Wednesday, February 8, 2012

మద్యం సిండికేట్ల ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వివరణ !!???

 సిండికేట్లతో సంబంధం లేకున్నా ACBకి నా పేరు చెప్పడం దుర్మార్గం
 రాజాబాబూ నా క్లోజ్‌ ఫ్రెండ్‌
రమణ క్రిమినల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న వ్యక్తి
మద్యం సిండికేట్లను కట్టడి చేశాం
 MRPకి విక్రయించని షాపులపై కేసులు పెట్టాం
వ్యాపారస్థులు, సిండికేట్లకు నేను కంట్లో నలుసులా మారాను
స్పష్టమైన విచారణ జరిపించండి, ఆరోపణలు వాస్తవమైతే రాజీనామా చేస్తా? 
---------------------------
నిజం నిరూపించుకోవడానికి ఎలాంటి విచారణకైనా సిద్ధమే!
గంజాయి స్మగ్లర్‌, డెకాయిట్‌, మర్డర్‌ కేసులు ఉన్న  రమణ అనే క్రిమినల్ ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ఏసీబీ రిమాండ్ రిపోర్టులో తన పేరు చేర్చడాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఖండించారు. నివేదికలో పేరు చేర్చే ముందు తనను ఒకసారి వివరణ అడిగితే బాగుండేదన్నారు. మద్యం సిండికేట్లకు తాను కంట్లో నలుసుగా మారడంవల్లే తనపై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని.. అందులో దోషిగా తేలితే..మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మోపిదేవి స్పష్టం చేశారు.



రాజీనామాకు సిద్ధపడుతున్న డిఎల్




మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామాకు సిద్ధపడుతున్నట్లుగా సమాచారం. తన శాఖలో కత్తిరింపుపై ఆయన పూర్తి అవమానభారంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. తన పరిధిలో ఉన్న శాఖల్లో ప్రాధాన్యత కలిగిన వాటిని కత్తిరించి, ప్రాధాన్యత లేని శాఖలను మాత్రమే తన వద్ద అట్టిపెట్టడం పట్ల ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్ల అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. తన అసంతృప్తిని ఆయన మంగళవారం ఉదయమే ప్రకటించారు. కిరణ్ తనను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్న డిఎల్ మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. ఆయన మంగళవారం రాత్రి కడప జిల్లా నుండి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణనను కలవనున్నారని సమాచారం. ఆయనను సంప్రదించిన తర్వాత రాజీనామాపై తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. సహజంగా ముక్కుసూటి వ్యక్తిత్వం కలిగిన డిఎల్ ముఖ్యమంత్రితో కొన్ని పథకాలపై విభేదించారు. ప్రధానంగా రూపాయికి కిలో బియ్యం, 108 నిర్వహణపై ఆయన సిఎంతో విభేదించారు. తనకు అండగా ఉంటాడని భావించి మంత్రివర్గంలోకి తీసుకున్న డిఎల్, తనకు మేకులా మారడంతో సిఎం రూటు మార్చారని అంటున్నారు.
శంకర రావుతో పాటు డిఎల్ రవీంద్రా రెడ్డిని కూడా మంత్రివర్గం నుండి తొలగించేందుకు అనుమతివ్వాలని ముఖ్యమంత్రి అధిష్టానాన్ని అడిగినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే కడప జిల్లాలో బలమైన నేతగా ఉన్న డిఎల్ రవీంద్రా రెడ్డిని మంత్రివర్గం నుండి తొలగిస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన అధిష్టానం అందుకు అనుమతించలేదని సమాచారం. జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే డిఎల్ వంటి బలమైన నేత అవసరం ఉంటుందని అధిష్టానం సిఎంకు సూచించిందని సమాచారం. గత ఉప ఎన్నికల్లోనూ జగన్‌పై పోటీకి ఎవరూ ముందుకు రాని సమయంలో, అధిష్టానం ఆదేశించడంతో డిఎల్ పోటీ చేశారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న అధిష్టానం డిఎల్‌ను తొలగించేందుకు ససేమీరా అన్నదని సమాచారం. దీంతో ముఖ్యమంత్రి వెనక నుండి నరుక్కొస్తున్నారని అంటున్నారు. డిఎల్‌కు కేబినెట్లో క్రమంగా ప్రాధాన్యత తగ్గించడం ద్వారా ఆయనను తొలగించవచ్చునని సిఎం భావిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Tuesday, February 7, 2012

కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీలో పట్టుదొరికింది???


ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీలో పట్టుదొరికింది. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ విషయంలో విఫల మయినప్పటికీ, మిగిలిన అన్ని అంశాల్లోనూ కిరణ్‌ సూచనలను అధిష్ఠానం గౌరవించింది. ఫలితంగా.. తాజా స్వల్ప మంత్రివర్గ విస్తరణలో కిరణ్‌ తన వారిని నియమించుకోగలిగారు. అదే సమ యంలో శాసనసభకు సంబంధించి చీఫ్‌ విప్‌, విప్‌లను కూడా తన వర్గీయులనే నియమించుకోవడం ద్వారా ఢిల్లీలో తన పలుకుబడి పెరిగిందన్న సంకేతాలిచ్చారు.  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించాలని సోనియా, పటేల్‌, ఆజాద్‌ వద్ద ఎంత ప్రయత్నించినా అవి నెరవేరలేదు. దానితో మళ్లీ నిరాశ చెందవలసి వచ్చింది.
 కిరణ్‌.. మంత్రివర్గం, శాసనసభకు సంబంధించిన మూడు పదవులనూ తన వారిని ఇప్పించుకునేందుకు చేసిన లాబీ ఫలించింది. కిరణ్‌కు ఆ విషయంలో నాయకత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఫలితంగా క్యాబినెట్‌లో తన వర్గీయులు ఉండాలన్న కిరణ్‌ కోరిక ఫలించినట్టయింది. ముగ్గురు మంత్రులు, ఒక చీఫ్‌ విప్‌, ఇద్దరు విప్‌ల నియామకాల్లో పూర్తిగా కిరణ్‌ మాటే చెల్లుబాటు కావడంతో ఢిల్లీ నాయకత్వం ఆయనకు దన్నుగా నిలిచిందని స్పష్టమవుతోంది. బడ్జెట్‌ సమావేశాల తర్వాత పూర్తి స్థాయి విస్తరణకు అనుమతిస్తామని హామీ ఇవ్వడం కూడా కిరణ్‌కు కలసివచ్చే అంశమే. ఉప ఎన్నికలు ఉన్నందున ఈ సమయంలో విస్తరణ మంచిదికాదని వారించారు. తెలంగాణలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలన్న కిరణ్‌ సూచనకు ఆమోదం తెలిపింది.
ఆ ప్రకారంగా… కిరణ్‌ తనకు సన్నిహిత మిత్రుడయిన కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవి ఇప్పించగలిగారు. నిజానికి కెప్టెన్‌ కోసం ఆయన ప్రతిసారీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉత్తమ్‌కు స్పీకర్‌, చీఫ్‌ విప్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులు ఇప్పించేందుకు కిరణ్‌ శతవిధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు తన మిత్రుడికి క్యాబినెట్‌లో చోటు ఇప్పించుకోగలిగారు. అధిష్ఠానానికి సైతం ఉత్తమ్‌ సేవలు తెలియడంతో ఆయన నియామకానికి మార్గం సుగమం అయింది.
ఇక తనకు నమ్మకస్తుడిగా ఉన్న కొండ్రు మురళికి మంత్రి పదవి ఇప్పించుకోవడంలో కిరణ్‌ విజయం సాధించారు. ఇటీవలి కాలంలో చురుకుగా పనిచేస్తున్న కొండ్రుకు మాల సామాజికవర్గంతో పాటు విధేయత అక్కరకువచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో అంబేద్కర్‌ విగ్రహాల విధ్వంసం తర్వాత, అసంతృప్తితో ఉన్న మాలలను కొండ్రుకు మంత్రి పదవి ఇప్పించడం ద్వారా బుజ్జగించగలిగారు. ఇటీవలి కాలంలో కొండ్రు సీఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వికారాబాద్‌ ఎమ్మెల్యే ప్రసాదరావు కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోటానే కావడం గమనార్హం. నిజానికి ఆయన పేరు కొద్దిరోజుల నుంచే తెరపైకి వచ్చింది. చురుకుగా వ్యవహరించే మాదిగ వర్గానికి చెందిన ప్రసాదరావును తీసుకోవడం ద్వారా.. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు చెక్‌ పెట్టే వ్యూహానికి తెరలేపారు. తాజాగా ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించగా, అందులో ఇద్దరు దళితులు ఉండటంతో కిరణ్‌ సర్కారు దళితులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న సంకేతాలు పంపించగలిగారు.
