Wednesday, November 9, 2011

ప్రజలు కరెప్ట్ అయితే నాయకులు ఏం చేస్తారు..?: జయసుధ


సినిమా రంగం నుంచి అనుకోకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి సికింద్రాబాద్‌ ఎం.ఎల్‌.ఎ.గా ఎన్నికయ్యారు నటి జయసుధ. అటు రాజకీయాల్లోనూ తన సేవ చేస్తూనే మరోవైపు తనకు లైఫ్‌ ఇచ్చిన సినిమా రంగాన్ని వదలనని చెబుతున్నారు. ప్రస్తుతం సినిమారంగంలో బిజీగా ఉన్నానంటున్న జయసుధ... రాజకీయాల గురించి చర్చించారు. ఆమె చెప్పిన పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం...

'ఇట్స్‌ మై లవ్‌స్టోరీ'లో మీ పాత్ర ఎలా ఉంటుంది? 
చాలా మంచి పాత్ర. ఇంటిలో తల్లి, బిడ్డ రిలేషన్స్‌ ఎలా ఉంటాయో సినిమాల్లోనూ అలాగే ఉన్నాయి. నిఖిత నా కుమార్తెగా నటించింది. కొన్ని సీన్స్‌ చేస్తున్నప్పుడు నా ఇంట్లో మా పెద్దబ్బాయితో మాట్లాడే సందర్భాలు గుర్తుకు వస్తున్నాయి. చాలా నాచురల్‌గా దర్శకుడు శ్రీధర్‌ తెరకెక్కించారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? 
రాజకీయాల్లో ఉండటం వల్ల కొన్ని తగ్గించాను. ఇది కాక.. 'సోలో' సినిమా చేశాను. బాలకృష్ణతో 'అధినాయకుడు' (ఇంకా పేరు పెట్టలేదు) చిత్రంలో నటించాను. తొలిసారిగా ఆయన కాంబినేషన్‌లో చేయడం చాలా థ్రిల్‌గా అనిపించింది. ఇందులో బాలకృష్ణ మూడు తరాలకు చెందిన మూడు పాత్రలు పోషించారు. అందులో మొదటితరం చెందిన పాత్రకు భార్యగా చేశాను. 

ఇప్పటి సినిమాలు మీకెలా అనిపిస్తున్నాయి? 
ఇప్పటి యూత్‌ మంచి సినిమాలు తీయాలి. చాలావరకు కొన్నిలిమిట్స్‌ వరకే పరిమితం అవుతున్నారు. ప్రేమ అనే కాన్సెప్ట్‌తో చాలా చిత్రాలు వచ్చాయి. రొటీన్‌గా ఉంటున్నాయి. ఇటీవలే 'నైనా' తెలుగులో ప్రేమఖైదీ చూశాను. ప్రేమికుల మధ్య సంబంధాలు ఇలాగ కూడా చూపించవచ్చా అని ఆశ్చర్యపోయాను. గొప్ప ప్రయత్నం. ఆడకపోయినా కంటెంట్‌, తీసే విధానం బాగుంది. 

మొన్నీమధ్య వచ్చిన 'సెవెన్త్‌ సెన్స్‌' గొప్పప్రయత్నం. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇటువంటి కొత్తకొత్త చిత్రాలు రావాలి. చెప్పే విధానంలో కొత్తదనం ఉంటేనే ఆకట్టుకుంటుది. బొమ్మరిల్లు తీసుకుంటే.. అందులో ప్రేమలో రకరకాల షేడ్స్‌ ఉన్నాయి. ప్రేయసీప్రియులతోపాటు తల్లిదండ్రులతో ప్రేమ సంబంధాలు సరికొత్తగా ఉన్నాయి. అలా కొత్త ప్రయత్నాలు తెలుగులో ఇంకా రావాలి.

రాజకీయాల్లో మీరు ఏం నేర్చుకున్నారు? 
అబ్బో! రాజకీయాల్లో చాలా నేర్చుకున్నాను. రోజూ కొత్తకొత్త విషయాలు తెలుస్తాయి. ఎన్నో రకాల మీటింగ్స్‌, వ్యక్తుల్ని కలుస్తుంటాం. ట్రూ పొలిటిషన్‌ అవ్వాలంటే కనీసం 10 ఏళ్ళ సర్వీస్‌ ఉండాలి. అయినా రాజకీయాలు కావాలని నేను వెళ్ళి ఎవర్నీ అడగలేదు. వై.ఎస్‌.ఆర్‌. పిలిచి నీకు సోషల్‌ వర్క్‌ అంటే ఇష్టం కదా... ఇక్కడకు వచ్చి చేయమన్నారు.

