ఒకప్పుడు ప్రజారాజ్యం అధినేత - ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన చిరంజీవికి కాంగ్రెస్ హైకమాండ్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందట. పీఆర్పీకి ఆశించిన ఆదరణ లభించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన చిరంజీవిని ఎంపీని చేయడంలో నిగూఢార్థం దాగి ఉన్నట్టు సమాచారం. రెండేళ్ల పాటు ఎంపీగా చిరంజీవిని కొనసాగించి.. 2014 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దించాలని హైకమాండ్ సన్నాహాలు చేస్తోంది.
రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది అసమర్థ పాలన అని విపక్షాలు దుయ్యబడుతున్న నేపథ్యంలో... ఇంకా పార్టీలోని మంత్రులే అసమ్మతి గళం విప్పిన తరుణంలో కిరణ్‌ను పక్కన బెట్టి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విధేయుడైన చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని సోనియా గాంధీ యోచిస్తున్నట్లు కాంగ్రెస్ శ్రేణుల సమాచారం.
పీఆర్పీతో గుర్తింపు లభించలేదన్న బాధతో కాంగ్రెస్‌తో తన పార్టీని విలీనం చేసిన చిరంజీవి సోనియా గాంధీ చెప్పినట్లు నడుచుకోవడం, ఆమెపట్ల వినయవిధేయతలను కలిగివుండటం ద్వారా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగానే తిరుపతి ఎమ్మెల్యేగా కొనసాగిన చిరును కాంగ్రెస్ అధిష్టానం ఎంపీగా చేసింది. ఇలా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో మంచి చెడులను తెలుసుకుంటే చిరంజీవికి రెండేళ్ల పాటు మంచి ట్రైనింగ్ ఇచ్చినట్లు అవుతుందని అధిష్టానం భావిస్తోంది.
పీఆర్పీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నామమాత్రపు వాక్చాతుర్యాన్ని కలిగివున్న చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వెంటనే వాక్ఫటిమను చేకూర్చుకున్నారు. ఇంకా తెలుగురాని ముఖ్యమంత్రి కంటే మంచి వాగ్దాటి సంతరించుకుంటూ వస్తున్న చిరంజీవిని సీఎం చేసి.. జగన్‌కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోంది. మరి 2014 ఎన్నికల్లో చిరంజీవి గెలిచి సీఎం అవుతారో లేదో వేచి చూడాల్సిందే.