Thursday, November 17, 2011

నిజాయితీని నిరూపిస్తాం


నిజాయితీని నిరూపిస్తాం
తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ విజయమ్మ వేసిన పిటిషన్‌లో గతంలో ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఆరోపించిన అంశాలే ఉన్నాయని తెలుగుదేశంపార్టీ పేర్కొంది. అనేక కేసులు విచారణకు అర్హత లేవని కోర్టులే తోసిపుచ్చాయని, అవే అంశాలతో మళ్ళీ కోర్టులో ఫిర్యాదు చేశారని ఆపార్టీ దుయ్యబట్టింది. విజయమ్మ పిటిషన్‌పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు సహజ న్యాయ సూత్రాలు కూడా పాటించకపోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ విచారం వ్యక్తంచేసింది.ప్రతివాదికి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడం, పిటిషన్‌ ఒకటైతే హైకోర్టు మరో ఆదేశం ఇచ్చిందని మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెదేపా శాసనసభ్యులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఏ.రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి రొచ్చులోకి దిగి, ఆ రొచ్చును ఇతరులపైకి చల్లే ప్రయత్నం చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. 1975 నుంచి చంద్రబాబుపై ఇవే ఆరోపణలు చేసి 18సార్లు కోర్టుల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహా అనేక మంది కాంగ్రెస్‌ నేతలు పిటిషన్లు వేశారని, వాటిని నిరూపించలేక కొన్ని ఉపసంహరించుకోగా, మరికొన్నింటిని కోర్టులు కొట్టివేశాయని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుపై వేసిన పిటిషన్లు విచారణకు అనర్హమైనవని కోర్టులు తోసిపుచ్చాయని ఆయన చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ కేసులో కూడా గతంలో చేసిన ఆరోపణలపై పిటిషన్‌ వేసి ఎన్నికలు కాగానే ఉపసంహరించుకున్నారని ఆయన చెప్పారు. 1999, 2004 మధ్య ఐదేళ్ళపాటు ఏ ఒక్క రాజ్యాంగ వ్యవస్థను కూడా చర్య తీసుకోమని కోరలేదంటూ ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడానికి కూడా ఈ అంశాలకు అర్హత లేదని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టంచేసిందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైకోర్టు తీర్పును ప్రశ్నించడం, కించపరచడం తమ ఉద్దేశం కాదని, కోర్టులను, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తామని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. అలాంటి వ్యక్తిని కూడా సిబిఐ విచారణ పరిధిలోకి తీసుకురావడం బాధాకరమన్నారు. తాము న్యాయ వ్యవస్థనుగానీ, సిబిఐగానీ ప్రశ్నించడం లేదని, విజయమ్మ పిటిషన్‌ ఆరోపణలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు గత చరిత్రను మరోసారి గుర్తు చేస్తున్నామని బొజ్జల అన్నారు. సింగపూర్‌లోని హోటల్‌ ఫోటోను ఇంటర్నెట్‌ నుంచి తెచ్చి చంద్రబాబు బినామీ ఆస్తి అని ఆరోపించారని, అయితే ఆ హోటల్‌ యాజమాన్యం గురించి కనీస ప్రస్తావన చేయలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. అమెరికాలో వైట్‌హౌస్‌ ఫోటో తెచ్చి అది కూడా చంద్రబాబు బినామీ ఆస్తి అని చెప్పినా ఆశ్చర్యం లేదని ఆయన చెప్పారు.

Wednesday, November 16, 2011

ధరలపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు...


ధరలపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు – రచ్చబండలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
‘పేద కుటుంబాలు మూడు పూటలా కడుపునిండా అన్నం తినాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీని కోసమే రూపాయికి కిలో బియ్యం అమలుచేస్తున్నాం. కానీ మిగిలిన ధరలు భారీగా పెరిగిపోయినందున ఎలా కుటుంబాన్ని నెట్టుకురావాలన్నదే మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్న ప్రశ్న అని నాకు తెల్సు. అందుకే సంచలనాత్మకమైన రీతిలో ధరల నియంత్రణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి, మంత్రిని కూడా నియమించనున్నాం…’ పశ్చిమగోదావరి రచ్చబండలో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన కీలకమైన ప్రకటన ఇది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో 15-11-2011తెది మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రూపాయికి కిలో బియ్యం పథకం ప్రయోజనాలు, విశిష్టతలను వివరిస్తూనే మిగిలిన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవటం ప్రజలకు ఆందోళన కలిగిస్తోందని అంగీకరించారు. పేదలకు ప్రయోజనకరంగా ధరలను నియంత్రించడానికి వీలుగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బ్లాక్‌మార్కెట్‌ను నియంత్రించడానికి మానిటరింగ్ సెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు తాము తీసుకున్న రుణం లక్ష రూపాయల వరకు ఏడాదిలోపే తిరిగి చెల్లిస్తే వడ్డీ ఉండబోదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ వడ్డీ భారాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు భరిస్తాయని చెప్పారు. మరోవైపు మహిళలకు త్వరలోనే మంచి శుభవార్తను ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగానే పావలా వడ్డీ రాయితీ అందరికి అందుతోందా అంటూ డ్వాక్రా మహిళలను ప్రశ్నించగా కొంతమంది వస్తోందని, మరికొందరు రావటం లేదని సమాధానాలు చెప్పటంతో పావలా వడ్డీ పథకంలో ఇదొక సమస్యగా మారిందని, ప్రభుత్వం కూడా గుర్తించిందని సిఎం చెప్పారు. దీనిని పరిష్కరించడానికి ఇకనుంచి నేరుగా గ్రామాల్లోని సంఘాలకు వడ్డీ రాయితీ జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేసమయంలో వేదికపై ఉన్న మంత్రి సునీతాలక్ష్మారెడ్డిని దీనికి సంబంధించి ఉత్తర్వులు వెంటనే వెలువడేలా చూడాలని ఆదేశించారు. దీంతో మహిళలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.
రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చెప్పారు. ధాన్యానికి మద్దతుధర విషయంలో అదనంగా 120 రూపాయల బోనస్ చెల్లించాలని ఇప్పటికే ప్రధానమంత్రిని కోరామన్నారు. మత్స్య, పౌల్ట్రీల నుండి నాలా ఛార్జీలు వసూలు చేసే పద్ధతికి స్వస్తి పలకనున్నట్లు సిఎం ప్రకటించారు. అదేవిధంగా జిల్లాలో పెద్దఎత్తున సాగుతున్న చేపలు, రొయ్యల ఎగుమతులను మరింత ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైతురుణాలపై అమలుచేస్తున్న ఏడు శాతం వడ్డీ రేటును మహిళా గ్రూపులకు కూడా అమలుచేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. పావలా వడ్డీ కంటే తక్కువకే మహిళా సంఘాలకు రుణాలు అందించగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొల్లేరు అభయారణ్య పరిధిని అయిదవ కాంటూరు నుంచి మూడవ కాంటూరుకు తగ్గించడానికి ప్రభుత్వం తరపున ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సిఎం వరాల జల్లు కురిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంతకుమార్, పితాని సత్యనారాయణ, సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీలు కావూరి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, ఉండవల్లి అరుణకుమార్, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానితోపాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన ప్రారంభం
గర్భిణీలను ఆదుకోవడానికి కేంద్రం ప్రకటించిన ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజనను రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. ఏలూరులో ఇందుకు సంబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో 56వేల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చడానికి ఏడున్నర కోట్ల రూపాయలను ఆయన విడుదల చేశారు. అంతకుముందు దాదాపు 125 కోట్ల రూపాయలతో ఏలూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

పెట్రోలు ధ‌ర త‌గ్గిందోచ్‌..


