Monday, February 20, 2012

గంటాశ్రీనివాసరావు కు క్లిష్ట పరిస్థితులు!!!


 మంత్రి గంటాశ్రీనివాసరావు జిల్లాలోనే చక్రం తిప్పుతున్నతన సొంత నియోజకవర్గంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పిఆర్పీ విలీనంతో కాంగ్రెస్ కేడర్ తనకు అండగా నిలుస్తారని భావించినా, పరిస్థితులు అంత అనుకూలంగా కనబడటం లేదు. ఇటీవల మంత్రికి జరిగిన పౌరసన్మాన కార్యక్రమంలో ఈ విషయాలు మరింత ప్రస్పుటమయ్యాయి. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు, కాంగ్రెస్‌లోనే కొంత మంది నేతలు కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. ఇద్దరు రాజకీయ ఉద్ధండులపై పై చేయి సాధించిన గంటా, తన ఇలాకాలో పరిస్థితులు ఎంత వరకు సరిదిద్దుకుంటారో ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కొణతాల రామకృష్ణ తన అనుచరులు, కార్యకర్తలతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. దీనితో అనకాపల్లి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై ఆ ప్రభావం తీవ్రంగా చూపుతుందని భావించారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడం, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకాంగ్రెస్‌లో ప్రత్యామ్నాయ నేతగా మెలిగే పరిస్థితి స్పష్టమయింది. గంటాకు మంత్రి పదవిరావడంతో కొణతాల కాంగ్రెస్‌కు దూరమైన లోటు భర్తీ అవుతుందని, స్థానికంగా పార్టీమరింత బలోపేతమవుతుందని జిల్లా కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అయితే స్థానికంగా పరిస్థితులు గంటాకు అనుకూలించడం లేదు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో శనివారం రాత్రి నిర్వహించిన గంటా పౌరసన్మాన కార్యక్రమానికి మెజార్టీ కాంగ్రెస్ పార్టీనేతలు, కార్యకర్తలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.గంటాతోపాటు ఆయనకు సన్నిహితంగా మెలిగే ప్రజారాజ్యం పార్టీ నాయకులు, కార్యకర్తలతోనే కార్యక్రమం కొనసాగించారు. మాజీ మంత్రి కొణతాలతో విభేదించి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కొణతాల జగన్ పిఆర్‌పి కాంగ్రెస్‌లో విలీనమయినప్పటి నుండి గంటాకు అత్యంత విధేయత కలిగిన నేతగా మెలుగుతున్నారు. గంటా పౌరసన్మాన సభకు జగన్‌తోపాటు ఆయన సన్నిహిత వర్గనేతలు, కార్యకర్తలు డుమ్మాకొట్టారు. కొణతాల రామకృష్ణ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఆయన తమ్ముడు రఘునాథ్ మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. గంటా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా విశాఖకు విచ్చేసిన సందర్భంలో ఆయనకు స్వాగతం పలికేందుకు తన సన్నిహితులతోపాటు వెళ్తానని కొణతాల సోదరుడు రఘునాథ్ ప్రకటించినప్పటికీ గైర్హాజరయ్యారు. గంటాకు స్వాగతం పలికేందుకు మాజీ మున్సిపల్ చైర్మన్ జగన్ అనూహ్యరీతిలో వాహనాలతో, పార్టీనేతలతో అట్టహాసంగా తరలివెళ్లగా పౌరసన్మాన కార్యక్రమానికి గైర్హాజరవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమయింది. ఆహ్వానపత్రంలో స్థానిక నేత అయిన తనపేరు లేకపోవడంతో కినుకువహించే గైర్హాజరయ్యారని ప్రచారం సాగుతోంది. అయితే జగన్ తిరుమల యాత్రకు వెళ్లడం వలన హాజరుకాలేకపోయారని గంటా అనుచరులు పేర్కొంటుండగా అదమం జగన్ అనుచరవర్గనేతలు, కార్యకర్తలు సైతం పూర్తిగా సన్మాన కార్యక్రమానికి గైర్హాజరవ్వాలనే లక్ష్యంతోనే దూరంగా ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. సహజంగానే అనకాపల్లి అసెంబ్లీ పరిధిలో ప్రజారాజ్యం పార్టీ కేడర్ మాత్రమే గంటాకు సన్నిహితంగా మెలుగుతుంది. మంత్రి పదవి వచ్చాక కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా చేరువవుతుందని, అనకాపల్లి అసెంబ్లీలో కాంగ్రెస్ గట్టి బలాన్ని కూడగట్టుకోగలదని భావించారు. అయితే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కె. రాంజీ, మరికొంతమంది అడపాదడపా నేతలు మాత్రమే గంటాకు సన్నిహితంగా మెలుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయిన మెజార్టీపార్టీనేతలు, కేడర్ గంటాకు దూరంగానే మెలుగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న ఆ పార్టీకేడర్‌ను మంత్రి గంటా ఏ మేరకు కలుపుకుని వెళ్లగలరు.. నామినేటెడ్ పదవుల పంపిణీలో పిఆర్పీ, కాంగ్రెస్ కేడర్‌కు ఏ మేరకు సంతృప్తి పరచగలరనే అంశాలు ఆసక్తి కరంగా మారాయి. జిల్లా రాజకీయాల్లోనే అత్యంత అనుభవం కలిగిన ఇద్దరు నేతలపై గంటా ఇంకా పై చేయి సాధించాలంటే స్థానికంగా పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని సరిదిద్దాల్సి వుంది. లేదంటే మున్సిపాల్టీ, మండల పరిషత్, కోఆపరేటీవ్ తదితర ఎన్నికల విజయాలపై కనే్నసిన గంటాకు అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చే ప్రమాదముందని పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

