ఉపమాక కల్యాణోత్సవాలు ప్రారంభం
నక్కపల్లి : ఉపమాక వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవ కార్యక్రమం సోమవారం రాత్రి అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 గంటలకు స్వామివారి పెళ్లి కావిడిని ఉపమాక మాడవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు స్వామివారికి పసుపు కొమ్ములు, కుంకుమ, కొబ్బరి బొండాలు సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా కల్యాణోత్సవాలు ప్రారంభమైనట్టు భక్తులకు తెలియజేయడం జరిగిందని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. అనంతరం స్వామివారి గర్భాలయంలో విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్‌వరుణ నిర్వహించారు. అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా పుట్టమన్ను తెచ్చేందుకు పెరుమాళ్లను తీసుకెళ్లారు. అంకురార్పణ అనంతరం ఆలయంలో స్వామివారికి తిరువీధిసేవ, కల్యాణమండపంలో స్వామివారిని, ఉభయదేవేరులను వేంచేయింపజేసి వాస్తు మండప పూజ, యోగేశ్వర మండప పూజ, అగ్నిముఖ నిర్వహణ, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలతో కల్యాణోత్సవాలు లాంచనంగా ప్రారంభమయ్యాయని ఆలయ ప్రధానార్చకులు తెలిపా రు.
ఈ కార్యక్రమాల్లో పాలకమండలి చైర్మన్ చిలువూరి రామసూర్యనారాయణరాజు, నున్న శుభాష్ పాల్గొన్నారు. కల్యాణోత్సవం సందర్భంగా విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, పార్వతీపరమేశ్వరులు, అలివేలుమంగ వేంకటేశ్వరస్వామి రూపాలతో ఉన్న విద్యుత్ సెట్టింగులను ఏర్పాటు చేశారు. కొండపై మూలవిరాట్ వద్దకూడా మూడు నామాలతో ఉన్న లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్‌దీపాలంకరణకు హెట్రోరసాయనిక పరిశ్రమ చైర్మన్ పార్థసారధిరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు.
No comments:
Post a Comment