Friday, October 12, 2012

తాడి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్


తాడి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ 

వహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ విడుదల చేస్తున్న కాలుష్యం కారణంగా అవస్థలు పడుతున్న తాడి గ్రామాన్నితేది11-10-2012 గురువారం జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి సందర్శించారు. ఫార్మాసిటీ అనుకుని ఉన్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని గత మూడేళ్లగా గ్రామస్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తేది 08-10-2012 సోమవారం అర్థరాత్రి తాడి బీసీకాలనీకి అనుకుని ఉన్న ఆక్టస్ ఫార్మా లిమిటెడ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తాడి ప్రజలను పరుగులు తీయించిన విషయం తెలిసిందే.దీంతో మరుసటి రోజు మంగళవారం ఉదయం తాడి గ్రామస్థులు ఫార్మాసిటీలో ధర్నా చేయడం,తేది 10-10-2012 బుధవారం మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి నేతృత్వంలో తాడి గ్రామస్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఆ ఆందోళన వివాదానికి దారి తీసింది. ఆందోళనలో పాల్గొన్న టిడిపి నేతలు బండారు సత్యనారాయణమూర్తి, మాధంశెట్టి నీలబాబు,కోమటి వెంకటరావు, బొడ్డపల్లి అప్పారావులోపాటు మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే వివాదం రోజురోజుకు జటిలమోవుతుంది. ఈ తరుణంలో జిల్లా కలెక్టర్ వి.శేషాద్రితోపాటు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎపిఐఐసిఇడి సత్యనారాయణరావు, ఆర్డీవో రంగయ్య, ఎపిఐఐసి జోనల్ మేనేజర్‌తోపాటు ఉన్నతస్థాయి అధికారులు తాడి గ్రామాన్ని సందర్శించారు. కలెక్టర్ శేషాద్రి తాడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తాడి గ్రామానికి అనుకుని ఔషధ కంపెనీలను నిర్మించారన్నారు. దీనికారణంగా తాడి ప్రజలు కాలుష్యం బారిన పడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. మంచినీటి వనరులు కలుషితమైన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. తాడి గ్రామం తరలింపు అధికారులు, రాంకీ యాజమాన్యం ఇచ్చిన హామీలను వివరించారు. రాంకీ యాజమాన్యం నిర్మించిన ల్యాండ్‌ఫిల్‌ను గురించి తెలియజేశారు.

మా ప్రాణాలను కాపాడండి.. కలెక్టర్ కాళ్ళు పట్టుకున్న ప్రజలు

ఫార్మాసిటీ విడుదల చేస్తున్న కాలుష్యం, జరుగుతున్న సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయని తాడి గ్రామస్థులు కలెక్టర్‌కు తెలియజేశారు. నిత్యం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి నెలకొందన్న విషయాన్ని ప్రజలు కలెక్టర్ శేషాద్రి కాళ్లపై పడి చెప్పారు. కాలుష్యం కారణంగా తాడి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్న విషయాన్ని తెలియజేశారు. దీనిపై స్పందించి తాడి ప్రజలకు ప్రాణబిక్ష పెట్టాలని వారంతా కోరారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమస్యలను పూర్తిగా పరిశీలిస్తామన్నారు. దీనిపై ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. తాడి ప్రజలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దీంట్లో కలెక్టర్ రాంకీ యాజమాన్యం నిర్మించిన ల్యాండ్‌ఫిల్‌ను పరిశీలించారు. కలెక్టర్ వెంట అధికారులు ఎల్.విజయసారధి, బి.వెంకటేశ్, నేతలు మాధంశెట్టి నీలబాబు, బొడ్డపల్లి అప్పారావు పాలవలస అప్పలాచారి దానబోయిన నీలకంటరావు గొల్లవిల్లి నాగరాజు తదితరులుఉన్నారు.

No comments:

Post a Comment