'ఆరోగ్యశ్రీ' అప్పుడే మొదలైంది. దాని ద్వారా ఇంకా పేదలకు మరింత సేవ చేయాలని అనుకున్నాను. ప్రతీదీ అది కావాలి.. ఇది కావాలి.. అంటూ ప్రజలు బిచ్చగాళ్ళలా అడుక్కుతిన్నట్లు రాజకీయాలపై ఆధారపడం నాకు నచ్చలేదు. అందుకే ఏదో చేయాలని ఈ రంగంలోకి వచ్చాను.

మరి అనుకున్నది చేయగలిగారా? 
ఏమీ చేయలేమని తెలిసిపోయింది. ఏదో చేయాలని ట్రై చేస్తున్నాం.

అంటే...?!! 
ముందుగా ప్రజలు లైఫ్‌స్టైల్‌ మార్చుకోవాలి. అప్పుడే ఏదైనా చేయగలం. నా నియోజకవర్గంలో 65 బస్తీలున్నాయి. వాటిలో తిరుగుతుంటే... హైటెక్స్‌ అంటూ గొప్పలు చెప్పుకునే మన సిటీలో ఇంత దరిద్రంగా బస్తీలున్నాయా? అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అన్నిచోట్లా వాటర్‌, డ్రైనేజీ ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి. రోడ్డుపై పేదలకు కట్టిన టాయ్‌లెట్స్‌ ఆర్భాటంగా ఓపెన్‌ చేస్తారు. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోరు. అధికారుల్ని అడిగితే.. అది అంతే మేడమ్‌. వారికి ఎంత చేసినా అంతేనంటారు. 

పేదలకు క్వార్టర్స్‌ కట్టారు. నాలుగు అంతస్తులు ఉన్నాయి. లిఫ్ట్‌ ఉండదు. ఒకవేళ కడితే.. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయరు. చెత్తవేయడానికి సెపరేట్‌ ప్లేస్‌‌లు ఉన్నాయి. కానీ బస్తీల్లో రోడ్డుపైనే చెత్తనంతా వేస్తారు. విపరీతమైన కంపు... దోమలు.... 200 రూపాయలకు ఓటువేసి.. ప్రజలు కరెప్ట్‌ అయితే.. సమస్యల గురించి అడిగే హక్కు ఉండదు.

మీవంతుగా ఏదైనా చేశారా? 
చాలా చేయాలనుకున్నా.. కానీ ఏమీ చేయలేకపోతున్నా... నాలాంటి వందమంది జయసుధలు వచ్చినా ఏమీ చేయలేం అని తెలుసుకున్నాను. ప్రజల్లో చైతన్యం లేదు. స్వలాభమే చైతన్యం. నాలాలపై ఇళ్లు కడుతుంటారు. దాంతో డ్రైనేజీ పొంగుతుంది. తర్వాత వాళ్ళే వచ్చి.. సమస్యలు వస్తున్నాయ్‌ అని ఎం.ఎల్‌.ఎ.లపై తిరగబడతారు. అది ధర్నా వరకు దారితీస్తుంది. 

ఇదంతా చూసి హ్యూమన్‌ రైట్స్‌ వారు వస్తారు. వారు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా.. ఒక వేళ తెలిసినా.. ఏదో పోరాటం చేయాలని... ప్రజలకే సపోర్ట్‌ చేస్తారు. ప్రజలు ఏం చేశారు. ఎందుకిలా అయిందని వారికి చెప్పరు. అధికారులు ఎంత చెప్పినా వినరు. మీడియా దీన్ని చిలువలు పలవలు చేస్తుంది. దీంతో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇస్తాం. తర్వాత మళ్లీ సమస్య మామూలే. నాలాలపై ఇళ్లు కట్టడం మానరు. దాన్ని కూలిస్తే.. అదే పెద్ద నేరం... ముందుగా మనం శుభ్రంగా ఉండాలి. ఇంటి పరిసరాల్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ప్రజల్లో లేనంతవరకు ఏమీ చేయలేం.

నిర్మాతగా మారే ఆలోచన ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి? 
నేను నిర్మాతగా మారే ఆలోచన లేదు. మా పెద్దబ్బాయి నిహార్‌కపూర్‌ డిజిటల్‌ టెక్నాలజీ ఆస్ట్రేలియాలో చేశాడు. తను దర్శకుడు అవ్వాలని కోరిక. ఇక రెండోవాడు.. శ్రియన్‌కపూర్‌ మంచి షూటర్‌. నేషనల్‌ లెవల్‌ కాంపిటేషన్‌లో కూడా పాల్గొన్నాడు.. అని ముగించారు.

No comments:

Post a Comment