Friday, June 29, 2012
Sunday, June 24, 2012
విశ్వబ్రహ్మాణుల సంక్షేమంలో ప్రభుత్వం విఫలం !!?
నర్సీపట్నం;(సక్సెస్ న్యూస్) : రాష్ట్రంలో విశ్వబ్రహ్మణుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని జిల్లా విశ్వబ్రహ్మణ సహకార సంఘం డైరెక్టర్ పెదపాటి గోవింద్ అన్నారు. రాష్ట్రంలో గల సుమారు 85 లక్షల మంది విశ్వబ్రహ్మణులను మోసగిస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆదివారం రాష్ట్ర రాజధానిలోని ఇందిరా పార్కు వద్ద సంఘం కార్యదర్శి బి.నర్సింహం ఆధ్వర్యంలో రిలేనిరసన ప్రారంభం కానున్నది. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు విశాఖ జిల్లా నుంచి సుమారు వెయ్యి మంది విశ్వబ్రహ్నణులు శనివారం హైదరాబాదు బయలు దేవి వెళ్ళారని ఆయన తెలిపారు. దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర్‌రెడ్డి విశ్వబ్రహ్మణుల సంక్షేమానికి రూ.100 కోట్లు మంజూరు చేశారని అన్నారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన రోసయ్య, ప్రస్తుత ముఖ్యమత్రి కిరణ్‌కుమార్ రెడ్డి విశ్వబ్రహ్మణుల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ఈ ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్ధి చెబుతామన్నారు.
Friday, June 22, 2012
జగన్‌పై కుట్ర: జెడితో ఫోన్‌పై పెదవి విప్పిన చంద్రబాల
సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణతో అత్యధిక ఫోన్లు మాట్లాడారని, ఆంధ్రజ్యోతి ఎండితోనూ ఫోన్లు మాట్లాడారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఆరోపించిన వాసిరెడ్డి చంద్రబాల శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల ఆరోపణలను తిప్పి కొట్టారు.
(...పైల్ పొటో)
తాను ఐబిఎం ఉద్యోగిని అని ఆమె చెప్పారు. తాను ఎంపవరింగ్ యూత్ ప్రోగ్రాం లీడ్ ఇండియాలో ఆరు నెలలుగా పని చేస్తున్నానని చెప్పారు. లీడ్ ఇండియా కార్యక్రమాల కవరేజ్ కోసమే తాను ఎబిఎన్ ఛానల్‌కు ఫోన్ చేశానని చెప్పారు. లీడ్ ఇండియా కార్యక్రమాల కవరేజ్ కోసం తాను సాక్షి ప్రతినిధులతోనూ మాట్లాడానని చెప్పారు. ఈ ప్రోగ్రాంను ప్రమోట్ చేయాలన్నదే తన ఉద్దేశ్యమని చెప్పారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ తన క్లాస్ మేట్ అని చెప్పారు.స్నేహితులుగా మేం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, పలు కార్యక్రమాలకు లక్ష్మీ నారాయణ సహకరించారని చెప్పారు. తాను గురువారం అంతా శ్రీశైలంలో ఉన్నానని చెప్పారు. తనకు అప్పుడు బెదిరింపు కాల్సు వచ్చినట్లు చెప్పారు. తమ ప్రోగ్రాం కోసం ఎంతోమందికి ఫోన్ చేస్తుంటామని తెలిపారు. తనకు ఇద్దరు కుమార్తెలని, వారిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయని చెప్పారు. 2009 వరకు తాను యుకెలో ఉన్నానని తెలిపారు.
లీడ్ ఇండియా ప్రోగ్రాంను స్వచ్చంధంగా తాను చేస్తున్నట్లు చెప్పారు. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని, తాను చేస్తున్న కృషిలో అంకిత భావముందని చెప్పారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆంధ్రజ్యోతి ఎండితో మాట్లాడినందుకే తన ఫోన్ కాల్ లిస్టును టార్గెట్ చేశారన్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఉద్యోగం, సేవా కార్యక్రమాలు తప్ప తనకు మరో వ్యాపకం లేదన్నారు.
తన తండ్రి ఇరిగేషన్ శాఖ ఉద్యోగి అని చెప్పారు. జెడి లక్ష్మీ నారాయణ తండ్రి కూడా ఇరిగేషన్ శాఖ ఉద్యోగే అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో పని చేసేప్పుడు అందరం ఒకేచోట ఉండేవారమని తెలిపారు. కాగా చంద్రబాల లీడ్ ఇండియాలో చురుగ్గా పని చేస్తున్నారని లీడ్ ఇండియా ఎపి కో-ఆర్డినేటర్ చూడామణి చెప్పారు. కాగా సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ నిజాయితీ కలిగిన అధికారి అని, కేసు నీరుగార్చేందుకే సాక్షి దుష్ర్పచారం చేస్తోందని టిడిపి నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. వార్తా సేకరణలో భాగంగా ఎవరు ఎవరితోనైనా మాట్లాడటం సహజమేనన్నారు.
