Wednesday, November 16, 2011

ధరలపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు...


ధరలపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు – రచ్చబండలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
‘పేద కుటుంబాలు మూడు పూటలా కడుపునిండా అన్నం తినాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీని కోసమే రూపాయికి కిలో బియ్యం అమలుచేస్తున్నాం. కానీ మిగిలిన ధరలు భారీగా పెరిగిపోయినందున ఎలా కుటుంబాన్ని నెట్టుకురావాలన్నదే మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్న ప్రశ్న అని నాకు తెల్సు. అందుకే సంచలనాత్మకమైన రీతిలో ధరల నియంత్రణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి, మంత్రిని కూడా నియమించనున్నాం…’ పశ్చిమగోదావరి రచ్చబండలో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన కీలకమైన ప్రకటన ఇది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో 15-11-2011తెది మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రూపాయికి కిలో బియ్యం పథకం ప్రయోజనాలు, విశిష్టతలను వివరిస్తూనే మిగిలిన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవటం ప్రజలకు ఆందోళన కలిగిస్తోందని అంగీకరించారు. పేదలకు ప్రయోజనకరంగా ధరలను నియంత్రించడానికి వీలుగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బ్లాక్‌మార్కెట్‌ను నియంత్రించడానికి మానిటరింగ్ సెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు తాము తీసుకున్న రుణం లక్ష రూపాయల వరకు ఏడాదిలోపే తిరిగి చెల్లిస్తే వడ్డీ ఉండబోదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ వడ్డీ భారాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు భరిస్తాయని చెప్పారు. మరోవైపు మహిళలకు త్వరలోనే మంచి శుభవార్తను ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగానే పావలా వడ్డీ రాయితీ అందరికి అందుతోందా అంటూ డ్వాక్రా మహిళలను ప్రశ్నించగా కొంతమంది వస్తోందని, మరికొందరు రావటం లేదని సమాధానాలు చెప్పటంతో పావలా వడ్డీ పథకంలో ఇదొక సమస్యగా మారిందని, ప్రభుత్వం కూడా గుర్తించిందని సిఎం చెప్పారు. దీనిని పరిష్కరించడానికి ఇకనుంచి నేరుగా గ్రామాల్లోని సంఘాలకు వడ్డీ రాయితీ జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేసమయంలో వేదికపై ఉన్న మంత్రి సునీతాలక్ష్మారెడ్డిని దీనికి సంబంధించి ఉత్తర్వులు వెంటనే వెలువడేలా చూడాలని ఆదేశించారు. దీంతో మహిళలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.
రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చెప్పారు. ధాన్యానికి మద్దతుధర విషయంలో అదనంగా 120 రూపాయల బోనస్ చెల్లించాలని ఇప్పటికే ప్రధానమంత్రిని కోరామన్నారు. మత్స్య, పౌల్ట్రీల నుండి నాలా ఛార్జీలు వసూలు చేసే పద్ధతికి స్వస్తి పలకనున్నట్లు సిఎం ప్రకటించారు. అదేవిధంగా జిల్లాలో పెద్దఎత్తున సాగుతున్న చేపలు, రొయ్యల ఎగుమతులను మరింత ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైతురుణాలపై అమలుచేస్తున్న ఏడు శాతం వడ్డీ రేటును మహిళా గ్రూపులకు కూడా అమలుచేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. పావలా వడ్డీ కంటే తక్కువకే మహిళా సంఘాలకు రుణాలు అందించగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొల్లేరు అభయారణ్య పరిధిని అయిదవ కాంటూరు నుంచి మూడవ కాంటూరుకు తగ్గించడానికి ప్రభుత్వం తరపున ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సిఎం వరాల జల్లు కురిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంతకుమార్, పితాని సత్యనారాయణ, సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీలు కావూరి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, ఉండవల్లి అరుణకుమార్, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానితోపాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన ప్రారంభం
గర్భిణీలను ఆదుకోవడానికి కేంద్రం ప్రకటించిన ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజనను రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. ఏలూరులో ఇందుకు సంబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో 56వేల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చడానికి ఏడున్నర కోట్ల రూపాయలను ఆయన విడుదల చేశారు. అంతకుముందు దాదాపు 125 కోట్ల రూపాయలతో ఏలూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

No comments:

Post a Comment