Sunday, February 19, 2012

తొలివిడత పల్స్‌పోలియో కార్యక్రమం

 February 19, 2012


పోలియో రహిత ఆంధ్రప్రదేశ్‌ స్పూర్తితో పల్స్‌పోలియోకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తొలి విడత జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రం పోలియో రహితంగా మంచి ఫలితాలను సాధించిందని, రాబోవు కాలంలో కూడా ఇదే స్పూర్తితో ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఐదేళ్లలోపు పసిపిల్లలకందరికి పోలియో చుక్కలు వేయడానికి విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి శిశువుకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇంటింటికి కార్యకర్తలు తిరిగి పోలియో చుక్కలు వేసే విధంగా తదుపరి చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అదివారం పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి వేయడం జరుగుతుందని, బుధవారం నాడు ఏడు నగరపాలక కార్పోరేషన్‌ల పరిధిలో పల్స్‌ పోలియో చుక్కలు వేసే విధంగా కార్యాచరణ రూపొందించబడిందని తెలియచేశారు. 2008 నుండి రాష్ట్రంలో పోలియో పూర్తిగా నిర్మూలించబడిందని ముఖ్యమంత్రి వివరించారు. బిక్షగాళ్లు, వైద్యం అందుబాటులోలేని గిరిజన ఆవాసాలు, మత్స్యకారులు, వలస కుటుంబాలు, భవన నిర్మాణ కార్మికులు, పట్టన మురికివాడలు, పట్టణాలు, గ్రామాలకు దూరంగా జీవనం సాగించేవారు, పంచాయతీల శివారులో ఉండేవారు, కొత్త కాలనీలు, పర్యాటక బృందాలు, వ్యవసాయ కూలీలు, ఆవాసాలకు దూరంగా పని చేస్తు జీవించే కుటుంబాలలోని పసి పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలు వేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,766 పోలియో చుక్కలు వేసే కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 11,835, గ్రామీణ ప్రాంతాల్లో 44,349 కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో 6,597, 1865 సంచార బృందాలను పోలియో చుక్కలను వేయడానికి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 99,38,713 మంది ఐదేళ్లలోపు పిల్లకు పోలియో చుక్కలు వేయడానికి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్ధలు, ఆశ వర్కర్లు, మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొంటాయని తెలియచేశారు. ఈ నెల 20న మహాశివరాత్రి పర్వదినం ఉన్నందున అన్ని దేవాలయాల వద్ద పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

---------------------------------------------------------------
The Chief Minister Sri N.Kiran Kumar Reddy has administered pulse polio drops to children at the Camp Office on the occasion of "National Immunisation Day" on Sunday. The Chief Minister said that Andhra Pradesh is Polio-free State since 2008 and appealed to work with the same spirit to achieve zero polio status across the country by 2012. The Chief Minister also released a special brochure on the occasion.

Saturday, February 18, 2012

నేను ఒక్కడిని లేకపోతే మీరు ఎందుకూ పనికిరారు...


