దేశవ్యాప్తంగా వేల మంది అమ్మాయిలను వ్యభిచారం నుంచి రక్షిస్తున్నారు సునీతాకృష్ణన్. ఆమె స్థాపించిన 'ప్రజ్వల' సంస్థ వల్ల ఎంతోమంది మహిళలు సమాజంలో గౌరవంగా తలెత్తుకుని జీవిస్తున్నారు. సామూహిక అత్యాచారానికి, జైలు నిర్బంధానికీ సైతం భయపడకుండా పట్టుదలగా కృషి చేస్తున్న సునీతా కృష్ణన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం...
"నా తల్లిదండ్రులు మళయాళీలు, బెంగుళూరులో స్థిరపడ్డారు. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న సర్వే ఆఫ్ ఇండియా ఉద్యోగి. ఆయనకు తరచూ బదిలీలవుతూ ఉండేవి. దాంతో ప్రపంచం చూడ్డానికి అవకాశం కలిగింది. నా లైఫ్ విచిత్రంగా ప్రారంభమైంది. పుట్టిన సమయంలో నేను వికలాంగురాలిని. ఆ విషయాన్ని మూడో రోజున మా మామ గుర్తించారు. తర్వాత సర్జరీ జరిగింది. ఎనిమిదేళ్లు డిజేబుల్డ్‌గానే బతికాను. అలా నా ప్రపంచం, నా ఆలోచన అన్నీ వేరే అయిపోయాయి. మూడేళ్ల వయసులోనే నా జీవితం ఇంకొకరికి అంకితం అన్న భావన పెరిగింది. దానికి ప్రత్యేకంగా ఇన్‌స్పిరేషన్ ఎవరూ ఇవ్వలేదు. ఐదేళ్ల వయసులోనే మా వీధి పిల్లలకు నేను అక్షరాలు నేర్పానట. అప్పట్నుంచే నేను ఓ ఫేమస్ క్యారెక్టర్. అదే సమయంలో పొగరు కూడా ఉండేది. రెండో తరగతిలో ఉన్నప్పుడు నేను మదర్‌థెరిసా అవుతానని ఎవరో అంటే, 'అదేమీ కాదు, నేను సునీతా కృష్ణన్‌నే అవుతా'నంటూ గొడవ చేశానట.
నా వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో మా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. వాళ్లు నాలోని లోపాల కంటే బలాలపైనే దృష్టి పెట్టేవారు. నేను పొట్టి అని నాకు తెలుసు. 'దాన్నే నీ బలంగా చేసుకో' అని మా నాన్న చెప్పడం నాకింకా గుర్తుంది. ఎనిమిదేళ్లు వచ్చేసరికి సోషల్ వర్కర్‌గా తయారయ్యా. అప్పుడు నా తోటి వాళ్లతో పోలిస్తే నేను తేడాగానే ఉండే దాన్ని. మా అక్క, చెల్లి, తమ్ముడు నార్మల్‌గా ఉండేవారు. అందరికీ నావైపు నుంచి సలహాలు, అమ్మకు కూడా సలహా ఇచ్చేదాన్ని. అప్పుడు మానసిక వైకల్యమున్న పిల్లలకు డ్యాన్స్ నేర్పేదాన్ని. పన్నెండేళ్ల వయసొచ్చేసరికి దగ్గర్లోని మురికివాడకు వెళ్లి వంద మంది పిల్లలతో స్కూల్ కూడా ప్రారంభించాను. అప్పుడు మాకు డబ్బుల్లేకున్నా, మరీ పేదరికం కాదు. కానీ ఇచ్చే గుణం అలవాటైంది. మా పేరెంట్స్ కూడా ప్రోత్సహించారు.
దేనికైతే మంచి పేరు తెచ్చుకున్నానో, అదే చెడ్డగా మారింది ఒక దశకు వచ్చాక. రజస్వల అయిన సమయంలో పూజ ఎందుకు చెయ్యకూడదు? ఇలా ఆలోచించేదాన్ని. పదిహేనేళ్ల వయసులో ఓ గ్రామంలో పనిచెయ్యడానికి వెళ్లాను. ఆ వయసులో ఆవేశం, డిప్లమసీ లేకపోవడం వల్ల సూటిగా మాట్లాడేదాన్ని. అది నచ్చని కొంతమంది నాకు పాఠం నేర్పాలనుకున్నారు. ఎనిమిది మంది కలిసి నామీద అత్యాచారం చేశారు. నాకు వాళ్ల ముఖాలు గుర్తు లేవు, వేరే ఏ వివరాలూ తెలీదు. దాని గురించి మాట్లాడటం నాకిష్టం లేదు. కానీ దాని తర్వాత నన్ను నా కుటుంబం, సమాజం వేరేగా చూడటం మొదలెట్టింది. నా చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం మారిపోయింది.