ఇక తనకు కంట్లో నలుసులా మారిన మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డికి ఉన్న వైద్య, విద్య, ఆరోగ్యను రెండుగా విభజించి డీఎల్‌ను దెబ్బకొట్టారు. దానిలో కీలకమైన వైద్య, విద్య, 104, 108 సర్వీసును ను తనకు విశ్వసనీయుడయిన కొండ్రు మురళీకి కట్టబెట్టి అందరినీ విస్మయపరిచారు. బొత్సను దెబ్బకొట్టేందుకు కాపు నేత కన్నాకు వ్యవసాయశాఖతో ప్రమోషన్‌ ఇచ్చారు. ఫలితంగా, ఇప్పటివరకూ ఆ శాఖ నిర్వహిస్తోన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు చెక్‌ పెట్టారు. కీలకమైన హౌసింగ్‌ను తన మిత్రుడయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అప్పగించారు. ఇదిలాఉండగా.. శాసనసభకు సంబంధించిన నియామకాల్లోనూ కిరణ్‌ చక్రం తిప్పారు. చీఫ్‌ విప్‌గా తనకు విశ్వసనీయుడయిన గండ్ర వెంకటరమణారెడ్డిని నియమించనున్నారు. మంత్రి పదవి కోసం చివరి వరకూ ప్రయత్నించిన గండ్రను సంతృప్తి పరిచేందుకు ఆయన చీఫ్‌ విప్‌ కట్టబెట్టనున్నారు.
విప్‌లుగా తనకు అనుకూలురయిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, పీఆర్పీకి చెందిన బాల్కొండ ఎమ్మెల్యే అనిల్‌కు అవకాశం కల్పించనున్నారు. నిజానికి, అనిల్‌ చాలాకాలం నుంచి కిరణ్‌ శిబిరంలోనే ఉన్నారు. చిరంజీవి పీఆర్పీ నుంచి కేవలం ఇద్దరికే మంత్రి పదవులు సిఫారసు చేశారని, తెలంగాణ నుంచి ఎవరికీ సిఫారసు చేయలేదని తెలుసుకున్న వెంటనే అనిల్‌, ముఖ్యమంత్రి వైపు మొగ్గుచూపారు. నాటి నుంచీ ఆయనకు విధేయుడిగా ఉండటంతో విప్‌ పదవి ఆయనను వరించనుంది. అనిల్‌కు విప్‌ వస్తుందని చాలారోజుల నుంచీ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి పదవి వస్తుందని భావించినప్పటికీ, మళ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికలో జగన్‌ వర్గీయులు వ్యతిరేకంగా ఓటు వేస్తే ప్రమాదమని గ్రహించారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి భట్టికి చెప్పి నచ్చచెప్పినట్లు సమాచారం.
కొత్త మంత్రుల బయోడేటాలు
రాష్ట్ర మంత్రులుగా కొండ్రుమురళీ మోహన్‌, కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్‌ 06/02/2012 తెది సోమవారం ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కూడా 50 ఏళ్ల లోపువారే కావడం విశేషం. వారి జీవిత విశేషాలు ఇలా ఉన్నాయి.
కొండ్రు మురళి : శ్రీకాకుళం జిల్లా లావేటిపాలెంలో 1969 జూలై 8 న జన్మించారు. తండ్రి పేరు కె అప్పారావు. బిఇ, ఎంబీఎ చదివిన తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. రాజాం నుంచి 2004 ఎన్నికల్లో తొలిసారిగా ఎచ్చెర్ల నియోజగవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి 2009 లో అదే జిల్లా రాజాం నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ ఎన్నికల్లో సీనియర్‌ తెదేపా నాయకురాలు, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా పని చేసిన కె ప్రతిభా భారతిని ఓడించడం విశేషం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నప్పడు ఆయనను ప్రభుత్వ విప్‌గా నియమించారు.
ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి: నల్గొండ జిల్లా సూర్యపేటలో 1962 జూన్‌ 20 న జన్మించారు. తండ్రి పేరు పురుషోత్తమరెడ్డి. బిఎస్‌సి డిగ్రీతో పాటు రక్షణ శాఖలో పలు పీజీ కోర్సులను చేశారు. ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలెట్‌గా పని చేసి పదవీ విరమణ చేసిన తర్వాత వ్యవసాయం వృత్తిగా స్వీకరించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతకు ముందు కోదాడ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో హూజూర్‌నగర్‌ నుంచి గెలుపొందారు. ఎపి ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ సెల్‌ చైర్మన్‌గా పని చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ మంత్రి పి చిదంబరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