పెట్రోలు ధ‌ర త‌గ్గిందోచ్‌..
పెరుగుట తప్ప తరుగుట ఎరుంగని పెట్రోలు ధర తగ్గింది. ఔనా.. నిజమేనా!? అని ఆశ్చర్యపోయి నా.. పెరుగుట తరుగుట కొరకే అని మీరు అనుకున్నా ఇది నిజం. చమురు కంపెనీలు పెట్రోలు ధర లీటరుకు రూ.1.85 తగ్గించాయి. స్థానిక పన్నులను కూడా కలుపుకొంటే వాహనదారుడికి సుమారు రూ.2.40 వరకు ఉపశమనం కలగనుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ తగ్గింపు అమల్లోకి రానుంది. దాదాపు మూడేళ్లలో పె ట్రోలు ధరలు తగ్గడం ఇదే తొలిసారి. లీటరుకు రూ.1.85 తగ్గించడంతో స్థానిక పన్నులు కూడా కలుపుకొని ఢిల్లీలో పెట్రోలు రూ.2.22 తగ్గింది. ముంబైలో 2.34; కోల్‌కతాలో 2.31; చెన్నైలో 2.35 తగ్గింది. అంతర్జాతీయంగా ధరలు త గ్గడం కారణంగా గతంలో ధరలను సవరించినప్పటి నుంచి లీటరు పెట్రోలుకు మాకు రూ.1.85 లాభం వచ్చిందని, ఆ లాభాన్ని వినియోగదారులకు అందించాలని భావిస్తున్నామని ఇండియన్ ఆయి ల్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ఎస్ బుటోలా చెప్పారు.

చిరంజీవి కేంద్రమంత్రి కాబోతున్నారా..?


చిరంజీవి కేంద్రమంత్రి కాబోతున్నారా..?
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డంఖా భజాయించి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత చిరంజీవికి అధిష్టానం కేంద్ర మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల అది నెరవేరడంలో జాప్యం జరుగుతోంది. దీనిపై పిసిసి అధ్యక్షుడుగా ఉన్న బొత్సను ఎవరైనా ప్రశ్నిస్తే చిరంజీవి కేంద్ర మంత్రి అవడం ఖాయం.అది కూడా మరి కొద్ద నెలలలోనే అని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. అలా ఎలా చెప్పగలుగుతున్నారని అడిగితే అది పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం . కావాలంటే వేచి చూడండి అని ఆయన అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న రాజ్య సభ ఎన్నికలలో చిరంజీవికి టిక్కెట్ ఇస్తారని భావిస్తున్నారు. అయితే అంతకుముందే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని బొత్స అభిప్రాయ పడుతున్నారు.మంత్రి పదవిలోకి వచ్చాక ఆరు నెలలలోగా పార్లమెంటుకు ఎన్నికైతే సరిపోతుంది కనుక ఇబ్బంది ఉండదని అంటున్నారు. చిరంజీవి మా పార్టీ నాయకుడు అని బొత్స సంతోషంగా చెబుతున్నారు. అయితే ఈ మద్య చిరంజీవి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చినా చేస్తానని అనడంతో రకరకాల ప్రచారాలు వచ్చాయి. ఆయన రాష్ట్ర పదవితోనే సరిపెట్టుకొంటారేమోనన్న భావన కలిగింది. కాని ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు బొత్స చెబుతున్న మాటలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇక ఎంతకాలంలో చిరంజీవి కేంద్ర మంత్రి అయి ఆయన అభిమానులను అలరిస్తారో చూడాలి.