ఆ ఘటన జరిగి 25 ఏళ్లయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్లను నేను అర్థం చేసుకోగలను. ఇన్సిడెంట్ జరిగిన వెంట
నే.. 'సునీత అక్కడికెందుకెళ్లింది? వెళ్లి ఏం చేసింది? మీరు ఎక్కువ స్వతంత్రం ఇచ్చేశారు అమ్మాయికి. మేం ముందే చెప్పాం. పొగరు ఎక్కువ ఈమెకు. ఇట్లాంటి అమ్మాయిలకు ఇలాగే జరుగుతుంది' అనేవాళ్లు చుట్టుపక్కలవారు మా అమ్మానాన్నలతో. కానీ నాలోపల చాలా బాధ ఉండేది. పగలెంత ధైర్యంగా ఉన్నా, రాత్రి పూట బాగా ఏడ్చేదాన్ని, భయపడేదాన్ని. అయితే నేనేం తప్పు చేశాను? నేను నేరస్తురాలిని కాదు. నేను ఓ విక్టిమ్‌ను కూడా కాదు. నామీద ఏదో తప్పు జరిగింది. మీకు చేతనైతే అవతలివాళ్లను కొట్టండి - అనేదాన్ని. కానీ సమాజానికి ఇది నచ్చదు. అమ్మాయి ఏడవాలి, నా తప్పేం లేదని కాళ్లు పట్టుకోవాలి, నిస్సహాయంగా ఆత్మహత్య చేసుకోవాలి - అప్పుడే సమాజం జాలి చూపిస్తుంది. నాకు ఆ జాలి అవసరం లేదు. అప్పుడే నిర్ణయించుకున్నాను - లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా పనిచెయ్యాలని. ఆ కోపపు జ్వాల నుంచి నా నిర్ణయం పుట్టింది. వ్యభిచారంలోకి బలవంతాన వస్తున్న అమ్మాయిలను కాపాడాలి.. ఆ పని చెయ్యాలంటే నేనెలా ఉండాలి, ఏం చదువుకోవాలి, ఏం నేర్చుకోవాలి - ఇవన్నీ ప్లాన్ చేసుకున్నా. ఆ క్రమంలో నేను చాలా పనులు చేశాను. ఇల్లిల్లూ తిరుగుతూ అగర్‌బత్తీలు, సర్ఫ్ అమ్మడం వంటివి చేశాను. స్కూలు, కాలేజీ ఫీజులు కట్టడానికి అవి ఉపయోగపడేవి.
వ్యభిచారం ఎందుకు జరుగుతుంది? స్త్రీ శరీరం భోగ వస్తువు. మగవాళ్లలో ఉన్న లైంగిక కోరికలను తీర్చుకోవడానికి వాళ్లు స్త్రీలకు అటువంటి ఇమేజ్ కల్పిస్తారు. అందాలపోటీల్లాంటివి తెలియకుండానే దానికి దోహదం చేస్తాయి. అందుకే నేను వాటికి వ్యతిరేకంగా ఉద్యమం చేశాను. ఆ సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి వీరేంద్ర పటేల్ ఓపెన్‌గా చెప్పాడు. 'ఎణ్ణు.. హెణ్ణు.. అంటే వైన్, వుమెన్ లేకుండా నేను ఉండలేను' అని చెప్పారు. ఆ ఉద్యమంలో నన్ను పట్టుకుని జైల్లో పెట్టారు. అత్యాచారం ఒక మార్పును తీసుకొస్తే, జైలుకెళ్లడం నాలో ఇంకో మార్పును తీసుకొచ్చింది. అప్పుడు మా అమ్మానాన్నా నన్ను వదిలేశారు. ఆ రోజు వేసుకున్న డ్రెస్సుతో నేను అరవై రోజులు గడిపాను. వేరేవాళ్లకు బంధువులొచ్చి బట్టలిచ్చారు, నాకోసం ఎవ్వరూ రాలేదు. మేం అండర్ ట్రయల్, దోషులం కాదు. కాబట్టి జైలు వాళ్లు యూనిఫాం ఇవ్వరు. కట్టుకున్న బట్టలను రాత్రి ఉతికి ఆరేసి దుప్పటి కట్టుకుని పడుకునేదాన్ని. మళ్లీ పొద్దున అదే డ్రెస్. ఏరోజైనా ములాఖత్ సమయంలో నా పేరు పిలుస్తారేమోనని ఎంత ఆశగా చూసేదాన్నో. అలాంటి ఒంటరితనాన్ని ఎవ్వరూ అనుభవించి ఉండరు.