వికిపిడియా: నాకు ప్రతి విషయం తెలుసు

గూగుల్: నా దగ్గర అన్నీ ఉన్నాయి









ఫేస్‌బుక్: నాకు ప్రతి ఒక్కరూ తెలుసు




ఇంటర్నెట్: అసలు నేను లేనిది... మీరంతా జీరోలు!








ఎలక్ట్రిసిటి: నోరు మూయండి... నా గురించి మరిచేపోయారు? నేను ఒక్కడిని లేకపోతే మీరు ఎందుకూ పనికిరారు...

Friday, February 17, 2012

విశాఖలో నేవీ హెలికాఫ్టర్ కొండ ఢీ( గ్లాడర్)


మానవ రహిత హెలికాఫ్టర్  ఢీ కొట్టింది కాబట్టి సరిపోయింది. అదే జన నివాసాల మధ్య పడివుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. సమాచారం తెలుసుకున్న నేవీ అధికారులు నలుగురు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కొండపైకి వెల్లారు. ఈ ప్రమాదం సాంకేతిక కారణమా లేక మరేదైనా ప్రమాదమా అన్నది తెలియాల్సి ఉంది.








 భారత నౌకాదళానికి చెందిన ఓ మానవ రహిత గ్లాడర్  ఓ కొండను ఢీకొంది. ఈ ఘటనలో ఈ గ్లాడర్ మొత్తం కాలి బూడిదైంది. దీనికి సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐఎన్ 901 మానవ రహిత గ్లాడర్ గత కొన్ని రోజులుగా గాజువాక సమీపంలోని గణేష్ నగర వద్ద ఉన్న కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో చక్కర్లు కొడుతోంది. సమాచార వ్యవస్థ కోసం నౌకాదళం ఈ విమానాన్ని వినియోగిస్తోంది. దీని ద్వారా వివిధ ప్రాంతాల్లో ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటుంటారు.
పూర్తిగా రిమోట్ సహాయంతో నడిచే ఈ గ్లాడర్ విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్ స్టేషన్ నుంచి గురువారం  ఫిబ్రవరి 16 తేది న మధ్యాహ్నం బయల్దేరింది. కొండ చుట్టుపక్కల కొంతసేపు చక్కరు కొట్టిన గ్లాడర్ అకస్మాత్తుగా నేలకు అతి చేరువగా వచ్చేసింది. కొండ దిగువ భాగంలో ఉన్న ఇళ్ళకు అతి చేరువుగా వెళుతూ కొండను ఢీకొంది. పెద్ద శబ్దంతో గ్లాడర్ పేలిపోయింది. దీని శకలాలు చాలా దూరం ఎగిరిపడి, పెద్ద మంటలు చెలరేగాయి. దీంతో కొండవాలు ప్రాంతంలో ఉన్న జనం భయంతో ఇళ్ళ నుంచి పరుగులు తీశారు. గ్లాడర్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించకపోయినా, కోట్ల రూపాయల విలువైన గ్లాడర్ దగ్ధమైంది. అలాగే కొండ అంచును తగిలి గ్లాడర్ పేలిపోయింది. అదే ఇళ్ళ మధ్య ఈ ప్రమాదం జరిగి ఉంటే, భారీ ప్రాణ నష్టం వాటిల్లి ఉండేది. సంఘటనా స్థలానికి చేరుకోడానికి నేవీ అధికారులకు చాలా కష్టసాధ్యమైంది. హెలికాప్టర్ల ద్వారా సిబ్బందిని ఘటనా స్థలానికి చేరువలో దించినా, కొండపైకి వెళ్లడానికి చాలా అవస్థలుపడాల్సి వచ్చింది. దీనిపై స్పందించిన నేవీ అధికారులు ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

Tuesday, February 14, 2012

గ్రేటర్ విశాఖ... నగరపాలక సంస్థగా మారింది!!!???