Sunday, November 13, 2011

మన్మోహన్ ప్రకటనపై కేసీఆర్ మండిపాటు



మన్మోహన్ ప్రకటనపై కేసీఆర్ మండిపాటు
కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెట్టారు ?
 తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మన్మోహన్  చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ ప్రజలకు 'భయపడకండి.. నేనున్నాను' అంటూ అభయమిచ్చారు. . ఆయనకు ప్రజా ఉద్యమాలు, ప్రజాస్వామ్య విలువలపై గౌరవం లేదని మండిపట్టారు.
తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని కళ్లుండీ చూడలేని కబోధి ప్రధాని మన్మోహన్ అని దుయ్యబట్టారు. 'తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తుంది.. ఇదే నా శాపం' అంటూ దని శాపనార్థాలు పెట్టారు. 'తెలంగాణ ప్రజలారా బాధపడకండి, భయపడకండి ...మీతో నేనున్నాను.. అన్ని రకాల పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుందాం' అంటూ కేసీఆర్ ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రజల కోపాగ్నికి కాంగ్రెస్ రుచి చూస్తుంది. 
బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు: ఈటెల 
ప్రధాని మన్మోహన్‌సింగ్ బాద్యతారాహిత్యంగా మాట్లాడారు. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎంపీలో తెలంగాణ అంశాన్ని చేర్చడంతో పాటు పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించారు. అలాంటిది ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు.. అన్ని వర్గాల ప్రజల మనోభావాలను ప్రధాని గౌరవించాలి. తెలంగాణకు అనుకూలంగా దేశ వ్యాప్తంగా 28 పార్టీల లేఖలను ప్రధానికి అందించాం.ఇప్పుడు దానిని పక్కనపెట్టి అన్ని పార్టీలను కన్సల్ట్ చేయాలని మాట్లాడడం తగదు..నిర్ణయం ప్రకటించాల్సిన కాంగ్రెస్ దొంగదారులు వెతుకుతోంది..తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశాంతత, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసమే అడుగుతున్నారు. జాతీయ సమస్య అని ప్రధాని ఇప్పుడు అంటున్నారు.. 14 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఏమైంది..అన్ని రాష్ట్రాలు ఆత్మగౌరం వల్ల చేసిన ఉద్యమాల ఫలితంగానే ఏర్పడ్డాయి. చరిత్రను ప్రధాని అవలోకనం చేసుకోవాలి.. 
చావు కబురు చల్లగా చెప్పినట్టుంది: యాష్కీ
ప్రధాని వ్యాఖ్యలు చావు కబురు చల్లగా చెప్పినట్టుంది.. దీనిని పూర్తిగా విభేధిస్తున్నాం... ఇదే నిజమన్న భయాందోళన మాలో ఉంది.. ఇదే యూపీఏ ప్రభుత్వ నిర్ణయమని అనుకుంటున్నాం. తెలంగాణను అడ్డుకునే లగడపాటి రాజ్‌గోపాల్, కేవీపీ రామచంద్రరావులు ఇలాంటి ప్రకటనలే వస్తాయని గత రాత్రి నుంచే అంటున్నారు. అదే వాస్తమౌతోంది. తెలంగాణ వాదులంతా ఈ సమయంలో ఏకమవ్వాలి..యూపీఏ నిర్ణయం కూడా ప్రధాని చెప్పనట్టే ఉంటుంది.. ఈ విషయంలో టీడీపీ కూడా కుమ్మక్కయింది. 
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడుతానని చంద్రబాబు అభయమిచ్చాడు.. దానికి కేంద్రం కూడా తలొగ్గింది.. ప్రజల అభిప్రాయానికి ఏ ప్రభుత్వమైనా తలొంచాల్సిందే.. లేదంటే దిగిపోవాలి..ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఆదివారం సమావేశమవుతుంది. ఇందులో కెకె , జానారెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులతో చర్చిస్తాం.. ఏమి చేయాలన్న దానిపై అందులో నిర్ణయిస్తాం. యూపీఏకు తెలంగాణ ఇచ్చే ఉద్దేశం లేదు. 
కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయాలి: హరీశ్
ప్రధాని ప్రకటన పూర్తి బాధ్యతా రాహిత్యం... తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేసి వెంటనే బయటకు రావాలి, రోజుకో ప్రకటన చేస్తూ ఆపార్టీ తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. తెలంగాణ ప్రజల ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఒకలా... అవసరం తీరాక మరోలా మాట్లాడితే ఎలా? 
తెలంగాణ ఇవ్వలేమని చెప్పలేదు: వినోద్
ప్రధాని కొత్తగా మాట్లాడిందేమి లేదు. ఐదు నెలల క్రితం యూపీ పీసీసీ సోనియా, రాహుల్ సమక్షంలో ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని తీర్మానించారు. ..అలాగే తెలంగాణ కూడా ఇస్తారని అన్నారు. అయితే ఇదంతా రెండో ఎస్సార్సీనా..లేక నేరుగా ఇస్తారా.. అన్నది వేచి చూడాలి. తెలంగాణను అడ్డుకుంటే సీమాంధ్ర నేతలే నష్టపోతారు. ప్రధాని తెలంగాణ ఇవ్వలేమని స్పష్టం చేయలేదు...కష్టమని చెప్పలేదు. 
కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేయండి : ఎర్రబెల్లి
తెలంగాణ ఇస్తామన్న కాంగ్రెస్, తెస్తామన్న కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ప్రధాని ప్రకటనతో కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. పదే పదే మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేయాలి. ఈ మోసానికి శిక్షగా ప్రభుత్వాలను కూల్చాలి. 
రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించారు: కోదండ
పార్లమెంటులో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండకుండా రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించారు. పూటకో మాట మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమాన పరిచారు. కాంగ్రెస్ కో ఖతం కరో.. తెలంగాణకో హాసిలో కరో నినాదాన్ని చేపడతాం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎటు వైపో తేల్చుకోవాలి. 


