ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి ఇంటికి వెళ్లారు. రాష్ట్రంలో అటు డీఎల్ అసంతృప్తితో సీఎంపై ఫైర్ అవడం, ఇంకోవైపు మోపిదేవి వెంకట రమణ చిక్కుల్లో ఇరుక్కున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం చిరు ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది.
కాగా చిరంజీవితో ముఖ్యమంత్రి భేటీ సందర్భంగా పలు కీలక విషయాలను ప్రస్తావించినట్లు సమాచారం. అందులో మొదటిది తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రజారాజ్యం ఎమ్మెల్యేల అంశం.
ప్రజారాజ్యం పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు మొన్నటి మంత్రివర్గ విస్తరణలో మొండి చేయి చూపారు. అయితే చిరంజీవి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు కూడా న్యాయం జరిగేట్లు చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే అనిల్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ విప్ పదవిని ఇవ్వాలని చిరంజీవి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే చీఫ్ విప్‌గా వరంగల్ జిల్లాకు చెందిన గండ్ర వెంకటరమణా రెడ్డి, విప్‌లుగా మోహన్, శ్రీనివాస్‌లు పేర్లు ముందుకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వాలన్న దానిపై రెండు మూడు రోజుల్లో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేస్తే ఉపఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లో జగన్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు చిరంజీవితో ఎన్నికల ప్రచారం చేయించాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారనీ, ఈ అంశంపై కూడా చిరంజీవితో చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద చిరంజీవికి దగ్గరగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జరుగుతున్నట్లు అవగతమవుతోంది.
No comments:
Post a Comment