గడ్డం ప్రసాద్‌కుమార్‌ : రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండల కేంద్రానికి చెందిన వారు. వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బిఎ వరకు చదివారు. ఆయనకు భార్య శైలజ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి పేరు జి ఎల్లయ్య. చిన్నప్పటి నుంచి దళిత ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

Monday, February 6, 2012

విశాఖలో ఎసి బస్సులు,,,


వైజాగ్ లో ఎసి బస్సులు ప్రవేశ పెట్టిన ఆర్టీసీ
విశాఖలో తొలిసారిగా AC బస్సులు ప్రవేశపెట్టింది RTC. మొదటగా 2 సర్వీసులు ప్రారంభించి అనంతరం బస్సుల సంఖ్య పెంచుతామని అధికారులు తెలిపారు. నగరం నుంచి స్టీల్‌ప్లాంట్‌కు, రైల్వేస్టేషన్‌ నుంచి విజయనగరం వరకూ ఈ సర్వీసులు నడుస్తాయని RM. జగదీష్‌బాబు తెలిపారు. లిమిటెడ్‌ స్టాప్‌లతో ప్రయాణించే ఏసీ బస్సుల్లో మినిమం ఛార్జ్‌ 10రూపాయలుగా నిర్ణయించారు. 

దొంగతనాలకు చెక్ !?


దొంగతనాలకు చెక్ పెట్టేందుకు సిసి కెమెరాలు
డాక్టర్స్ కాలనీ హార్మోనీ అపార్ట్ మెంట్లో 3 సిసి కెమెరాలు
ప్రారంభించిన విశాఖ పోలీసు కమిషనర్

దొంగలకు చెక్ పెట్టేందుకు సిసి కెమెరాలు అమర్చుకోవాలన్న విశాఖ పోలీసుల సూచనలను నగర వాసులు పాటిస్తున్నారు . అపార్ట్ మెంట్ లలో సిసి కెమెరాలు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా డాక్టర్స్ కాలనీ హార్మోనీ అపార్ట్ మెంట్లో ఏర్పాటు చేసిన 3 సిసి కెమెరాలను విశాఖ పోలీసు కమిషనర్ పూర్ణచంద్రరావు ప్రారంభించారు. 

సిసి కెమెరాలుంటే చోరీలకు పాల్పడిన దొంగలను తేలిగ్గా గుర్తించ వచ్చని పోలీసు కమిషనర్ అభిప్రాయపడ్డారు. నగరంలోని మిగతా అపార్ట్ మెంట్ వాసులు కూడా ఇదే తరహాలో ముందుకు రావాలని పూర్ణచంద్రరావు విజ్ఞప్తి చేశారు.

విశాఖ జిల్లాలో జగన్‌కు బ్రహ్మరథం...



 ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపు
 మూడోపార్టీ ఉండకుండా కుట్ర

రాష్ట్రంలో త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలను మట్టికరిపించాలని యువనేత జగన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలతో ఢిల్లీ పెద్దలకు దిమ్మ తిరిగేలా బుద్ధి చెప్పాలని సభలో జగన్‌ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. 

విశాఖ జిల్లాలో జగన్‌ పర్యటనకు విశేష స్పందన రావటంతో 

యువనేత జగన్‌కు విశాఖ జిల్లాలో జనం నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 

జగన్‌ అధికార, ప్రతిపక్షాలపై నిప్పులు కురిపించారు. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకుండా కాంగ్రెస్‌, టిడిపిలు దౌర్బాగ్య రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రెండు పార్టీలు ఏకమవ్వటం దారుణమన్నారు. ఉప ఎన్నికలు వస్తున్నాయన్న జగన్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

