ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్ధులకు 25శాతం సీట్లు !!???
విద్యా సంవత్సరం ప్రారంభమైంది. స్కూళ్ళు, కాలేజీలు తెరుచుకున్నాయి. నేడో రేపో ప్రొఫెషనల్ కాలేజీలు కూడా ప్రారంభం కానున్నాయి. కానీ ఎప్పట్లానే ఈ ఏడాది కూడా విద్యా వ్యవస్థను సమస్యలు చుట్టుముట్టాయి. పాఠ్య పుస్తకాల నుంచి మొదలు కొని, యూనిఫాంలు, టీచర్ల బదిలీలు, ఇంటర్ పరీక్షలు, ఎంసెట్ కౌన్సిలింగ్, విద్యా హక్కు చట్టం అమలు, మోడల్ స్కూళ్ళ నిర్మాణం, టెట్ వివాదం ఇలా ఏ ఒక్కటీ సమస్య లేకుండా, వివాదం కాకుండా పూర్తి కాలేదు. పేరుకు ముగ్గురు విద్యా మంత్రులున్నా సమన్వయ లోపంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇదేమంటే మాత్రం అరువు రేపు అన్న చందంగా వచ్చే ఏడాది ఏ సమస్యా లేకుండా చూస్తామనడం రివాజుగా మారిపోయింది. ప్రభుత్వ విద్యా విధానం వానా కాలం చదువులు అనే సామెతను నిజం చేస్తోంది.
ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. 2010లో వచ్చిన విద్యా హక్కు చట్టం అమలు ఇప్పటి వరకూ సరిగా జరగలేదు. ముఖ్యంగా విద్యాహక్కుచట్టం అమలులో భాగంగా ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం సీట్లను పేదవిద్యార్థులకు కేటాయించాలని చట్టం చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు ఏ ప్రైవేట్ విద్యాసంస్థ సీట్లను పేదవిద్యార్థులకు కేటాయించలేదు.
ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పటికే మనరాష్ట్రంలో వృత్తివిద్యాకళాశాల్లో నిధుల చెల్లింపు ఆలస్యం అవుతోంది. పైగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం రోజుకో విధానం ప్రకటిస్తూండటంతో కాలేజీల యాజమాన్యాలు అనుమానానికీ, ఆందోళనకీ కారణమవుతోంది. ప్రభుత్వానికి ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతేడాది ఫీజు బకాయిలు కూడా ఇప్పటి వరకూ చెల్లించకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
పాఠశాలల్లో మౌలిక వసతుల సదుపాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉంది. పాఠశాల భవంతులు, అదనపు తరగతి గదులు నిర్మాణాలు అసలు చేపట్టనే లేదు..రాష్ట్రంలోని 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో కరెంట్ సదుపాయం లేదని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 40వేల పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్ల సౌకర్యం సైతం లేదని స్పీకర్ తెలిపారు.
పుస్తకాల ముద్రణకు, పంపిణీకి వందలకోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించిన రాష్ట్రప్రభుత్వం వేగవంతంగా పనిచేయడంలో మాత్రం విఫలమౌతోంది. ఒకటోతరగతినుంచి పదోతరగతి వరకు 235 టైటిల్స్ పుస్తకాలు అవసరం ఉంది. ఉప ఎన్నికల రాజకీయాల వంకతో మంత్రులు పుస్తకాలపై సమీక్షలకు కూడా డుమ్మా కొట్టారు. అంతేగాక షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే పాఠశాలలకు చేరాల్సిన పుస్తకాల పంపిణీ జరగాల్సి ఉండగా ఇప్పటికీ 50శాతం పుస్తకాల పంపిణీ కూడా జరగలేదని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు పంపిణీచేసే యూనిఫాంలకు సంబంధించిన వస్త్రాలు ఈరోజుకీ పాఠశాలలకు చేరలేదు. గతఏడాది ప్రారంభమైన ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం అధికారులకు తలనొప్పులనే తెచ్చిపెట్టింది. దీంతో ఈ విద్యాసంవత్సరంలో కుట్టించిన యూనిఫాంలకు బదులుగా మెటీరియల్ ను నేరుగా పాఠశాలలకు పంపించేందుకు అధికారులు హామీలిచ్చారు.
పుట్ట గొడుగుల్లా పెరిగిపోతున్న గుర్తింపులేని పాఠశాలల గురించి డిఇఒలు, డివైఇఒలు ఎక్కడా పట్టించుకోవడం లేదు. వాటిపై అరకొర చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు. అంతేగాక రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇదే అదనుగా ప్రైవేట్ కార్పోరేట్ పాఠశాలలు తల్లిదండ్రులనుంచి ముక్కుపిండి డొనేషన్లు, ఫీజులు భారీగా వసూలుచేస్తున్నాయి. కార్పోరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ మాయలో తల్లిదండ్రులు పడొద్దని, వచ్చే విద్యాసంవత్సరం నుండి ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం గట్టిగా కృషిచేస్తుందని పాఠశాల విద్యాశాఖామంత్రి శైలజానాథ్ స్పష్టంచేశారు.
గతంలో ప్రయివేటు స్కూళ్లు సామాజిక బాధ్యతతో నిర్వహించేవి. కానీ ఇప్పుడు సామాజిక బాధ్యతను మరిచి వ్యాపారదృక్పధమే అలవాటైంది. ప్రైవేటు విద్యను అందరూ భరించలేరు కాబట్టి, ప్రభుత్వపాఠశాలలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేటు విద్యా సంస్థలతో ధీటుగా ప్రభుత్వ విద్య అందివ్వగలిగిన నాడే అందరికీ సమాన విద్య అనే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడి, అందరికీ సమాన విద్య అందివ్వగలుగుతాం.... ఈ విషయంలో ప్రభుత్వ బాధ్యత కీలకమైనది.
No comments:
Post a Comment