తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హత్యకు కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తూ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తమపై నిందలు వేయడంపై మీడియా సంస్థల ప్రతినిధులు తీవ్రంగా ధ్వజమెత్తారు. సిబిఐ జెడి లక్ష్మీనారాయణతో తాము మాట్లాడిన కాల్ లిస్టును ఇస్తూ తమ మొబైల్ నెంబర్లను పత్రికా ప్రకటనలో పొందుపరచడంపై వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. లక్ష్మినారాయణతో తాము మాట్లాడితే కుట్ర ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. తమ వృత్తి ధర్మంలో భాగంగానే తాము లక్ష్మినారాయణతో మాట్లాడుతున్నామని, ఇంకా చాలా మందితో మాట్లాడుతున్నామని వారు స్పష్టం చేశారు.
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, జీ 24 గంటలు, ఐ న్యూస్, టీవీ9 క్రైమ్ రిపోర్టర్లు సత్యనారాయణ, రమేష్ వైట్ల, ఇన్నారెడ్డి, కమల్, మహాత్మా తదితరులు జూన్ 21, 2012 గురువారం,సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. లక్ష్మినారాయణతో తాము వందల సార్లు కాదు, వేయి సార్లు మాట్లాడామని వారు చెప్పారు. లక్ష్మినారాయణతో తాము ఒక్క జగన్ కేసు గురించే కాదు, ఎమ్మార్, ఒఎంసి, తదితర కేసుల గురించి కూడా మాట్లాడుతున్నామని వారు చెప్పారు. తమ మొబైల్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం వల్ల తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని వారు చెప్పారు.
తమ పేర్లను బయటపెట్టడం ద్వారా తమను కుట్రలో భాగస్వాములంటూ నిందించడం ద్వారా తమ వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బ తీస్తున్నారని వారు విమర్శించారు. తమకు 24 గంటలలోగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని, న్యాయపరమైన చర్యలకు కూడా పూనుకుంటామని వారు చెప్పారు. ఏ జర్నలిస్టు అయినా సిబిఐ జెడితోనే కాదు, ఎవరితోనైనా తన వృత్తి ధర్మంలో భాగంగా మాట్లాడుతాడని, తాము అదే పని చేశామని, అంత మాత్రాన తాము కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించడం తగదని వారన్నారు.
సమాచార సేకరణలో భాగంగా తాము మాట్లాడితే దాన్ని వక్రీకరించి తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తమపై వ్యక్తిగతంగా దాడి చేశారని వారు ఆరోపించారు. మీడియాలో పోటీ తమకు సంబంధించింది కాదని, రిపోర్టర్ ఏ సంస్థలో ఉన్నా తన బాధ్యతను నిర్వహిస్తాడని, అలాగే తమ తమ సంస్థల్లో తాము విధులు నిర్వహిస్తున్నామని వారు చెప్పారు. తాము లక్ష్మినారాయణతో గానీ మరెవరితోనైనా మాట్లాడకపోతే కుదరదని వారన్నారు. జగన్ విషయంలో కూడా తాము స్పందించామని, తాము వార్తలు రాశామని వారన్నారు. లక్ష్మినారాయణతో వ్యక్తిగతంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు ఏమైనా ఉంటే వారు వారు తేల్చుకోవాలని, తమను అందులోకి లాగవద్దని వారన్నారు.
సాక్షి ప్రతినిధులు ఎవరితో మాట్లాడకుండానే వార్తలు ఇస్తున్నారా అని వారు అడిగారు. సాక్షి ప్రతినిధులు కూడా మాట్లాడే వార్తలు ఇస్తున్నారు కదా అని వారన్నారు. తాము సాక్షి ప్రతినిధులకు వ్యతిరేకం కాదని వారు చెప్పారు. సాక్షి జర్నలిస్టుల కోసం తాము కూడా ఆందోళనలో పాలు పంచుకున్నామని వారన్నారు.
No comments:
Post a Comment