిలిచారు. సామాన్యుడి జీవితం సాఫీగా సాగడానికి అడుగడుగునా ఆపన్నహస్తం అందించారు. స్వాత్రంత్యం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినా కరవు జిల్లాలో గుక్కెడు మంచినీళ్లు కూడా అందని గ్రామాలకు రక్షిత నీటితో దాహార్తి తీర్చారు. ప్రకృతి ప్రకోపానికి నీడ కోల్పోయిన వేలాది మందికి ఇళ్లు కట్టించి నీడనిచ్చారు. నేటి యాంత్రిక జీవనంలో మహమ్మారి రోగాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న లక్షలాది మందికి ఉచితంగా అత్యాధునిక వైద్యం అందించాలన్న ధ్యేయంతో దేశంలోనే ఎన్నదగిన సదుపాయాలతో ఆస్పత్రిని ఏర్పాటు చేసి ఏటా వేలాదిమందికి ప్రాణదానం చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా దేశ ప్రగతికి, వ్యక్తి ఎదుగుదలకు ఆటంకంగా నిలుస్తున్న నిరక్షరాస్యతను పారదోలడానికి ప్రాథమిక స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు విద్యను ఉచితంగా చేప్పే ఏర్పాటు చేసి పలు కుటుంబాల్లో అక్షర జ్యోతి వెలిగించారు.
కరవు సీమ ప్రజల దాహార్తి తీరుస్తూ సత్యసాయి అపర భగీరథుడిగా మన్ననలు అందుకున్నారు. ఫ్లోరైడ్ భూతం నుంచి అనంతపురం జిల్లాను కాపాడేందుకు సత్యసాయి బాబా శ్రమించారు. రూ.కోట్లు ఖర్చు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించటంలో సఫలీకృతులయ్యారు. రూ.500 కోట్లు వెచ్చించి సత్యసాయి పథకం ద్వారా అనంతపురం జిల్లాలోని 1447 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. దాదాపు 3,200 కిలోమీటర్లకు పైగా పైపులైను వేయించారు. బాబా తన 30వ ఏటనే పుట్టపర్తి కేంద్రంగా పరిసర గ్రామాల ప్రజలకు వైద్యం అందించేందుకు మొదట ప్రాథమిక ఆసుపత్రిని ప్రారంభించారు. అది 1991 నాటికి అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా పేదలకు అందుబాట్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందిస్తూ ఆసియాలోనే ప్రత్యేకత చాటుకుంది. బెంగళూరులోని సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ సైన్సెస్ పేరిట 306 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పారు. 2001 జనవరిలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి దీనిని ప్రారంభించారు. ఆసుపత్రి నిర్మాణానికి రూ.500 కోట్లు వెచ్చించారు. గుండె, మెదడుకు సంబంధించి ఇక్కడ చికిత్సలు ఉచితంగా నిర్వహిస్తారు. అదేవిధంగా 1970లో వైట్‌ఫీల్డులో మహిళలు, పిల్లలకు సేవలందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం దీన్ని 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దారు.
విద్య అంటే నాలుగు గోడల మధ్య నేర్చుకుని,పుస్తకాలతో కుస్తీపడితే వచ్చేదికాందటారు సత్యసాయి. అందువల్లనే సత్యసాయి విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులను గ్రామాల్లో జనం మధ్య తిరగమంటారు. జీవిత పాఠాలు నేర్చుకోమంటారు. అదేవిధమైన బోధన సాగేలా చూస్తున్నారు. మహోన్నత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మానవతా విలువలను మేళవించి నాణ్యమైన విద్యా ప్రమాణాలను అందిస్తున్న పుట్టపర్తి సత్యసాయి విశ్వవిద్యాలయం అరుదైన ఘనకీర్తి దక్కించుకుంది. ఇక్కడ ఓనమాల నుంచి డాక్టరేట్ పట్టా వరకు విద్య అందిస్తున్నాయి. ఇదంతా ఉచితమేనని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 1981లో సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్(సత్యసాయి యూనివర్సిటీ)ని ఏర్పాటుచేశారు. ఈ విశ్వవిద్యాలయ పరిధిలో ప్రశాంతి నిలయం క్యాంపస్, అనంతపురంలోని సత్యసాయి మహిళా కళాశాల, బెంగళూరులో బృందావన్ కళాశాల, దేవనహళ్లి సత్యసాయి క్యాంపస్‌లు ఉన్నాయి. ఏడు విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) అయిదు విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్(పీజీ), మూడు ప్రొఫెషనల్ కోర్సులు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఏటా నవంబరు మూడో వారంలో నోటిఫికేషన్ విడుదల చేసి ప్రవేశ పరీక్షల ద్వారా వీటిలో ప్రవేశం కల్పిస్తారు. క్రమశిక్షణ, అంకితభావం, సంఘసేవ తదితర వాటిల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
ప్రేమతత్వం విశ్వశాంతి సారాంశం. అలాంటితత్వమే సత్యసాయిబాబా అభిమతం. ఆధ్యాత్మిక బోధనలతో లక్షలాదిమంది భక్తులకు ఆరాధ్యునిగా సుపరిచితులైన బాబా 1926 నవంబరు 23న జన్మించారు. అనంతపురం జిల్లా గొల్లపల్లి(నేటి పుట్టపర్తి) స్వగ్రామం. ఆయన అసలు పేరు సత్యనారాయణరాజు. సాధారణ కుటుంబంలో జన్మించిన బాబా పలు ఆధ్యాత్మిక బోధనలు చేసి సత్యసాయి బాబాగా అవతరించారు.