ఖండిస్తున్నాం: గద్దర్, విమలక్క, సూర్యం
ప్రధాన మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మరోసారి నిలువెల్లా దగా చేసిందనడానికి మన్మోహన్ వ్యాఖ్యలు నిదర్శనం. కేవలం పోరాటాల ద్వారానే తెలంగాణ సాధ్యం, ప్రజలు అందుకు సిద్దపడాలని పిిలుపునిస్తున్నాం. 
విభజన వాదనలో పసలేకనే ప్రకటన : పరకాల
ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలన్న వాదనలో పసలేదు. చిదంబరం లాంటి వారు వారి రాష్ట్రాల విభజనకు ఒప్పుకుంటారా? తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు కలిసి ఉండాలని కోరుకొంటున్నారు. అందుకే ప్రధాన మంత్రి ఈ ప్రకటన చేశారు

Friday, November 11, 2011

రాసాభాసగా మారిన విశాఖ రచ్చ బండ కార్యక్రమం


రాసాభాసగా మారిన విశాఖ రచ్చ బండ కార్యక్రమం









విశాఖలోని గాజువాకలో జరిగిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. గతంలో మొదటి విడత రచ్చబండ కార్యక్రమంలో ఆర్జీలు పెట్టుకున్న ప్రజలకు రేషన్ కార్డులు, ఫించన్లు, ఇందిరమ్మ గృహాలు ఇవ్వకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని నినాదాలు చేశాయి. దీంతో స్సందించిన అధికారులు అర్హులైన వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో సభ ప్రారంభమైంది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే ఎమ్మెల్యే, మేయర్‌, కమిషనర్‌ల ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేయటంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

Wednesday, November 9, 2011

ప్రజలు కరెప్ట్ అయితే నాయకులు ఏం చేస్తారు..?: జయసుధ


సినిమా రంగం నుంచి అనుకోకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి సికింద్రాబాద్‌ ఎం.ఎల్‌.ఎ.గా ఎన్నికయ్యారు నటి జయసుధ. అటు రాజకీయాల్లోనూ తన సేవ చేస్తూనే మరోవైపు తనకు లైఫ్‌ ఇచ్చిన సినిమా రంగాన్ని వదలనని చెబుతున్నారు. ప్రస్తుతం సినిమారంగంలో బిజీగా ఉన్నానంటున్న జయసుధ... రాజకీయాల గురించి చర్చించారు. ఆమె చెప్పిన పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం...