సిబిఐ జెడి లక్ష్మీనారాయణతో మాట్లాడితే కుట్రనా: జగన్ పార్టీపై రిపోర్టర్ల ఫైర్
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హత్యకు కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తూ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తమపై నిందలు వేయడంపై మీడియా సంస్థల ప్రతినిధులు తీవ్రంగా ధ్వజమెత్తారు. సిబిఐ జెడి లక్ష్మీనారాయణతో తాము మాట్లాడిన కాల్ లిస్టును ఇస్తూ తమ మొబైల్ నెంబర్లను పత్రికా ప్రకటనలో పొందుపరచడంపై వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. లక్ష్మినారాయణతో తాము మాట్లాడితే కుట్ర ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. తమ వృత్తి ధర్మంలో భాగంగానే తాము లక్ష్మినారాయణతో మాట్లాడుతున్నామని, ఇంకా చాలా మందితో మాట్లాడుతున్నామని వారు స్పష్టం చేశారు.
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, జీ 24 గంటలు, ఐ న్యూస్, టీవీ9 క్రైమ్ రిపోర్టర్లు సత్యనారాయణ, రమేష్ వైట్ల, ఇన్నారెడ్డి, కమల్, మహాత్మా తదితరులు జూన్ 21, 2012 గురువారం,సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. లక్ష్మినారాయణతో తాము వందల సార్లు కాదు, వేయి సార్లు మాట్లాడామని వారు చెప్పారు. లక్ష్మినారాయణతో తాము ఒక్క జగన్ కేసు గురించే కాదు, ఎమ్మార్, ఒఎంసి, తదితర కేసుల గురించి కూడా మాట్లాడుతున్నామని వారు చెప్పారు. తమ మొబైల్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం వల్ల తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని వారు చెప్పారు.
తమ పేర్లను బయటపెట్టడం ద్వారా తమను కుట్రలో భాగస్వాములంటూ నిందించడం ద్వారా తమ వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బ తీస్తున్నారని వారు విమర్శించారు. తమకు 24 గంటలలోగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని, న్యాయపరమైన చర్యలకు కూడా పూనుకుంటామని వారు చెప్పారు. ఏ జర్నలిస్టు అయినా సిబిఐ జెడితోనే కాదు, ఎవరితోనైనా తన వృత్తి ధర్మంలో భాగంగా మాట్లాడుతాడని, తాము అదే పని చేశామని, అంత మాత్రాన తాము కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించడం తగదని వారన్నారు.
సమాచార సేకరణలో భాగంగా తాము మాట్లాడితే దాన్ని వక్రీకరించి తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తమపై వ్యక్తిగతంగా దాడి చేశారని వారు ఆరోపించారు. మీడియాలో పోటీ తమకు సంబంధించింది కాదని, రిపోర్టర్ ఏ సంస్థలో ఉన్నా తన బాధ్యతను నిర్వహిస్తాడని, అలాగే తమ తమ సంస్థల్లో తాము విధులు నిర్వహిస్తున్నామని వారు చెప్పారు. తాము లక్ష్మినారాయణతో గానీ మరెవరితోనైనా మాట్లాడకపోతే కుదరదని వారన్నారు. జగన్ విషయంలో కూడా తాము స్పందించామని, తాము వార్తలు రాశామని వారన్నారు. లక్ష్మినారాయణతో వ్యక్తిగతంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు ఏమైనా ఉంటే వారు వారు తేల్చుకోవాలని, తమను అందులోకి లాగవద్దని వారన్నారు.
సాక్షి ప్రతినిధులు ఎవరితో మాట్లాడకుండానే వార్తలు ఇస్తున్నారా అని వారు అడిగారు. సాక్షి ప్రతినిధులు కూడా మాట్లాడే వార్తలు ఇస్తున్నారు కదా అని వారన్నారు. తాము సాక్షి ప్రతినిధులకు వ్యతిరేకం కాదని వారు చెప్పారు. సాక్షి జర్నలిస్టుల కోసం తాము కూడా ఆందోళనలో పాలు పంచుకున్నామని వారన్నారు.
Tuesday, June 19, 2012
ప్రారంభమైన విద్యా సంవత్సరం...,
ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్ధులకు 25శాతం సీట్లు !!???
విద్యా సంవత్సరం ప్రారంభమైంది. స్కూళ్ళు, కాలేజీలు తెరుచుకున్నాయి. నేడో రేపో ప్రొఫెషనల్ కాలేజీలు కూడా ప్రారంభం కానున్నాయి. కానీ ఎప్పట్లానే ఈ ఏడాది కూడా విద్యా వ్యవస్థను సమస్యలు చుట్టుముట్టాయి. పాఠ్య పుస్తకాల నుంచి మొదలు కొని, యూనిఫాంలు, టీచర్ల బదిలీలు, ఇంటర్ పరీక్షలు, ఎంసెట్ కౌన్సిలింగ్, విద్యా హక్కు చట్టం అమలు, మోడల్ స్కూళ్ళ నిర్మాణం, టెట్ వివాదం ఇలా ఏ ఒక్కటీ సమస్య లేకుండా, వివాదం కాకుండా పూర్తి కాలేదు. పేరుకు ముగ్గురు విద్యా మంత్రులున్నా సమన్వయ లోపంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇదేమంటే మాత్రం అరువు రేపు అన్న చందంగా వచ్చే ఏడాది ఏ సమస్యా లేకుండా చూస్తామనడం రివాజుగా మారిపోయింది. ప్రభుత్వ విద్యా విధానం వానా కాలం చదువులు అనే సామెతను నిజం చేస్తోంది.
ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. 2010లో వచ్చిన విద్యా హక్కు చట్టం అమలు ఇప్పటి వరకూ సరిగా జరగలేదు. ముఖ్యంగా విద్యాహక్కుచట్టం అమలులో భాగంగా ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం సీట్లను పేదవిద్యార్థులకు కేటాయించాలని చట్టం చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు ఏ ప్రైవేట్ విద్యాసంస్థ సీట్లను పేదవిద్యార్థులకు కేటాయించలేదు.
ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పటికే మనరాష్ట్రంలో వృత్తివిద్యాకళాశాల్లో నిధుల చెల్లింపు ఆలస్యం అవుతోంది. పైగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం రోజుకో విధానం ప్రకటిస్తూండటంతో కాలేజీల యాజమాన్యాలు అనుమానానికీ, ఆందోళనకీ కారణమవుతోంది. ప్రభుత్వానికి ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతేడాది ఫీజు బకాయిలు కూడా ఇప్పటి వరకూ చెల్లించకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
పాఠశాలల్లో మౌలిక వసతుల సదుపాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉంది. పాఠశాల భవంతులు, అదనపు తరగతి గదులు నిర్మాణాలు అసలు చేపట్టనే లేదు..రాష్ట్రంలోని 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో కరెంట్ సదుపాయం లేదని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 40వేల పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్ల సౌకర్యం సైతం లేదని స్పీకర్ తెలిపారు.
పుస్తకాల ముద్రణకు, పంపిణీకి వందలకోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించిన రాష్ట్రప్రభుత్వం వేగవంతంగా పనిచేయడంలో మాత్రం విఫలమౌతోంది. ఒకటోతరగతినుంచి పదోతరగతి వరకు 235 టైటిల్స్ పుస్తకాలు అవసరం ఉంది. ఉప ఎన్నికల రాజకీయాల వంకతో మంత్రులు పుస్తకాలపై సమీక్షలకు కూడా డుమ్మా కొట్టారు. అంతేగాక షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే పాఠశాలలకు చేరాల్సిన పుస్తకాల పంపిణీ జరగాల్సి ఉండగా ఇప్పటికీ 50శాతం పుస్తకాల పంపిణీ కూడా జరగలేదని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు పంపిణీచేసే యూనిఫాంలకు సంబంధించిన వస్త్రాలు ఈరోజుకీ పాఠశాలలకు చేరలేదు. గతఏడాది ప్రారంభమైన ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం అధికారులకు తలనొప్పులనే తెచ్చిపెట్టింది. దీంతో ఈ విద్యాసంవత్సరంలో కుట్టించిన యూనిఫాంలకు బదులుగా మెటీరియల్ ను నేరుగా పాఠశాలలకు పంపించేందుకు అధికారులు హామీలిచ్చారు.
పుట్ట గొడుగుల్లా పెరిగిపోతున్న గుర్తింపులేని పాఠశాలల గురించి డిఇఒలు, డివైఇఒలు ఎక్కడా పట్టించుకోవడం లేదు. వాటిపై అరకొర చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు. అంతేగాక రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇదే అదనుగా ప్రైవేట్ కార్పోరేట్ పాఠశాలలు తల్లిదండ్రులనుంచి ముక్కుపిండి డొనేషన్లు, ఫీజులు భారీగా వసూలుచేస్తున్నాయి. కార్పోరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ మాయలో తల్లిదండ్రులు పడొద్దని, వచ్చే విద్యాసంవత్సరం నుండి ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం గట్టిగా కృషిచేస్తుందని పాఠశాల విద్యాశాఖామంత్రి శైలజానాథ్ స్పష్టంచేశారు.
గతంలో ప్రయివేటు స్కూళ్లు సామాజిక బాధ్యతతో నిర్వహించేవి. కానీ ఇప్పుడు సామాజిక బాధ్యతను మరిచి వ్యాపారదృక్పధమే అలవాటైంది. ప్రైవేటు విద్యను అందరూ భరించలేరు కాబట్టి, ప్రభుత్వపాఠశాలలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేటు విద్యా సంస్థలతో ధీటుగా ప్రభుత్వ విద్య అందివ్వగలిగిన నాడే అందరికీ సమాన విద్య అనే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడి, అందరికీ సమాన విద్య అందివ్వగలుగుతాం.... ఈ విషయంలో ప్రభుత్వ బాధ్యత కీలకమైనది.
Friday, June 15, 2012
Tuesday, June 5, 2012
Subscribe to:
Posts (Atom)