ఈ అనుభవాల జ్ఞాపకాలు చెరిగిపోవాలని నేను బెంగుళూరును వదిలేశాను. ఎదురుగా వచ్చిన రైలెక్కి కూర్చుంటే మర్నాడుదయానికి హైదరాబాద్‌లో దిగాను. అక్కడ మా ఫ్రెండ్ అన్నదమ్ముడు వర్గీస్ మురికివాడల్లో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడని రైల్లో గుర్తొచ్చింది. దాంతో ఆయన దగ్గరకు వెళ్లాను. వర్గీస్‌ను అభ్యర్థించి చిన్న ఉద్యోగంలో చేరాను. నా చేతిలో చదువు, జ్ఞానమూ ఉన్నాయని ధైర్యం. చాదర్‌ఘాట్‌లోని బ్రిడ్జి కింద మూసానగర్ వద్ద స్లమ్స్‌లో షెడ్ తీసుకున్నాను. తొలి రెండు రోజులు రేగు పండ్లు తిని బతికాను. డిసెంబర్ టైమ్ అది. ఆ తర్వాత ఆ మురికివాడలోని మనుషులు నన్ను రాణీలాగా చూసుకున్నారు. రోజూ మూడు పూటలా వాళ్లే అన్నం పెట్టేవాళ్లు. ఆ సమయంలోనే హైకోర్టు ముందున్న మెహబూబ్‌కా మెహెందీ అనే వేశ్యావాటికను తొలగించారు. ముందస్తు ప్రణాళికేమీ లేకుండా, ఆలోచన లేకుండా చేశారా పని. దాన్లో ఉండే స్త్రీల వేదన తెలిసింది. వాళ్ల భాగస్వామ్యంతోనే పనిచెయ్యాలనుకున్నాం. దానికి వాళ్ల నుంచి వచ్చిన సానుకూల స్పందన చూస్తే ఆశ్చర్యమనిపించింది. అటువంటి స్త్రీల పిల్లల కోసం ఒక బడి ప్రారంభించాను. అలా ఐదుగురితో ప్రజ్వల ఫౌండేషన్ మొదలయింది. ఈ రోజు వారి సంఖ్య ఏడు వేలకు చేరింది. అందరూ వ్యభిచారం నుంచి వచ్చిన పిల్లలే కాదు. వ్యభిచారానికి అవకాశం ఉన్న ప్రాంతాలనుంచి పిల్లలనూ తీసుకొస్తున్నాం.
ఈ క్రమంలో నేను 18 సార్లు భౌతిక దాడులకు గురయ్యాను. ప్రతిసారీ కన్నో, ముక్కో, ఎముకో ఏదోకటి విరిగేది. ఈ దాడులను నేను జాతీయ అంతర్జాతీయ అవార్డులుగా భావిస్తాను. ఎవరైనా అమ్మాయిని నిర్బంధిస్తున్నారని తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లిపోవడం వల్ల ఇలాంటి దాడులకు గురయ్యేదాన్ని. కొన్నాళ్ల తర్వాత తెలిసిందేమంటే బాలికలను రక్షించడం నా పని కాదు, పోలీసుల పని. ఆ కర్తవ్యాన్ని వాళ్లు నెరవేర్చేలా మనం చెయ్యాలి. అది నేను నేర్చుకున్నాక బాలికలను రక్షించడం సులువయింది. కానీ ఈ దాడుల వల్ల నేను సరైన దారిలోనే ఉన్నానని అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజ్వల సంస్థలో 200మంది ఉద్యోగులున్నారు. అందరూ నా అంత స్థైర్యం ఉన్నవాళ్లే. కానీ కిందటేడు నామీద పొయ్యడానికి యాసిడ్ పట్టుకొస్తున్న మనిషి మెట్లెక్కుతూ బోర్లాపడ్డాడు. అతన్ని మేమే తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చాం. అప్పుడు అతనే చెప్పాడు... దాన్ని తెచ్చింది నాకోసమని! అప్పుడు మాత్రం భయం వేసింది.