అభిమాన నేతకోసం ఎదురుచూసిన జనం... ఆయన పలకరింపుకోసం పరితపించిన జనం... ఆయన చిరునవ్వుకోసం నిరీక్షించిన జనం... ఆయన కరచాలనానికి పెనుగులాడిన జనం... ఆయన ప్రసంగంకోసం ఎగబడిన జనం... జననేత రోడ్‌షోకు పోటెత్తిన జనం... ఒక్క అడుగైనా ముందుకు సాగనివ్వని జనం... అనుకున్న సమయానికి వెళ్లనివ్వని జనం... ఒక గంట కాదు... రెండు గంటలు కాదు... చివరకు ఒక రోజైనా పొడిగించక తప్పని ఆభిమానం... అదీ జిల్లాలో సాగిన జగన్ ప్రయాణం.
ఈ కార్యక్రమాల్లో జగన్ వెంట అనకాపల్లి లోక్‌సభ సభ్యుడు సబ్బం హరి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, పార్టీ జిల్లా కన్వీనర్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, తూర్పుగోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యేలు కుంభా రవిబాబు, గండి బాబ్జీ, పూడి మంగపతిరావు, మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావు, విజయనగరం జిల్లా ఇన్‌చార్జి జి.వి.రవిరాజు, ఏపీటీఎస్ మాజీ అధ్యక్షుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, పార్టీ నేతలు, కార్పొరేటర్లు జహీర్ అహ్మద్, తిప్పల నాగిరెడ్డి, కంపా హనోకు, చొప్పా నాగరాజు, కండిపల్లి అప్పారావు, ఉరుకూటి అప్పారావు, చింతపల్లి పోతురాజు, అంగ అప్పలరాజు, పీలా ఉమారాణి, గంపల గిరిధర్, పసుపులేటి ఉషాకిరణ్, అదీప్‌రాజు, కాకర్లపూడి శ్రీకాంత్, చొక్కాకుల వెంకటరావు, కోరాడ రాజబాబు, విళ్లా శ్రీనివాసరావు, పోతల ప్రసాద్, మువ్వల పోలారావు, పూజారి ఉదయ్‌కుమార్, పక్కుర్తి చిన్నారావు, నారా నాగేశ్వరరావు, పక్కి దివాకర్, గొలగాని శ్రీనివాసయాదవ్, షబ్నం అఫ్రోజ్, నీలాపు వెంకటరమణ, భూపతిరాజు శ్రీనివాసరాజు, గుడిమెట్ల రవికుమార్ తదితరులు పెద్ద సంఖ్యలో జగన్ వెంట నడిచారు. 

ఆర్‌ఈసీఎస్ మాజీ చైర్మన్ జనరాజ్‌దాస్ మృతి


ఆర్‌ఈసీఎస్ మాజీ చైర్మన్ పెంటకోట జనరాజ్‌దాస్ (55) 05/02/2012ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతితో మునగపాకలో విషాదఛాయలు అలముకున్నాయి. రాజకీయ చరిత్రలో మచ్చలేని నాయకునిగా, ప్రజాక్షేమం కోసం పరితపించే జనరాజ్‌దాస్ ఇక లేరన్న నిజం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొద్దిరోజులుగా కిడ్నీపరమైన సమస్యలతో బాధపడుతూ విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం పరమపదించారు. ఆయనకు భార్య వాణి, బద్రి, శ్రీకాంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా వ్యవహరించి, ఆ పార్టీ అధినేత స్వర్గీయ నందమూరి తారకరామారావు మన్ననలను పొందారు. 

తెలుగుయువత కార్యదర్శిగా, ఆర్‌ఈసీఎస్ చైర్మన్‌గా, తెలుగుదేశంపార్టీ జిల్లాఅధ్యక్షునిగా పనిచేశారు. ఇదే తరుణంలో మునగపాక పీఏసీఎస్‌కు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికై డీసీసీబీ అధ్యక్షునిగా నియమితులవుతారనుకున్న తరుణంలో ఆ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆర్‌ఈసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన కాలంలోనే మునగపాకలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు, బైపాస్‌రోడ్డు, పీహెచ్‌సీ భవనం, పీఏసీఎస్ భవన నిర్మాణానికి విశేష కృషి చేశారు. ఆయన మృతికి మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నేత కొణతాల రామకృష్ణ, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రఘుబాబు, చలనచిత్ర డ్యాన్స్ డెరైక్టర్ లంకా సత్యానంద్ తదితరులు సంతాపం ప్రకటించారు.