Saturday, November 26, 2011

సొంత పార్టీ నేతలే కిషన్ జీ ఎన్‌కౌంటర్‌కి కారణమా?

సొంత పార్టీ నేతలే కిషన్ జీ 

ఎన్‌కౌంటర్‌కి కారణమా?


మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌కు, అసోం వేర్పాటువాద సంస్థ ఉల్ఫాకు సంబంధం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే సొంత పార్టీ నేతలే కిషన్ జీ  మరణానికి కారణం అయ్యారనే సందేహాలు వున్నాయి .దక్షిణ, ఉత్తర భారతాన్నంతా ఏదో మేరకు ప్రభావితం చేయగలుగుతున్న మావోయిస్టు పార్టీకి 'ఈశాన్యం' కొరకరాని కొయ్యగా మారింది.  ఈ నేపధ్యం లో అసోంలో పాగా వేసేందుకు గత పది, పదిహేనేళ్లుగా ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది . బెంగాల్ సరిహద్దుల్లో ఉండటం, భద్రతా బలగాల దాడుల తాకిడి తక్కువగా ఉండి షెల్టర్‌కు అనువుగా ఉండటం వల్ల కూడా అసోంపై కన్నేశారు. దీనికోసం ఉల్ఫాతో చాలాకాలంగా చర్చలు జరుపుతున్నారు.  ఈ చర్చల కోసం 2008లో కిషన్‌జీ బంగ్లాదేశ్ వెళ్లి బారువాను కలుసుకున్నారు. మావోయిస్టులకు అవసరమైన మౌలికమైన వనరులకు సంబంధించిన మద్దతు ఇవ్వటానికి అంగీకరిస్తూనే.. 'దాడుల' ప్రతిపాదనను మాత్రం తోసిపుచ్చారు. దీంతో ఇకపై ఉల్ఫాతో చర్చలకు వెళ్లరాదని మావోయిస్టులు నిర్ణయించారు. అసోంలో స్వయంగానే ఎదిగే ప్రయత్నం చేశారు. అప్పర్ అసోం లీడింగ్ కమిటీ (యూఏఎల్‌సీ) అనే సంఘం పెట్టి.. విస్తరణ వ్యూహాలను అమలు చేశారు. రిక్రూట్‌మెంట్, విరాళాల సేకరణపై దృష్టి సారించారు. ప్రస్తుతం వంద మందికిపైగా అసోమీలు మావోయిస్టు పార్టీలో చేరినట్టు సమాచారం. "అసోం-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో మావోయిస్టుల శిక్షణా శిబిరాలు ఉన్నాయి. సాదియా, తిన్‌సూకియా జిల్లాలో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఒక్కప్పుడు ఇవి ఉల్ఫాకు పెట్టని కోటలు. తమ ప్రాంతంలోకి మావోయిస్టులు రావటంపై స్థానిక ఉల్ఫా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారుఅయితే, ఒక్క ఉల్ఫాయే కాదు, పోలీసులు, సైన్యం కూడా 'మావోయిస్టు' ప్రమాదాన్ని గుర్తించి  నిఘాను పెంచి గాలింపు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మావోయిస్టులు దొరకలేదు గానీ, ఉల్ఫాకు చెందిన కార్యకర్తలు మరణించారు. దీంతో  బారువా కలవరపడ్డారు. మావోయిస్టులను అసోం నుంచి తరిమేయాలని నెల క్రితం ఆయన తన కేడర్‌కు ఆదేశాలు జారీ చేశారని, దీని కోసం ఉల్ఫా కొన్ని దళాలను కూడా ఏర్పాటు చేసిందని నిఘా వర్గాల సమాచారం . పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న కిషన్‌జీ ఈ దశలోనే అసోంలో అడుగు పెట్టారు . బెంగాల్‌లో మూడు దశాబ్దాల కమ్యూనిస్టు కోటను కూల్చివేయడంతో కీలక పాత్ర  పోషించిన ఆయనకు..'అసోం' టాస్క్ అప్పగించారని తెలుస్తోంది. అలా అసోం చేరాడు  అనుకున్న కిషన్‌జీ గురువారం బెంగాల్‌లోని జంగల్‌మహల్‌లో శవమై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అసోంలోనే పట్టుకొని, బెంగాల్‌లో కాల్చి చంపి ఉంటారన్న అనుమానాన్ని సానుభూతిపరులు వ్యక్తం చేస్తున్నారు. కాగా బెంగాల్ కమిటీలో కిషన్‌జీ తీరు నచ్చని నేతలే బలగాలకు ఉప్పందించారనే   పుకార్లు  కూడా  వున్నాయి .అధికార వర్గాలు చెబుతున్నాయి. "అసంతృప్త నేతల నుంచి కిషన్‌జీ ఆనుపానులను భద్రతా బలగాలు తెలుసుకుని   ఉచ్చు బిగించి, కిషన్‌జీని ఎన్‌కౌంటర్‌లో అంతం చేశాయి'' అనే వాదనలు విన్పిస్తున్నాయి.

No comments:

Post a Comment