ప్రముఖ సాహితీవేత్త, అలనాటి చందమామ కథకుడు, నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు అనారోగ్యంతో అక్టోబర్ 28 2011శుక్రవారం ఉదయం విశాఖలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పదిహేనేళ్ళ వయసులో రామకృష్ణారావు రాసిన “పొట్టి పిచ్చుక కథ”. ఆయనకు, చందమామ బాలల పత్రికకు కూడా మొదటి కథ. తను కష్టపడి సాధించుకున్న దాన్ని పోగొట్టుకున్న ఓ బడుగుజీవి పిచ్చిక ఎంతోమందిని కలుసుకుని, ఎవరూ కలిసిరాకపోయినా పట్టుదల వదలక చివరికి విజయం సాధిస్తుంది. తొలి చందమామలో కుతూహలం కొద్దీ రాసిన ఈ కథ తదనంతర జీవితం మొత్తంలో తన విజయ సూత్రం అవుతుందని అవసరాల రామకృష్ణ గారు ఆనాడు ఊహించనే లేదట. 1931, డిసెంబర్ 21న చెన్నైలో రామకృష్ణారావు జన్మించారు. ఎనభై పదుల వయసులోనూ రచన వ్యాసంగాన్ని కొనసాగించిన వ్యక్తి ఆయన. తెలుగు బాష మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఇతర ప్రాంతీయ బాషలు నేర్చుకోలేకపోయానని అంటూ ఉండేవారట. కొన్నాళ్ళు ఒరిస్సాలో ఇంగ్లీష్ లెక్చరర్ గానూ, రీడర్ గానూ పని చేశారు. ఆయన ఒరిస్సాలో ఉండగానే కొడవటిగంటి కుటుంబరావు గారు ఒరియా చందమామ కు పని చేయవచ్చు కదా అని అడిగితే, ఒరియాలో ఒక్క ముక్క రాయడం రాకుండా ఆ పత్రికలో పనిచేయలేనని అన్నారట.( బాష రాకుండా పత్రికలో పనిచేయడం కాదు, నేడు ఏకంగా పత్రికలూ నడిపే ప్రబుద్ధులు కూడా ఉన్నారు.). ఆరోగ్యం బాగే కదా అని అడిగితే, రాయడమే ఆరోగ్యం, మనసుకు పనిపెట్టడమే ఆరోగ్యం అనేవారాయన. సుమారు వెయ్యికి పైగా రచనలు చేశారు. ఆయన రాసిన వాటిలో ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది.
No comments:
Post a Comment