'ఇట్స్‌ మై లవ్‌స్టోరీ'లో మీ పాత్ర ఎలా ఉంటుంది? 
చాలా మంచి పాత్ర. ఇంటిలో తల్లి, బిడ్డ రిలేషన్స్‌ ఎలా ఉంటాయో సినిమాల్లోనూ అలాగే ఉన్నాయి. నిఖిత నా కుమార్తెగా నటించింది. కొన్ని సీన్స్‌ చేస్తున్నప్పుడు నా ఇంట్లో మా పెద్దబ్బాయితో మాట్లాడే సందర్భాలు గుర్తుకు వస్తున్నాయి. చాలా నాచురల్‌గా దర్శకుడు శ్రీధర్‌ తెరకెక్కించారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? 
రాజకీయాల్లో ఉండటం వల్ల కొన్ని తగ్గించాను. ఇది కాక.. 'సోలో' సినిమా చేశాను. బాలకృష్ణతో 'అధినాయకుడు' (ఇంకా పేరు పెట్టలేదు) చిత్రంలో నటించాను. తొలిసారిగా ఆయన కాంబినేషన్‌లో చేయడం చాలా థ్రిల్‌గా అనిపించింది. ఇందులో బాలకృష్ణ మూడు తరాలకు చెందిన మూడు పాత్రలు పోషించారు. అందులో మొదటితరం చెందిన పాత్రకు భార్యగా చేశాను. 

ఇప్పటి సినిమాలు మీకెలా అనిపిస్తున్నాయి? 
ఇప్పటి యూత్‌ మంచి సినిమాలు తీయాలి. చాలావరకు కొన్నిలిమిట్స్‌ వరకే పరిమితం అవుతున్నారు. ప్రేమ అనే కాన్సెప్ట్‌తో చాలా చిత్రాలు వచ్చాయి. రొటీన్‌గా ఉంటున్నాయి. ఇటీవలే 'నైనా' తెలుగులో ప్రేమఖైదీ చూశాను. ప్రేమికుల మధ్య సంబంధాలు ఇలాగ కూడా చూపించవచ్చా అని ఆశ్చర్యపోయాను. గొప్ప ప్రయత్నం. ఆడకపోయినా కంటెంట్‌, తీసే విధానం బాగుంది. 

మొన్నీమధ్య వచ్చిన 'సెవెన్త్‌ సెన్స్‌' గొప్పప్రయత్నం. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇటువంటి కొత్తకొత్త చిత్రాలు రావాలి. చెప్పే విధానంలో కొత్తదనం ఉంటేనే ఆకట్టుకుంటుది. బొమ్మరిల్లు తీసుకుంటే.. అందులో ప్రేమలో రకరకాల షేడ్స్‌ ఉన్నాయి. ప్రేయసీప్రియులతోపాటు తల్లిదండ్రులతో ప్రేమ సంబంధాలు సరికొత్తగా ఉన్నాయి. అలా కొత్త ప్రయత్నాలు తెలుగులో ఇంకా రావాలి.

రాజకీయాల్లో మీరు ఏం నేర్చుకున్నారు? 
అబ్బో! రాజకీయాల్లో చాలా నేర్చుకున్నాను. రోజూ కొత్తకొత్త విషయాలు తెలుస్తాయి. ఎన్నో రకాల మీటింగ్స్‌, వ్యక్తుల్ని కలుస్తుంటాం. ట్రూ పొలిటిషన్‌ అవ్వాలంటే కనీసం 10 ఏళ్ళ సర్వీస్‌ ఉండాలి. అయినా రాజకీయాలు కావాలని నేను వెళ్ళి ఎవర్నీ అడగలేదు. వై.ఎస్‌.ఆర్‌. పిలిచి నీకు సోషల్‌ వర్క్‌ అంటే ఇష్టం కదా... ఇక్కడకు వచ్చి చేయమన్నారు.

'ఆరోగ్యశ్రీ' అప్పుడే మొదలైంది. దాని ద్వారా ఇంకా పేదలకు మరింత సేవ చేయాలని అనుకున్నాను. ప్రతీదీ అది కావాలి.. ఇది కావాలి.. అంటూ ప్రజలు బిచ్చగాళ్ళలా అడుక్కుతిన్నట్లు రాజకీయాలపై ఆధారపడం నాకు నచ్చలేదు. అందుకే ఏదో చేయాలని ఈ రంగంలోకి వచ్చాను.

