Tuesday, October 18, 2011

కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం


తెలంగాణ కోసం రాజీనామా చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిఫార్సుల మేరకు గవర్నర్ కోమటిరెడ్డి రాజీనామా ఆమోదించారు. కోమటిరెడ్డి రాజీనామాను ఆమోదించాల్సిందిగా ముఖ్యమంత్రి గవర్నర్‌కు లేఖ రాశారు. దీంతో ఆయన రాజీనామా బుధవారం ఆమోదించారు. సకల జనుల సమ్మెలో భాగంగా ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో కోమటిరెడ్డి పాల్గొని ముఖ్యమంత్రికి, అధిష్టానానికి వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా బైఠాయించి అరెస్టు కూడా అయ్యారు. కోమటిరెడ్డి చర్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో ఆమోదించాలని సిఎం లేఖ రాసినట్లుగాతెలుస్తోంది.
మంత్రివర్గం విషయంలో అధిష్టానం ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. ఒక మంత్రి రాజీనామా ఆమోదించాలన్నా, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా సిఎం విచక్షణాధికారాలతోనే జరగాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా వారిపై చర్యలు తీసుంటామనే హెచ్చరికను తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులలోకి తీసుకెళ్లేందుకే కోమటిరెడ్డి రాజీనామాను ఆమోదించేందుకు అధిష్టానం కూడా చొరవ చూపే అవకాశాలు ఉండవచ్చుననేది పలువురి అభిప్రాయం. ఇటీవల మంత్రి శంకర్ రావు సహ మంత్రులు, ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను బర్తరఫ్ చేయాలని కిరణ్ నిర్ణయించుకున్నారట. అయితే అధిష్టానం శంకర్ రావును మందలించి సిఎంకు నచ్చజెప్పటంతో సద్దుమణిగిందని తెలుస్తోంది. కాగా ఈ నెల ఒకటిన కోమటిరెడ్డి తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవి రాజీనామాను ఆమోదించారు. ఎమ్మెల్యే రాజీనామా పెండింగులోనే ఉంది.

No comments:

Post a Comment