నిజాయితీని నిరూపిస్తాం
తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్‌లో గతంలో ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఆరోపించిన అంశాలే ఉన్నాయని తెలుగుదేశంపార్టీ పేర్కొంది. అనేక కేసులు విచారణకు అర్హత లేవని కోర్టులే తోసిపుచ్చాయని, అవే అంశాలతో మళ్ళీ కోర్టులో ఫిర్యాదు చేశారని ఆపార్టీ దుయ్యబట్టింది. విజయమ్మ పిటిషన్‌పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు సహజ న్యాయ సూత్రాలు కూడా పాటించకపోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ విచారం వ్యక్తంచేసింది.ప్రతివాదికి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడం, పిటిషన్ ఒకటైతే హైకోర్టు మరో ఆదేశం ఇచ్చిందని మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెదేపా శాసనసభ్యులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఏ.రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి రొచ్చులోకి దిగి, ఆ రొచ్చును ఇతరులపైకి చల్లే ప్రయత్నం చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. 1975 నుంచి చంద్రబాబుపై ఇవే ఆరోపణలు చేసి 18సార్లు కోర్టుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు పిటిషన్లు వేశారని, వాటిని నిరూపించలేక కొన్ని ఉపసంహరించుకోగా, మరికొన్నింటిని కోర్టులు కొట్టివేశాయని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుపై వేసిన పిటిషన్లు విచారణకు అనర్హమైనవని కోర్టులు తోసిపుచ్చాయని ఆయన చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ కేసులో కూడా గతంలో చేసిన ఆరోపణలపై పిటిషన్ వేసి ఎన్నికలు కాగానే ఉపసంహరించుకున్నారని ఆయన చెప్పారు. 1999, 2004 మధ్య ఐదేళ్ళపాటు ఏ ఒక్క రాజ్యాంగ వ్యవస్థను కూడా చర్య తీసుకోమని కోరలేదంటూ ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడానికి కూడా ఈ అంశాలకు అర్హత లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టంచేసిందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైకోర్టు తీర్పును ప్రశ్నించడం, కించపరచడం తమ ఉద్దేశం కాదని, కోర్టులను, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తామని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. అలాంటి వ్యక్తిని కూడా సిబిఐ విచారణ పరిధిలోకి తీసుకురావడం బాధాకరమన్నారు. తాము న్యాయ వ్యవస్థనుగానీ, సిబిఐగానీ ప్రశ్నించడం లేదని, విజయమ్మ పిటిషన్ ఆరోపణలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు గత చరిత్రను మరోసారి గుర్తు చేస్తున్నామని బొజ్జల అన్నారు. సింగపూర్‌లోని హోటల్ ఫోటోను ఇంటర్నెట్ నుంచి తెచ్చి చంద్రబాబు బినామీ ఆస్తి అని ఆరోపించారని, అయితే ఆ హోటల్ యాజమాన్యం గురించి కనీస ప్రస్తావన చేయలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. అమెరికాలో వైట్‌హౌస్ ఫోటో తెచ్చి అది కూడా చంద్రబాబు బినామీ ఆస్తి అని చెప్పినా ఆశ్చర్యం లేదని ఆయన చెప్పారు.
No comments:
Post a Comment