 *జీవీఎంసీలో వికేంద్రీకరణ రగడ:
 కమిషనర్ పోకడపై గుప్పుమంటున్న విమర్శలు
 * విభాగ అధిపతుల అధికారాలకు పగ్గాలు 
 * జీవిఎంసీలో వెల్లువెత్తుతున్న విమర్శలు
 
   జీ.వి.ఎమ్.సి కి కొన్ని నెలల క్రితం వచ్చిన కమీషనర్ రామాంజనేయులు మొదటి నుంచి వినూత్న విధానాలతో ముందుకెళుతున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో కౌన్సిల్ పూర్తి పదవీకాలం ముగియనుంది. దీంతో అధికార గణానిదే పూర్తి పెత్తనం కానుంది. ఇప్పటికే కమీషనర్ పరిపాలనపై తన పట్టు సాధించారు. పరిపాలనా సౌలభ్యంకోసం వికేంద్రీకరణ చేపట్టామని అందులో భాగంగానే జోన్లు, వార్డులు, ఏరియాలుగా విభజించామని రామాంజనేయులు చెప్తున్నారు.

   తే మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన వివిధ శాఖల అధిపతులు వికేంద్రికరణ నేపద్యంలో వారి పట్టు కోల్పోతున్నారనే విమర్శలు బయలదేరాయి. ఈ నెల 14నుంచి వార్డు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కమీషనర్ వెల్లడించడంతో అన్నితానై వ్యవహరిస్తున్న కమీషనర్ తీరుతో విభాగాధిపతుల అధికారాలకు కత్తెర పడింది. జీవిఎంసిలో అత్యంత కీలక పాత్రలు పోషించే అడిషనల్ కమీషనర్, ఛీఫ్ సిటీ ప్లానర్, ఛీఫ్ ఇంజనీర్, వైద్యఆరోగ్య అధికారులు వికేంద్రీకరణ నేపద్యంలో  క్రమంగా జోనల్ కమీషనర్ల హస్తాల్లోకి జారిపోతున్నారు. క్షత్రస్థాయి అధికారుల సైతం వీరిని లెక్కచేయడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కమీషనరే సుప్రీం అయినప్పటికీ ఈ తరహా సంస్కరణలు ప్రధాన అధికారులపై వేటుగా భావిస్తున్నారు. ఈ నేపద్యంలో కీలక అధికారులు ఉత్సవ విగ్రహాలుగా మారారని కమీషనర్ కార్యాలయం పరిధిలో విమర్శలు గుప్పుమంటున్నాయి.
 నగరపాలక సంస్థ, గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థగా మారింది. వౌలిక సదుపాయాలు కల్పిస్తే, నగరం అందంగా మారిపోతుందని, ఈ సుందరమైన నగరాన్ని మరింత అభివృద్ధి చేసి జనాన్ని ఉద్ధరిస్తారని కార్పొరేటర్లుగా పంపిస్తే.. వారు చేసింది ఏంటి? వారి జేబులు నింపుకొని, జీవీఎంసీ ఖాజానాకు కన్నం పెట్టారు. ఐదేళ్ల పాటు వీరికి అవకాశం కల్పిస్తే, నగర ప్రజల జీవితాల్లో ఏమాత్రం వెలుగు నింపకపోగా, వారి స్వార్థాన్ని మాత్రమే చూసుకుని రేపో, మాపో కుర్చీలు దిగిపోనున్నారు. నగరపాలక సంస్థ అష్టకష్టాల్లో ఉందని నగరంలోని అట్టడుగు వ్యక్తికి కూడా తెలుసు. తన ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా, జీవీఎంసీ వారు ఇచ్చి నోటీసుల మేరకు పన్ను చెల్లిస్తూ వస్తున్నాడు. పన్ను కట్టపోతే ఉన్న చిన్నపాటి గూడు, సామాను ఎక్కడ ఛిద్రం చేస్తారోనన్న భయమో! లేక సగటు మనిషిగా ఆయనకు ఉన్న బాధ్యతో కానీ పన్ను చెల్లిస్తూ వస్తున్నాడు. మరి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారికి పన్ను చెల్లించాలన్న ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు? ఒకరు కాదు..