మరి అనుకున్నది చేయగలిగారా? 
ఏమీ చేయలేమని తెలిసిపోయింది. ఏదో చేయాలని ట్రై చేస్తున్నాం.

అంటే...?!! 
ముందుగా ప్రజలు లైఫ్‌స్టైల్‌ మార్చుకోవాలి. అప్పుడే ఏదైనా చేయగలం. నా నియోజకవర్గంలో 65 బస్తీలున్నాయి. వాటిలో తిరుగుతుంటే... హైటెక్స్‌ అంటూ గొప్పలు చెప్పుకునే మన సిటీలో ఇంత దరిద్రంగా బస్తీలున్నాయా? అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అన్నిచోట్లా వాటర్‌, డ్రైనేజీ ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి. రోడ్డుపై పేదలకు కట్టిన టాయ్‌లెట్స్‌ ఆర్భాటంగా ఓపెన్‌ చేస్తారు. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోరు. అధికారుల్ని అడిగితే.. అది అంతే మేడమ్‌. వారికి ఎంత చేసినా అంతేనంటారు. 

పేదలకు క్వార్టర్స్‌ కట్టారు. నాలుగు అంతస్తులు ఉన్నాయి. లిఫ్ట్‌ ఉండదు. ఒకవేళ కడితే.. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయరు. చెత్తవేయడానికి సెపరేట్‌ ప్లేస్‌‌లు ఉన్నాయి. కానీ బస్తీల్లో రోడ్డుపైనే చెత్తనంతా వేస్తారు. విపరీతమైన కంపు... దోమలు.... 200 రూపాయలకు ఓటువేసి.. ప్రజలు కరెప్ట్‌ అయితే.. సమస్యల గురించి అడిగే హక్కు ఉండదు.

మీవంతుగా ఏదైనా చేశారా? 
చాలా చేయాలనుకున్నా.. కానీ ఏమీ చేయలేకపోతున్నా... నాలాంటి వందమంది జయసుధలు వచ్చినా ఏమీ చేయలేం అని తెలుసుకున్నాను. ప్రజల్లో చైతన్యం లేదు. స్వలాభమే చైతన్యం. నాలాలపై ఇళ్లు కడుతుంటారు. దాంతో డ్రైనేజీ పొంగుతుంది. తర్వాత వాళ్ళే వచ్చి.. సమస్యలు వస్తున్నాయ్‌ అని ఎం.ఎల్‌.ఎ.లపై తిరగబడతారు. అది ధర్నా వరకు దారితీస్తుంది. 

ఇదంతా చూసి హ్యూమన్‌ రైట్స్‌ వారు వస్తారు. వారు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా.. ఒక వేళ తెలిసినా.. ఏదో పోరాటం చేయాలని... ప్రజలకే సపోర్ట్‌ చేస్తారు. ప్రజలు ఏం చేశారు. ఎందుకిలా అయిందని వారికి చెప్పరు. అధికారులు ఎంత చెప్పినా వినరు. మీడియా దీన్ని చిలువలు పలవలు చేస్తుంది. దీంతో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇస్తాం. తర్వాత మళ్లీ సమస్య మామూలే. నాలాలపై ఇళ్లు కట్టడం మానరు. దాన్ని కూలిస్తే.. అదే పెద్ద నేరం... ముందుగా మనం శుభ్రంగా ఉండాలి. ఇంటి పరిసరాల్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ప్రజల్లో లేనంతవరకు ఏమీ చేయలేం.

నిర్మాతగా మారే ఆలోచన ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి? 
నేను నిర్మాతగా మారే ఆలోచన లేదు. మా పెద్దబ్బాయి నిహార్‌కపూర్‌ డిజిటల్‌ టెక్నాలజీ ఆస్ట్రేలియాలో చేశాడు. తను దర్శకుడు అవ్వాలని కోరిక. ఇక రెండోవాడు.. శ్రియన్‌కపూర్‌ మంచి షూటర్‌. నేషనల్‌ లెవల్‌ కాంపిటేషన్‌లో కూడా పాల్గొన్నాడు.. అని ముగించారు.