పేరు: సత్యసాయిబాబా
ప్రథమ పేరు: సత్యనారాయణరాజు
తల్లిదండ్రులు: పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ
జననం: 1926 నవంబరు 23న కార్తీక సోమవారం
తల్లిదండ్రులకు బాబా రెండో సంతానం.
ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు
అన్న: కీ.శే. శేషంరాజు
అక్క: కీ.శే.వెంకమ్మ
తమ్ముడు: కీ.శే.జానకిరామయ్య
చెల్లెలు: కీ.శే.: పార్వతమ్మ
విద్యాభ్యాసం: 1 నుంచి 5వ తరగతి వరకు (1931 నుంచి 1936 వరకు) పుట్టపర్తి ప్రాథమిక పాఠశాలలో
* 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు (1936 నుంచి 1939) బుక్కపట్నంలో విద్యాభ్యాసం
* 9వ తరగతి ఉరవకొండలో (1939 నుంచి 1940 వరకు)
అనంతరం చదువు అర్ధంతరంగా ముగించారు.
* సత్యసాయిగా అవతారం: 1940లో తనను తాను సత్యసాయిగా ప్రకటించుకున్నారు.
చిత్రావతి నది ఒడ్డున కొండ కోనల్లో వెలసిన కుగ్రామం గొల్లపల్లి. ఇదే నేడు పుట్టపర్తిగా మారింది. ప్రపంచ పటంలోనే విశిష్టస్థానం చాటుకుంది. ఇక్కడే పెద వెంకమరాజు ఈశ్వరమ్మల దంపతులకు పుట్టిన సత్యనారాయణరాజు. బాబాగా అవతారమెత్తి ఆధ్యాత్మిక ప్రబోధకునిగా శాంతి సందేశాలు చేయడం మొదలుపెట్టారు. 1945లో ప్రశాంతి నిలయం నిర్మాణం చేపట్టారు. 1950లో దీన్ని ప్రారంభించారు. అది మొదట కుగ్రామం. అంచలంచెలుగా పట్టణమైంది. సత్యసాయి అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీగా ఏర్పడింది. క్రమంగా పుట్టపర్తి పర్యాటక కేంద్రంగా విలసిల్లింది. రోడ్డు, ప్రత్యేక రైలు మార్గంతోపాటు విదేశీభక్తుల రాకపోకలకు వీలుగా విమానాశ్రయం ఇక్కడ వెలసింది. పట్టణవీధుల్లోని సత్యసాయి విద్యాలయాలు, ప్రశాంతి నిలయంలోని ఒక్కో భవనం ప్రత్యేక ఆకృతిలో నిర్మితమై ఆధునిక దేవాలయాలను తలపిస్తున్నాయి.