ఇద్దరు కాదు.. డజన్లకొద్దీ ప్రజా ప్రతినిధులు ఆస్తి పన్ను ఎగవేసిన జాబితాలో ఉన్నారు. వీరిలో కొంతమంది మహనీయులు ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ మాట్లాడే మాటలకు, చేస్తున్న చేతలకు ఏమాత్రం పొంతన లేదన్నది ఈ ఎగవేతతో తేలిపోయింది.
జీవీఎంసీ బరువు బాధ్యతలన్నీ తమ భుజస్కందాలపైనే ఉన్నాయన్నట్టు, పత్రికల వారికి వినిపించేలా ఆర్థిక పరిస్థితుల గురించి ఏకరవుపెడుతుంటారు మన కార్పొరేటర్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి రావల్సిన బకాయిలను వెంటనే రాబట్టాలని, అవసరమైతే తామంతా ఒక బృందంగా ఏర్పడి వెళ్లి ఆయా సంస్థల యాజమాన్యాల వద్ద ప్రాధేయ పడదామని సూచనలు ఇస్తుంటారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు తదితర సంస్థలు పన్ను చెల్లించకపోవడాన్ని సమయం దొరికినప్పుడల్లా తప్పుపడుతుంటారు.
గుదిబండలాంటి జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకాన్ని నెత్తిన పెట్టుకుని మూడు వందల కోట్ల రూపాయల వరకూ అప్పులపాలైనపోయి, నెలకు నాలుగు కోట్ల రూపాయలు వడ్డీ, అసలు చెల్లించుకుంటున్న జీవీఎంసీ ఖజానా దుస్థితి కార్పొరేటర్లకు తెలియంది కాదే! మరి వీరు చేస్తున్నదేంటి? బాధ్యతగల పదవుల్లో ఉంటూ వీరు పన్ను చెల్లించకపోవడం సరైనదే అంటారా? వేలు, లక్షల్లో బకాయిపడ్డ వీరు వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏం సమాధానం చెపుతారు? ప్రజలు నిలదీస్తే, వీరి పరువేంకాను? ఏళ్ల తరబడి వీరు ఆస్తి పన్ను చెల్లించకపోవడానికి కారణాలేంటి? పదవిని అడ్డం పెట్టుకుని పన్ను ఎగవేశారా? లేక ఆస్తి పన్ను మదింపులో వీరికేమైన అభ్యంతరాలు ఉన్నాయా? అలా ఉంటే, రివిజన్ పిటిషన్లు దాఖలు చేశారా? ఇవేవీ లేనప్పుడు వేలాది రూపాయల పన్ను ఎగవేయడానికి కారణమేంటి?
చిన్న పురిపాకలో ఉన్న సామాన్యుడు, లేకుంటే చిన్నపాటి ఇల్లు కట్టుకుని అందులో నివసిస్తున్న సాధారణ వ్యక్తి పన్ను చెల్లించకపోతే, ఆస్తులు జప్తు చేస్తామని రంగు రంగుల నోటీసులు జారీ చేస్తున్న జీవీఎంసీ ఈ మహా నేతలు పన్ను ఎగవేస్తుంటే ఎందుకు మిన్నకుంది? అధికారం, మొహమాటం, లొసుగులు అడ్డొచ్చా? సామాన్యులు పన్ను చెల్లించకపోతే, ఆయా మొత్తాలకు వడ్డీ కూడా విధిస్తున్న జీవీఎంసీ అధికారులు, వీరి నుంచి కనీసం అసలు మొత్తాన్నైనా రాబట్టగలరా? కేవలం 10 రోజుల కాలపరిమితి ఉన్న వీరిని ఇంకా భుజాలపై మోయాల్సిన అవసరం ఉందని జీవీఎంసీ ఉన్నతాధికారులు భావిస్తే, పన్ను వసూళ్ళకు వెనకాడుతారు? అలాంటి మొహమాటాలేవీ లేవనుకుంటే, ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు! ఈ రెంటిలో ఏది జరుగుతుందో వేచి చూద్దాం.

