పీసీసీ నాయకత్వం కాపుకు’, ‘మంత్రివర్గవిస్తరణలో ఇద్దరు కాపులు’, ‘కొత్త సమాచార కమిషనర్లలో ఇద్దరు కాపులు’. అసలు కాపులకు ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళను ఈ స్థాయిలో ఎందుకు అందలాలెక్కిస్తున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో మీడియాలో ఇదో పెద్ద చర్చ అయి కూర్చుంది. మరోవైపు, ఉన్నట్లుండి కాపులకు లభిస్తున్న ఈ గుర్తింపుపై మిగిలిన కులాల్లో(ముఖ్యంగా వెనకబడిన వర్గాలలో) కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. అయితే కాపువర్గాలు మాత్రం, కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న కుల రాజకీయ చదరంగంలో తమ వర్గం పావులాగా మారడం వలన తాము ఇలా అందరి వ్యతిరేకతను మూటకట్టుకోవలసి వస్తోందని వాపోతున్నాయి.
అయితే ఈ పరిణామాలపై కాపువర్గం మాత్రం సంతృప్తిగాలేదు. ఈ పదవుల పందేరం తమకు, మిగిలిన వర్గాలకు మధ్య విబేధాలు రగిలించేవిధంగా ఉందని కాపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి రెడ్లు, కమ్మలు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని, సంఖ్యాపరంగా రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన తమ కులంపై - కాంగ్రెస్ పార్టీకి కొత్తరాజకీయ సమీకరణాలరీత్యా ప్రేమ అంకురించి రెండు, మూడు పదవులు ఇచ్చినంత మాత్రాన తమకు న్యాయం జరిగినట్లు కాదని కాపువర్గం నాయకులు అంటున్నారు. పైగా ఈ రెండు, మూడు పదవుల వలన తమ వర్గం బావుకున్నదేమీ లేకపోయినా మీడియాలో రచ్చ జరుగుతోందని, బీసీలు, తదితర కులాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపులకు ఇప్పుడు ఇచ్చిన పదవుల్లో బీసీలు కూడా ఉన్నారని వారు గుర్తు చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెనుకబడినవర్గానికి చెందిన తూర్పుకాపు కులంవారని, కొత్తమంత్రి రామచంద్రయ్య కూడా బీసీ వర్గానికి చెందిన బలిజకులస్తుడని, ఇక విజయనిర్మల అసలు కాపే కాదని తెలిపారు. ఆమె కేరళరాష్ట్రంనుంచి వలసవచ్చి స్థిరపడ్డవారని వివరించారు. చిరంజీవి అనుభవరాహిత్యంవలన, కాపులను సంఘటితపరిచే సరైన నాయకత్వం, కులవేదిక లేకపోవడం వలన సమాజంలో పలచనబడిపోతున్నామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న వివిధ కాపుసంఘాల నాయకులు, కులాన్ని డబ్బుచేసుకోవడం, ప్రభుత్వంలో పైరవీలు చేసుకోవడం, నాయకత్వలక్షణాలు లేక సంకుచిత ధోరణితో లోలోపల కొట్టుకోవడంతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారని వాపోతున్నారు. చాకలి, మంగలి, మాదిగ వంటి కులవృత్తులవారుకూడా, తమ కులాన్ని గురించి ఎవరైనా మాటవరసకు తక్కువగా ప్రస్తావించినా క్షమాపణ చెప్పేదాకా ఊరుకోకపోతుండగా, కాపులను ఎవరు ఎన్ని తిట్టినా ఖండించే దిక్కులేదంటున్నారు. ఇటీవల బాలకృష్ణ వివిధ సభలలో చిరంజీవిని ప్రస్తావిస్తూ, వాడు, వీడు అంటూ హేయంగా మాట్లాడితే, రాష్ట్రస్థాయిలో ఖండించే కాపు నాయకడు ఒక్కడు కూడా లేకపోవడాన్ని నాయకత్వలేమికి ఉదాహరణగా వారు చూపుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఫలించి కాపుల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడతాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశమయింది. సామాజిక న్యాయం అనే నినాదంతో చిరంజీవి 'ప్రజారాజ్యం'పార్టీని పెట్టినపుడు కాపులతోబాటు, వెనకబడినవర్గాలు కూడా ఆసక్తి చూపాయి. అయితే, ధృడసంకల్పం లేకుండా, బెరుకు బెరుకుగా పార్టీని పెట్టిన చిరంజీవి మొదట్లో ఉవ్వెత్తునవచ్చిన అద్భుత ప్రజాదరణను నిలుపుకోలేకపోయారు. నిజాయతీగా బ్లడ్ బ్యాంకును నడుపుతున్నప్పటికీ వ్యతిరేకపార్టీలు దానిమీద నిందారోపణలు చేస్తే తిప్పికొట్టే నాధుడు ప్రజారాజ్యంలో ఒక్కడూ లేకపోయారు. ఆ తర్వాత వైరివర్గాలు ఇంకా రెచ్చిపోయి ఆ పార్టీని కాపుపార్టీగా ముద్రవేసేసి, టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ప్రచారం చేశాయి. దాంతో మెల్లమెల్లగా బడుగు, బలహీనవర్గాలు ప్రజారాజ్యానికి దూరమయ్యాయి. కాపులు కూడా ప్రజారాజ్యానికి గంపగుత్తగా ఏమీ ఓట్లేయలేదు. గోదావరిజిల్లాలో కాపులు నిర్ణయాత్మకంగా ఉండేచోట్లకూడా ప్రజారాజ్యం ఓడిపోవడమే దీనికి నిదర్శనం. అమాయకంగా, అనుమానంగా చిరంజీవి, అతితెలివితో ఆయన బావమరిది అల్లుఅరవింద్ చేసిన పనులవలన ఆ పార్టీ, ఎన్నికలనాటికి దిగజారిపోయి అతికొద్ది అసెంబ్లీస్థానాలకే పరిమితమైపోయింది. ప్రజారాజ్యం పెట్టిన తొలినాళ్ళలో అపూర్వరీతిలో సంఘటితమైన కాపులు, ఇప్పుడు అదేస్థాయిలో తమ హస్తంతో చేయి కలుపుతారని కాంగ్రెస్ పెద్దలు ఆశిస్తున్నారు. కమ్మలు తెలుగుదేశాన్ని, రెడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భావించినట్లుగానే(వాస్తవానికి రెడ్లు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రెండింటిలోనూ గణనీయమైన పదవులే పొందినప్పటికీ, కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తమ సొంతపార్టీగా భావిస్తుండటం విశేషం), కాపులు కాంగ్రెస్ పార్టీని తమదిగా భావించాలని(ఓన్ చేసుకోవాలని) వారి ఆకాంక్ష. మరి అది నేరవేరుతుందో, లేదో వేచి చూడాలి.
No comments:
Post a Comment