బాబా తొలి ఉపదేశం
అనంతపురం జిల్లా పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడంతోపాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ విశ్వఖ్యాతి గడించిన సత్యసాయిబాబా తన అవతార ప్రకటన చేసినది ఉరవకొండలో. సత్యం,ప్రేమ, సేవ మానవాళికి పంచిన సత్యసాయిబాబా 14 ఏళ్ల వయస్సులో ఈ అవతార ప్రకటన చేశారు. బాబా 'అవతార పురుషుడి' ప్రకటన చేసే నాటికి ఉరవకొండ శ్రీకరిబసవస్వామి బోర్డు ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన సోదరుడు శేషంరాజు వద్ద ఉండేవారు. ఇక్కడే 8వ తరగతి చదువుతుండేవారు. విద్యార్థిగా ఉన్నప్పుడే మహిమలు చూపుతూ అందర్ని ఆశ్చర్యానికి గురి చేసేవారని చెబుతారు. 1940 అక్టోబర్ 20న బడికి బయల్దేరి పాఠశాల గేటు బయట నుంచే వెనక్కి మళ్లాడు. ఇంటికొచ్చి పుస్తకాల సంచి విసిరి వేశాడు. 'నేను సత్యనారాయణుడిని కాదు సాయిబాబాను! మాయ వీడినది. నేను కర్తవ్యాన్ని, లక్ష్యాన్ని నిర్వర్తించాల్సి ఉంది. నా భక్తులు పిలుస్తున్నారు. నేను వెళ్లాలని' బిగ్గరగా అరిచారు. ఈ మాటవిని ఆశ్చర్యపోయిన వదిన ఎంతగా వారించినా వినలేదు. భవబంధాలను తెగించి వెళ్తున్నానని చింతించవద్దని బయలుదేరాడు. స్థానిక అబ్కారీ ఇన్‌స్పెక్టర్ బంగ్లా ఆవరణ తోటలో పెద్ద బండరాయిపై కూర్చొని ధ్యానంలో మునిగిపోయారు. మానవజాతిని అసత్యం నుంచి సత్యం వైపునకు.. చీకటి నుంచి వెలుగు వైపునకు నడిపించే గురుచరణాలను పూజించి నిబ్బరమైన సంసార సాగరాన్ని దాటటానికి ప్రయత్నించండి అంటూ భక్తులకు ప్రబోధించారు. అలాగే వారితో 'మానస భజరో గురుశరణం భవసాగర తరణం' అనే భజన గీతాన్ని పాడించారు. ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉరవకొండ వచ్చారు. పుట్టపర్తికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా వెళ్లడానికి నిరాకరించడంతో తమ కళ్లెదుటే ఉండి ఆధ్యాత్మిక బోధనలు చేసుకోవచ్చని తల్లి కోరడంతో పుట్టపర్తికి చేరారు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం అక్కడే ఉండిపోయి సాయిబాబాగా పూజలు అందుకుంటున్నారు.
పుట్టపర్తి సత్యసాయి బాబా జీవిత చరిత్ర
సత్యసాయి బాబా 1926, నవంబర్ 23 న పెద్ద వెంకపరాజు, ఈశ్వరమ్మ దంపతులకు అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి కుగ్రామంలో జన్మించారు. సత్యనారాయణ వ్రతం తర్వాత జన్మించిన ఈ బిడ్డకు సత్యనారాయణ రాజు ( సత్యసాయి బాబా) గా నామాకరణం చేశారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాయిద్యాలు వాటంతటికి అవే మోగాయని చెబుతున్నారు. బాబా బుక్కపట్నం గ్రామంలో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. చిన్న వయస్సులోనే నాటకాలు , సంగీతం , కవిత్వం , నటన వంటి కళల్లో ప్రావీణ్య కనబర్చారు.
అక్కడ తన అన్న శేషమ రాజు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతుండుగా అప్పటి సత్యనారాయణ రాజు సైతం అక్కడే ఉరవకొండ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించారు. అయితే 1940 , మార్చి 8న యదావిధిగా పాఠశాలకు వెళ్ళిన సత్యనారాయణ రాజు కొద్ది సేపటికి ఇంటికి వచ్చి పుస్తకాలను పక్కన పెట్టి తాను సత్యనారాయణరాజును కాను సత్యసాయి బాబాను అంటూ ప్రకటించకున్నారు. అక్కడికి సమీపంలోని ఓ రాతి గుండు పై కూర్చుని ‘‘ మానస బజరే హరిచరణం ’’ అన్న కీర్తనను ఆలపించారు.
అక్కడ నుంచి బాబా కుటుంబీకులు పుట్టపర్తికి తీసుకురాగా బాబా మహిమలు గుర్తించిన భక్తులు రావడంతో అధికం కావడంతో 1944లో భక్తులు బాబాకు ఆశ్రమాన్ని నిర్మించారు. అయితే భక్తుల సంఖ్య పెరగడంతో 1948 లో ప్రస్తుతం వున్న ప్రశాంతి నిలయం నిర్మాణం చేపట్టారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా ఆశీస్సులు కోసం వచ్చే భక్తులు సంఖ్య పెరగడంతో ప్రశాంతి నిలయం సైతం అన్ని హంగులతో విశాలంగా తీర్చిదిద్దారు. కాగా తాను షిరిడి సాయిబాబా అవతార పురుషుడుగా ప్రకటించుకున్న సత్యసాయి బాబా తిరిగి తాను ప్రేమా సాయి బాబాగా అవతరిస్తానని 1976 లో భక్తులకు ఇచ్చిన ఆధ్యాత్మిక సందేశంలో తెలిపారు.
సత్యసాయి బాబా ఆశీస్సుల కోసం దే శ , విదేశాలు నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో బాబా కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్దకెక్కిడంతో నేడు దాదాపు 146 దేశాల్లో సత్యసాయి బాబా భక్తులు వున్నారు. నాటి కుగ్రామంగా వున్న పుట్టపర్తి నేడు అంతర్జాతీయ చిత్ర పటంలో గుర్తించబడిందంటే అ ఘనత సత్యసాయి బాబా బోధించే అధ్యాత్మిక బోధనల ప్రభావమే అనడంలో అతిశయోక్తిలేదు.
No comments:
Post a Comment