మనం జీవితాన్ని నిర్మించుకోవాలా, నాశనం చేసుకోవాలా అనేది మన చేతిలోనే ఉంది. నావంటి నాలుగున్నర అడుగుల మనిషే ఇంత చెయ్యగలిగితే, మిగిలినవాళ్లు తల్చుకుంటే దేన్నైనా సాధించగలరు. ప్రస్తుతం వ్యభిచారం వల్ల హెచ్ఐవీ బారిన పడిన అమ్మాయిలకు పునరావాసం కల్పించడం మీద కూడా దృష్టి పెట్టాను. వాళ్ల ఆలోచనలను చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తుంది. మనం చిన్నచిన్న విషయాలకే విసిగిపోతాం, చుట్టూ ఉన్నవారి పట్ల, జీవితం పట్ల నెగెటివ్ భావాలను పెంచుకుంటాం. కానీ ఆ పిల్లలు మాత్రం ప్రపంచం పట్ల గొప్ప సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుంటారు. జీవితం పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. నా వల్ల ఏడు వేల మంది అమ్మాయిలు వ్యభిచార వృత్తి నుంచి బైటపడ్డారు, గౌరవంగా జీవిస్తున్నారు. నా చేతుల మీదుగా 800 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశాను. ప్రభుత్వం నుంచి ఇళ్లు ఇప్పించాం. మనవలూ, మనవరాళ్లూ వందల మందున్నారు నాకు.
ఒక్క సునీతా కృష్ణన్ కృషి వల్ల వ్యభిచారం రూపుమాసిపోదు. దానికి ఎంతోమంది కలిసికట్టుగా కృషి చెయ్యాలి. చిన్న విషయాలకు గొడవలకు దిగుతాంగానీ, ఒక ఐదేళ్ల పాపను రేప్ చేస్తే ఊరుకుంటాం. ఇరవయ్యేళ్లమ్మాయి వ్యభిచారంలోకి దిగితే ఊరుకుంటాం. ఇలాంటివాటికి మనకేంటని ఊరుకోకుండా తీవ్రంగా స్పందించే సమాజం తయారు కావాలి. ఏమైనా సంఘటనలు జరిగితే అవి ఎక్కడో ఎవరికో జరుగుతాయనుకుంటాం తప్ప, మన ఇంట్లో జరగొచ్చని కల్లో కూడా అనుకోరు. 'మా అమ్మాయి వ్యభిచారంలోకి వెళ్లకూడదు' అని ప్రతి కుటుంబమూ అనుకోవాలి. అలాగే ప్రతి మగవాడూ రేపిస్టు కాదు.
బ్రోకర్లు, ట్రాఫికర్లు, న్యాయవాదులు, పోలీసులు - వీళ్లంతా మా పని పట్ల గుర్రుగా ఉంటారు. ఇంతమందికి వ్యతిరేకంగా వెళుతూ పనిచేయడానికి కావలసిన బలం నామీద జరిగిన అత్యాచారం నుంచే వస్తుంది. గాయం మానినా మచ్చ ఉండిపోయినట్టు దాని బాధ నాలో ఎప్పటికీ ఉంటుంది. వ్యభిచారo నుంచి విముక్తి పొందిన అమ్మాయిలతోనో, రేప్‌కు గురైన బాలికనో మాట్లాడించాలనుకుంటుంది మీడియా. అదే పురుషులనెప్పుడైనా 'నువ్వెందుకు పదేళ్ల పాపను రేప్ చేశావు, ఎందుకు వ్యభిచార గృహానికి వెళ్లావు' అని నిలదీస్తుందా చెప్పండి? అమ్మాయిలకు నేను చెప్పేదొకటే. అత్యాచారం జరిగినప్పుడు మనసు గాయం మానడానికి మౌనం సాయపడుతుంది. కానీ అది అన్ని సమస్యలనూ పరిష్కరించదు. జరిగినదానిలో మీ పొరపాటేమీ లేదు. బాధ పడుతూ కూర్చోవద్దు.
మేం ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ స్వీకరించం. మాకు సాయం చేసేవాళ్లు వేరే ఉన్నారు. లక్నోలో రిక్షా లాగే మనిషి మాకు ప్రతి రోజూ సరిగ్గా 101రూపాయలు పంపిస్తాడు. ఇప్పటికి పన్నెండేళ్ల నుంచి ప్రతిరోజూ పంపిస్తున్నాడాయన. అటువంటి లక్షాధికారులు ఎంతోమంది మాకు సాయంగా ఉన్నారు. ఏ అమ్మాయి, ఏ పాపా అమ్ముడుపోకూడదు. అదే నా కల. అదే నా లక్ష్యం.''
మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక
No comments:
Post a Comment