మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామాకు సిద్ధపడుతున్నట్లుగా సమాచారం. తన శాఖలో కత్తిరింపుపై ఆయన పూర్తి అవమానభారంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. తన పరిధిలో ఉన్న శాఖల్లో ప్రాధాన్యత కలిగిన వాటిని కత్తిరించి, ప్రాధాన్యత లేని శాఖలను మాత్రమే తన వద్ద అట్టిపెట్టడం పట్ల ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్ల అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. తన అసంతృప్తిని ఆయన మంగళవారం ఉదయమే ప్రకటించారు. కిరణ్ తనను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్న డిఎల్ మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. ఆయన మంగళవారం రాత్రి కడప జిల్లా నుండి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణనను కలవనున్నారని సమాచారం. ఆయనను సంప్రదించిన తర్వాత రాజీనామాపై తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. సహజంగా ముక్కుసూటి వ్యక్తిత్వం కలిగిన డిఎల్ ముఖ్యమంత్రితో కొన్ని పథకాలపై విభేదించారు. ప్రధానంగా రూపాయికి కిలో బియ్యం, 108 నిర్వహణపై ఆయన సిఎంతో విభేదించారు. తనకు అండగా ఉంటాడని భావించి మంత్రివర్గంలోకి తీసుకున్న డిఎల్, తనకు మేకులా మారడంతో సిఎం రూటు మార్చారని అంటున్నారు.
శంకర రావుతో పాటు డిఎల్ రవీంద్రా రెడ్డిని కూడా మంత్రివర్గం నుండి తొలగించేందుకు అనుమతివ్వాలని ముఖ్యమంత్రి అధిష్టానాన్ని అడిగినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే కడప జిల్లాలో బలమైన నేతగా ఉన్న డిఎల్ రవీంద్రా రెడ్డిని మంత్రివర్గం నుండి తొలగిస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన అధిష్టానం అందుకు అనుమతించలేదని సమాచారం. జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే డిఎల్ వంటి బలమైన నేత అవసరం ఉంటుందని అధిష్టానం సిఎంకు సూచించిందని సమాచారం. గత ఉప ఎన్నికల్లోనూ జగన్‌పై పోటీకి ఎవరూ ముందుకు రాని సమయంలో, అధిష్టానం ఆదేశించడంతో డిఎల్ పోటీ చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న అధిష్టానం డిఎల్‌ను తొలగించేందుకు ససేమీరా అన్నదని సమాచారం. దీంతో ముఖ్యమంత్రి వెనక నుండి నరుక్కొస్తున్నారని అంటున్నారు. డిఎల్‌కు కేబినెట్లో క్రమంగా ప్రాధాన్యత తగ్గించడం ద్వారా ఆయనను తొలగించవచ్చునని సిఎం భావిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment