Saturday, May 7, 2011

కడపలో పంచతంత్రం


కడపలో పంచతంత్రం
ఆ ఐదుగురూ ఐదుగురే. ఒక్కోరిదీ ఒక్కో స్టైల్‌. ఎవరి వ్యూహాలు వారివి. ప్రజల పల్సు పట్టేందుకు ఎవరి దారిలో వారు పయనిస్తున్నారు. వీరికి ఎన్ని సానుకూల అంశాలు న్నాయో.. అన్ని ప్రతికూలాంశాలు ఉన్నాయి. వీరికి ఈ ఎన్నికలు ఒక పరీక్ష. ఒక సవాలు. ఇప్పుడు ప్రచారంలో వాటినే ఎదుర్కొంటున్నారు.వచ్చే నెలలో జరగనున్న కడప పార్లమెంటు, పులివెందుల ఉప ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్ధులుగా మారిన ఐదుగురు నేతలు అప్రతిహతంగా, అవి శ్రాంతంగా పోరాడుతున్నారు. పులివెందులలో వదిన -మరిది మధ్య హోరాహోరీ సంగ్రామం జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి తనయుడు స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థ్ధిగా పోటీ చేస్తున్నారు. ఆమెపై వైఎస్‌ సోద రుడు, సొంత మరిది వైఎస్‌ వివేకానందరెడ్డి బరిలో ఉన్నా రు. వారిద్దరూ వారి వారి కుటుంబసభ్యుల దన్నుతో ప్రచా రంలో ముందున్నారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి బీటెక్‌ రవి బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మధ్యనే పోటీ నెలకొంది. వారిద్దరి మధ్య చీలే ఓట్లతో బయటపడాలన్నది బీటెక్‌ రవి ఆశగా కనిపిస్తోంది. విజయ లక్ష్మి మరోసారి సానుభూతి ఓట్లపై ఆశపెట్టుకున్నారు. 
ఇక పార్లమెంటు అభ్యర్థుల మధ్య నువ్వా-నేనా అన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ స్వయంగా అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థిగా ఎంపీ మైసురారెడ్డి రంగంలో ఉన్నారు. ముగ్గు రూ అవిశ్రాంతంగా ప్రచారబరిలో దూసుకువెళుతున్నారు.అయితే ఈ ముగ్గురు అభ్యర్ధులకు సొంత జిల్లా కంటే బయట జిల్లాల నుంచి వచ్చి ప్రచారం చేస్తున్న వారే ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం.
అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించిన జగన్‌కు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ..గురునాధరెడ్డి, కొండా సురేఖ, రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, శేషారెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, షాజ హాన్‌, శోభానాగిరెడ్డి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, జూపూడి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గోనె ప్రకాశరావు, సినీ నటి రోజా వంటి ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. పులి వెందులలో విజయలక్ష్మికి మద్దతుగా కుటుంబసభ్యులం తా బరిలో నిలిచారు. ఆమె ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రతి ఇంటికీ తిరుగుతున్నారు. కూతురు షర్మిల ఆమెతోనే ఉంటున్నారు. జగన్‌ ఎక్కువగా తన తండ్రి మృతి చెందిన సానుభూతి ఓట్లపైనే ఆధారపడుతున్నారు. 
ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి డీఎల్‌ రవీంద్రారెడ్డికి మద్దతుగా మంత్రులు ప్రచారంలో నిలుస్తున్నారు. ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో.. మంత్రి ధర్మాన ప్రసాదరావు, బొత్స, అహ్మదుల్లా, మోపిదేవి, మహీధర్‌ రెడ్డి, ఆనం, రఘువీరారెడ్డి, గల్లా, మాణిక్యవరప్రసాద్‌, బస్వరాజు సారయ్య వంటి ప్రముఖులతో పాటు ఎమ్మెల్యే లు కూడా కడపలోనే మోహరించారు. మంత్రులకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మండలా నికి ఒక్కో ఎమ్మెల్యే బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తుం డగా, ఈనెల 28 నుంచి పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి మూడురోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో జగన్‌ కు వచ్చిన ఓట్లలో చీలికతో జగన్‌ గట్టెక్కరని డీఎల్‌ ఆశాభావంతో ఉన్నారు. పులివెందులలో కాంగ్రెస్‌ అభ్యర్ధి వైఎస్‌ వివేకానందరెడ్డి అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నా రు. ఆయనకు కుటుంబసభ్యులు దన్నుగా నిలస్తున్నారు. మంత్రులు పులివెందుల ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.
ఇక్కడ విజయలక్ష్మి కంటే వివేకానందరెడ్డే ఎక్కువగా ప్రజలతో ఎక్కువ సేపు గడుపుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎం.వి.మైసురారెడ్డి కూ డా అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. నామా నాగేశ్వరరావు, రమేష్‌రాథోడ్‌, ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, తుమ్మల నాగేశ్వరరావు, దేవేందర్‌గౌడ్‌, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్‌.రమణ, తలసాని శ్రీనివాసయాదవ్‌, రేవంత్‌రెడ్డి, శ్రీరాం తాతయ్య, పల్లె రఘునాధరెడ్డి, రమణ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అబ్దుల్‌ఘనీ, రామకృష్ణ, సీఎం రమేష్‌, గరికపాటి మోహన్‌రావు, బాబూ రాజేంద్రప్రసాద్‌, సినీ నటి కవిత, తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి తదితరులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యే ఇన్చార్జిగా, వారికి సహాయకులుగా రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
       సానుకూలత
వైఎస్‌ మృతి సానుభూతి. కొడుకుగా వాటిని పొందే యత్నం.
గ్రామ నేతలపై పట్టు. క్రిస్టియన్లు, ముస్లిం ఓటు బ్యాంక్‌.
కాంగ్రెస్‌ ఓట్లలో భారీ చీలిక.
అంతమంది కలసి ఒక్కడిని ఓడించేందుకు యత్నిస్తున్నారన్న స్థానిక సెంటిమెంట్‌.
నాలుగు నియోజకవర్గాల్లో సొంత ఎమ్మెల్యేల బలం. 
ప్రతికూలత

గతంలో తనకు వచ్చిన ఓట్ల చీలికతో నష్టం. గెలిస్తే బీజేపీతో కలసిపనిచేస్తారన్న ప్రచారంతో కలవరం. దానివల్ల క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు, ముస్లిం ఓట్లు దూరమయ్యే ప్రమాదం.
తన వర్గీయులపై పోలీసుల కట్టడితో పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గే ప్రమాదం. అది తగ్గితే మెజారిటీ ఎంతన్నది అనుమానం.
ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటారన్న కారణంతో స్థానికంగా ఉండరన్న విమర్శలు. అవినీతిపరుడన్న ప్రచారం మైనస్‌ పాయింట్‌. ఆరేళ్లలో లక్షకోట్లు అక్రమంగా సంపాదించారన్న విమర్శలు.
గతానికి భిన్నంగా కాంగ్రెస్‌-టీడీపీలను ఏకకాలంలో ఎదుర్కోవలసి రావడం.
డీఎల్‌ రవీంద్రరెడ్డి
సానుకూలత
వివాదరహిత ముద్ర.
గతంలో జగన్‌కు పడిన ఓట్ల చీలి కపై ఆశ.
ప్రభుత్వ యంత్రాంగం మద్దతు.
ఎస్సీ, మైనారిటీల ఓటు బ్యాంకుపై ఆశ.
అందుబాటులో ఉంటారన్న సానుకూలత. 

ప్రతికూలత 
ఎవరికీ పనులు చేయరని, అహంకార పూరితంగా వ్యవహరిస్తారని, ఎవరినీ కనీసం గౌరవించరన్న విమర్శలతో కొంత మైనస్‌.
సొంత నియోజకవర్గంలోనే పలుకుబడి లేని వైనం. జగన్‌కే ఎక్కువ బలం ఉండటం.
ప్రచారంలో జగన్‌ వర్గీయుల నుంచి ప్రతిరోజూ ఎదురీత. ప్రజల నుంచి నిరసనలు.
బలవంతంగా పోటీకి దిగారన్న అప్రతిష్ఠ.
పార్టీ శ్రేణులతో సత్సంబంధాలు లేకపోవడం. 
మైసూరారెడ్డి
సానుకూలత

కడప జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నేతగా, పాదయాత్రలు చేసిన సీమ నేతగా సుదీర్ఘకాల గుర్తింపు.
వివాద రహిత ముద్ర.
హంగు, ఆర్భాటాలకు దూరం.
అవినీతి ముద్ర లేకపోవడం.
విశ్వసనీయత కలిగిన నేతగా గుర్తింపు.
ప్రతికూలత

కడప జిల్లాలో ఉండే సమయం తక్కువ.
రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు ఉన్నప్పటికీ ఎక్కువగా తన నియోజకవర్గ, తన మండలం, తన గ్రామానికే పరిమితం కావడం.
సాధారణ నేతల మాదిరిగా జనాలతో మమేకం కాలేకపోవడం.
జిల్లా నేతలతో అంతంత మాత్రపు సంబంధాలు.
పెద్ద వక్త కాకపోవడం. ఎదుటి వారి మనోభావాలను పట్టించు కోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం. 
వైఎస్‌ విజయలక్ష్మి 
సానుకూలత

వైఎస్‌ భార్యగా సానుభూతి.
ఎప్పుడూ బయటకు రాని ఆమె ఈ ఎన్నికల్లో ప్రతి గడప ఎక్కడంతో పెరుగుతున్న సానుభూతి.
భారీ బలగం ఉన్న కుటుంబసభ్యుల అండ.
ఇతరులకు సహాయపడాలన్న తత్వం.
వివాదరహిత మనస్తత్వం. 
ప్రతికూలత 

ఇంతకాలం ప్రజలకు దూరంగా ఉండటం.
సమస్యలపై అవగాహన లేకపోవడం. వక్త కాకపోవడం.
రాజకీయ కుటుంబంలో ఉన్నా రాజకీయాలపై అవగాహన లేకపోవడం.
స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోవడం.
ఒకసారి అసెంబ్లీకి గెలిపించినా ఒక్కసారి కూడా సభకు రాలేదన్న అపఖ్యాతి. సానుభూతి ఈసారి ఎన్నికలో పనిచేస్తుందా లేదానన్న సంశయం. 
వైఎస్‌ వివేకానందరెడ్డి
సానుకూలత 

అందరికీ అందుబాటులో ఉండే నైజం.
మండలాలు, గ్రామాల్లో అందరినీ పేరు పెట్టి పిలిచేంత పరిచయాలు, చనువు. విస్తృతమైన బంధుత్వాలు.
సమస్యలపై పూర్తి అవగాహన.
ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్‌కు ఆయనే రధసారథి కావడంతో పెద్దగా సమస్యలు లేని సానుకూలత.
అవినీతిపరుడన్న ముద్ర లేకపోవడం. 
ప్రతికూలత 

వైఎస్‌ కుటుంబంతో విబేధాల వల్ల ఆ కుటుంబ మద్దతు కోల్పోవడం.
వైఎస్‌ బంధుగణాలు మూకుమ్మడిగా దూరమవుతున్న వైనం.
ఆపదలో అన్న కొడుకుకు అండగా నిలబడలేదన్న అపవాదు.
కాంగ్రెస్‌ ఓట్లలో చీలిక.
ఇన్నాళ్లూ ‘అన్న’ బలమే తన బలమని భావించారు. ఫలితంగా ఇప్పుడు సొంత వర్గమంటూ లేకపోవడం. 
బీటెక్‌ రవి
సానుకూలత

రాజకీయాలకు కొత్త.
అవినీతి ముద్ర లేకపోవడం.
యువకుడు కావడం.
నియోజకవర్గంలో పార్టీకి శాశ్వ త ఓటు బ్యాంకు ఉండటం.
ధనబలం ఉండటం. 
ప్రతికూలత

సొంత పార్టీలోనే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత.
బలమైన వర్గం లేకపోవడం.
పార్టీ నేతలతో సంబంధాలు అంతంతమాత్రమే.
సమస్యలపై అవగాహన లేకపోవడం.
కొత్త అభ్యర్ధి కావడం, జగన్‌ కుటుంబస్థాయిలో ఆర్థి కంగా బలంగా లేకపోవడం.

చిరును కాంగ్రెస్ కొనేసింది... నేను జగన్‌కు అమ్ముడుపోలేదు


చిరును కాంగ్రెస్ కొనేసింది... నేను జగన్‌కు అమ్ముడుపోలేదు
ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎంతో ఆర్భాటంగా సామాజిక న్యాయం చేస్తానంటూ చంకలు గుద్దుకుంటూ వచ్చిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని "మెంటల్ కృష్ణ" పోసాని కృష్ణ మురళి విమర్శించాడు. ప్రజారాజ్యం పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ పార్టీలో చేరాననీ, అయితే కళ్లు తెరిచి చూసేలోగా అంతా అయిపోయిందనీ, చిరు ప్రజారాజ్యం పార్టీని టోకుగా కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారని మండిపడ్డారు. తను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంపై కొంతమంది తమకు తోచిన విధంగా బురద చల్లుతున్నారన్నారు. తానేమీ డబ్బులకు అమ్ముడు పోలేదనీ, రాష్ట్రంలో ఉన్న నాయకులందరిలో జగన్ నీతిపరుడనీ, అందుకే అతడి వెంట కలిసి నడవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఒకవేళ జగన్ అవినీతిపరుడని నిరూపిస్తే తన తలను వారి నిరూపించినవారి చేతుల్లో పెట్టేందుకు సిద్ధమని చెప్పుకొచ్చాడు.

అబ్బో..! రాజశేఖర్‌‌ని జీవిత ఎలా భరిస్తుందో..?!!


 అబ్బో..! రాజశేఖర్‌‌ని జీవిత ఎలా భరిస్తుందో..?!!
నటుడు రాజశేఖర్‌కు నిలకడ లేదని ఇండస్ట్రీలోని చాలామంది అనుకుంటున్నదే. ఇటీవల ఆయన సినిమాలు కొన్ని బాక్సుల దాకా వచ్చి ఆగిపోయాయి. దీంతో ఏకంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జీవితచరిత్రపై సినిమా తీయాలనీ, జగన్‌ నుంచి సొమ్ములు వస్తాయని ఆశించి భంగపడ్డాడు. 
అప్పట్లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర తీస్తున్నట్లు పబ్లిసిటీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత జగన్‌నూ కలిశారు. తాము మాట్లాడుదామనుకున్న విషయం కొద్దిరోజులకు వాయిదా పడింది. చూసీ చూసీ ఇక లాభం లేదనుకుని తాను ఆ సినిమా చేయడం లేదని చెప్పేశాడు.
అయితే ఇదంతా రాజశేఖర్‌ ప్రవర్తన వల్లే అయిందని పూరీ తన సన్నిహితులతో అన్నాడట. అతని మనస్తత్వం నిలకడలేనిదనీ, కాసేపటికే మూడ్‌ మారిపోతుందని అన్నాడట. అబ్బో... జీవిత ఎలా భరిస్తోందని కామెంట్‌ కూడా చేశాడట. 
ఇటీవల పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. జగన్‌ దీక్షలో విజయవాడలో పాల్గొని... ఇప్పుడు వారిని తిట్టిపోశాడు. తాజాగా చంద్రబాబు పంచన చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈయన చేరితో ఒరిగేదేమీ లేకపోగా నష్టం జరుగుతుందని చంద్రబాబుకు కొందరు సూచించారట. 
ఆల్‌రెడీ మొదట్లో ఎన్‌.టి.ఆర్‌.కు సపోర్ట్ చేసినవాడే రాజశేఖర్‌. ఆయన పదవీభ్రష్టుడ్ని చేసినప్పుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ.. నల్లదుస్తులు ధరించి ఆయన ఎన్టీఆర్ వెంట ప్రచారం చేశాడు. మరి ఇప్పుడు తాజాగా చంద్రబాబుతో కలిసి పనిచేస్తానంటూ ముందుకు దూకుతున్నాడు. తెదేపాలో చేరితో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.


Monday, May 2, 2011

ఒసామా బిన్ లాడెన్ హతం


లాడెన్‌ మృతితో అమెరికాలో సంబరాలు


 ప్రపంచాన్ని గడగడలాడించిన కరుడు గట్టిన ఉగ్రవాది, అల్‌కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ మృతి చెందినట్లు సమాచారం. లాడెన్ మృతిచెందాడని అమెరికా న్యూస్‌నెట్‌వర్క్ సోమవారం వెల్లడించింది. ఈ సంఘటనపై అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. లాడెన్ మృతదేహాన్ని అమెరికా సైనికులు కనుగొన్నట్లు అల్‌జజీరా, అమెరికా మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. ఇస్లామాబాద్‌లో అమెరికా సైన్యం జరిపిన క్షిపణి దాడుల్లో లాడెన్ హతమయ్యారు. అతని మృతిని యూఎస్ ఇంటిలిజెన్స్ కూడా ధ్రువీకరించింది.

ఇస్లామిక్ ఉగ్రవాదంతో లాడెన్ ప్రపంచం వెన్నులో చలి పుట్టించాడు. 2002, సెప్టెంబర్ 11న డబ్ల్యూటీవోపై జరిగిన దాడితో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. అప్పటివరకూ ఉగ్రవాదంపై ఉదాసీనత ప్రదర్శించిన అమెరికా ఈ దాడితో మేల్కొంది. ఉగ్రవాదంపై పోరులో పెద్దన్న పాత్ర పోషించింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అఫ్ఘానిస్థాన్, ఇరాక్‌లపై యుద్ధాలు చేసింది. అప్ఘాన్‌లో తలదాచుకున్న లాడెన్‌ను పట్టుకోవడం కోసం అమెరికా అణువణువు గాలించింది. 
పదేళ్లుగా దొరకకుండా ముప్పుతిప్పలు పెట్టి, తప్పించుకు తిరుగుతున్న లాడెన్ ఎట్టకేలకు అమెరికా సైన్యం చేతిలో హతమయినట్లు తెలుస్తోంది. 
లాడెన్ నేతృత్వంలోని అల్‌కాయిదా ప్రపంచంలోని పలుదేశాలపై దాడులు జరిపింది. మానవబాంబు దాడులతో భారీస్థాయిలో ప్రాణనష్టం, భయోత్పాతాన్ని సృష్టించింది.


అమెరికా దాడిలో ఒసామా బిన్‌ లాడెన్‌ మృతిచెందాడన్న వార్తలు వెలువడడంతో అమెరికాలో సంబరాలు చేసుకుంటున్నారు. లాడెన్‌ మరణవార్తను ధ్రువీకరిస్తూ అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటన చేయగానే శ్వేతసౌధం వద్ద గుమిగూడిన ప్రజలు ఆనందానికి హద్దులేకపోయాయి. కేరంతలతో ఆమెరికా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

gangavaram port


Sunday, May 1, 2011

కె. బాలచందర్‌కు 2010'దాదాసాహెబ్ పాల్కే' అవార్డు


కె. బాలచందర్‌కు 2010'దాదాసాహెబ్ పాల్కే' అవార్డు
సినీ రంగంలో అత్యున్నత పురష్కారం ప్రతిష్థాత్మక దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రముఖ చలనచిత్ర దర్శకుడు కె.బాలచందర్ ను వరించింది.2010 ఏడాదికిగానూ  ఆయన ఈ  అవార్డుకు ఎంపికయ్యారు.వరుసగా రెండోసారీ  దక్షినాదికి చెందిన చలన చిత్ర ప్రముఖునికే ఈ అవార్డు రావడం విశేషం.ఈ అవార్డు కింద స్వర్ణ కమలం, పది లక్షల నగదు, శాలువా బహూకరిస్తారు.బాలచందర్‌ గత 45 ఏళ్లుగా సినీ రంగంలో సేవలందించారు.దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా ఆయన పేరెన్నిక గన్నారు.అంతేకాక తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వందకు పైగా సినిమాలకు దర్శకత్వ, నిర్మాణ, రచయిత బాధ్యతలు ఆయన నిర్వహించారు. బాలచందర్ 1930 జులైలో తమిళనాడులోని తంజపూరు జిల్లాలో జన్మించారు.మొదట నాటక రచయిత అయిన బాలచందర్ 1965లో సినీరంగంలోకి ప్రవేశించారు. ఆయన సినిమాలు అపూర్వ రాగగళ్, అవర్గల్, 47 నాట్కల్ (47 రోజులు), సింధు భైరవి, ఏక్ ధూజే కే లియే వంటి చిత్రాలను తీశారు.ఆయనకు తమిళంలో ఎంత ఆదరణ ఉందో తెలుగులో కూడా అంతే ఆదరణ ఉంది.సత్తెకాలపు సత్తయ్య, అంతులేని కథ, మరో చరిత్ర, ఆకలి రాజ్యం, ఆడవాళ్లూ మీకు జోహార్లు, భలేకోడల్లు, గుప్పెడు మనసు, కోకిల, రుద్రవీణ, అందమైన అనుభవం లాంటి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత బాలచందర్ ది.లోతైన వ్యక్తిగత సంబంధాలను, సామాజిక అంశాలను ఆధారం చేసుకుని సినిమాలు చేయడం ఆయనలో ఉన్న విశేషం.తమిళనాడుకు చెందినవారైనప్పటికీ తెలుగువారికి ఆయన బాగా దగ్గరయ్యారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్, ప్రకాష్‌రాజ్ తదితర ఎందరో నటుల్ని వెండితెరకు పరిచయం చేసిన ఘనత బాలచందర్ కే దక్కుతుంది.బాలచందర్ కు అవార్డు రావడం పట్ల టాలీవుడ్, కోలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది.బాలచందర్‌ రెండుసార్లు జాతీయ స్థాయి అవార్డులు, రెండుసార్లు జాతీయ సమైక్యతా అవార్డు (నర్గీస్ దత్)గెలుచుకున్నారు. 1987 లో పద్మశ్రీ అవార్డుని, 1973 తమిళనాడు అత్యుత్తమ పురస్కారం కలైమామణి అవార్డుని, 2011 ఏఎన్ఆర్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్వర్ణ నంది, రజత నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆయనకు పలు మార్లు ఉత్తమ దర్సకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి.బాలచందర్ తీసిన సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందటమే కాకుండా 4 చిత్రాలు జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా ఎంపికయ్యాయి.

మేమంటే జగన్‌కు అసూయ: జీవిత, రాజశేఖర్‌


జగన్‌ని కడిగి పడేసిన జీవిత, రాజశేఖర్‌
మొన్నటి వరకూ వీరుడూ   అని వైఎస్ జగన్ని పొగడ్తలతో ముంచెత్తిన హీరో డాక్టర్ రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత రివర్స్‌ గేరులో జగన్‌పై నిప్పులవాన కురిపించారు. శుక్రవారం ప్రత్యేకంగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ జగన్‌ని కడిగి పారేసి కన్నీళ్లపర్యంతమయ్యారు. జలదీక్షలో తమ మాటలకు వచ్చిన ప్రతిస్పందన చూసి జగన్ అసూయ పడ్డారని… అందుకే జగన్, ఆయన పార్టీ నేతలు తమని కావాలే దూరంగా ఉంచారని ఆరోపించారు. ఇతరులు ఫోకస్ కావడం జగన్‌కు అసలూ ఇష్టం ఉండదని…తండ్రి వైయస్ సింపతీతో త్వరగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని ఆరోపించారు. తండ్రి ఆశయాలు సరిగా అమలు చేయడం లేదని పదే పదే ఆరోపిస్తున్న జగన్‌ అదే నిజమైతే ఆయన చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి కాంగ్రెసులో ఎందుకు ఉన్నారో కూడా చెప్పాలని నిలదీసారు. పనిలో పనిగా చిరంజీవిపైనా విమర్శలు చేస్తూ… పిఆర్పీని స్థాపించి దానిని నడపలేక రెండున్నర సంవత్సరాలకే కాంగ్రెసు పార్టీలో కలిపేసిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని ఇప్పుడు కామెంట్ చేయడం అంటే చచ్చిన పామును కొట్టినట్లేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా తమ సేవల్ని గురించకపోవటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసారు జీవిత.