Monday, February 13, 2012

రాజయోగ ద్వారా వ్యవసాయం అభివృద్ధి



వ్యవసాయంలో శాశ్వత యోగిక విధానం అవసరమని పలువురు వక్తలు అభి ప్రాయపడ్డారు. అనేకమంది రైతులు రాజ యోగ ద్వారా వ్యవసాయంపై ప్రయోగాలు చేసి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని వారు వివ రించారు.
బ్రహ్మకుమారీల ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లంకెలపాలెం జంక్షన్‌లో 13/02/2012 తేది ఆదివారం జరిగన రైతు చైతన్య సదస్సు లో రాష్ట్ర ఓడ రేవులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖల మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, రుణాల మాఫీ మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయన్నారు.
యోగిక విధా నం ద్వారా వ్యవసాయంలో దిగుబడి పెరిగితే రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రాజయోగి, తపస్వి రాజు భాయీజీ మాట్లాడుతూ రాజయోగ ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఇప్పటికే పలు పరిశోధనలు, ప్రయోగాలు జరిగాయన్నారు. సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ రైతు ప్రయోజనాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 
రైతులు అడుగుతున్నవి చాలా చిన్నచిన్న విషయాలని, వాటిని నెరవేర్చాలని కోరారు. ఒత్తిడిని అధిగమించడానికి యోగ చాలా ముఖ్యమని ఇది మనకు బలాన్ని, కొత్త శక్తిని ఇస్తుందని అంటూ రైతులకు ఆ విధమైన శక్తి అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, మళ్ల విజయప్రసాద్, కార్పొరేటర్ దుల్ల లక్ష్మి, ప్రముఖులు పైలా జగన్నాథరావు, తోట విజయలక్ష్మి, బొడ్డేడ ప్రసాద్, రౌతు శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ, వీవీఎన్‌ఎం రాజా జీ.బి. నాయుడు,  తిప్పల చిన అప్పారావు, వై.వి.నరసింహం, చలపరెడ్డి రామారావు, పైలా శ్రీనువాసురావు, బొండా అప్పారావు,దుల్ల రామునాయుడు,బలిరెడ్డినాగేశ్వరరావు,కరణంరెడ్డి నరసింగరావు,బొబ్బరి నారాయణరావు,కరణం కనకారావు,విందుల చిరురాజు,ఆప్పికొండ మహలక్శ్మినాయుడు,సాలాపు వెంకటఆఫ్ఫారావు బ్రహ్మకుమారీలు బి కె సునీత,బి కె కొండలరావు, బి కె సుధ, బి కె వేణి, రేవతి,బి కె బాలకృష్ణ,బి కె సీత,బి కె శివలీల, బి కె శశికళ,బి కె త్రివేణి,బి కె సోమేశ్వరి,బి కె రమ,బి కె సత్యవతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులకు పదివేల మొక్కలు పం పిణీ చేశారు. 

ఆకట్టుకున్న స్టాళ్లు











రైతు చైతన్య సదస్సులో ఏర్పాటు చేసిన స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు స్టాళ్లను తిలకించి ఆద్యంతం అనుభూతిని పొందారు. 



Saturday, February 11, 2012

వైభవ్ జ్యూయలరీ అధినేత గ్రంధి మనోజ్‌కు కన్నీటి వీడ్కోలు


 వైభవ్ జ్యూయలరీ అధినేత గ్రంధి మనోజ్‌కు 10/02/2012 తేది శుక్రవారం సాయంత్రం కన్నీటి వీడ్కోలు పలికారు. విశాఖ నుంచి ఈ నెల రెండో తేదీన జైపూర్, హైదరాబాద్, బెంగుళూరు వెళ్లాక ఏడో తేదీన బెంగుళూరులో ఆయన హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన మృత దేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం విశాఖ తీసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ విషాద చాయలు అలముకున్నాయి. కన్నీరుమున్నీరై విలపిస్తున్న మనోజ్ తల్లిదండ్రులు, భార్యా, పిల్లలను చూసిన వారికి హృదయం ద్రవించిపోయింది. బంధువులు, సన్నిహితులు, సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి మనోజ్ మృతదేహాన్ని నేరుగా ద్వారకానగర్ వైభవ్ జ్యూయలరీ కాంప్లెక్స్ వద్దకు తీసుకువచ్చి, సందర్శకుల కోసం ఉంచారు. నగరంలో పలుచోట్ల నుంచి తరలివచ్చిన సందర్శకులు మనోజ్ మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. ఆనందవనం అధిపతి సద్గురు శివానందమూర్తి మనోజ్ మృతదేహానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యేలు మళ్ళ విజయప్రసాద్, పంచకర్ల రమేష్‌బాబు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే కంభంపాటి హరిబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి జెవివి సత్యనారాయణమూర్తి, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పారిశ్రామికవేత్త మట్టపల్లి చలమయ్య తదితరులు సంతాపం తెలియజేసిన వారిలో ఉన్నారు. సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల మల్లిక్, పైడా కృష్ణప్రసాద్ మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. శుక్రవారం నగరంలో బంగారు, వస్త్ర దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి సంతాపాన్ని తెలియజేశారు.