Thursday, May 31, 2012

అత్తకు మించిన కోడలు సోనియాగాంధీ


సోనియాగాంధీ ఇందిరాగాంధీని మించిపోతోందా?లేక అధికారంలో వుంటే ఎంత సున్నిత మనస్కులైనా ఇందిరలా మారిపోతారా? సోనియాగాంధీ.. తాను రాజకీయాల్లోకి రానంటే రానని మొరాయించి కూర్చున్న ఒకానొక సాధారణ గృహిణి. ఎంత ఫారిన్ వనితైనా.. సంప్రదాయ బద్ధంగా జీవించిందే ఎక్కువ. దానికి తోడు వాల్డ్ మోస్ట్ పాపులర్ ఫ్యామిలీస్ లో ఒకటైన గాంధీ కుటుంబానికి కోడలిగా వచ్చింది. ఇందిర హఠాన్మరణం.. తదనంతరం తన భర్త రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం.. తరువాత ఆయన కూడా మరణించడంతో సోనియాగాంధీ షాకులు  మీద షాకులకు గురైంది. రాజకీయాలనే పేరెత్తితేనే చిరాకు పరాకుగా ఫీలయ్యేది. కాంగ్రెస్ పార్టీని వాళ్లూ వీళ్లు అధ్యక్షపదవుల్లో వుండి పతనావస్థకు చేర్చుతుంటే.. విధిలేని పరిస్థితుల్లో రంగంలోకి దిగింది. తిన్న తిన్నగా రాజకీయ పరిజ్ఞానం వంటబట్టించుకుంది. ఇప్పుడు సోనియా ఎలా మారిపోయిందంటే, తనకు ఎదురు తిరిగిన జగన్ లాంటి వాళ్లను ఎలా మట్టుపెట్టాలో పక్కాగా తెలిసిన ‘రాజకీయ సివంగి’లా మారింది. ఇలాంటి ఎత్తుగడలు వేయడంలో ఇందిరాగాంధీ నాడు ఎంతో ఫేమస్సయింది. ఇందిరతో పెట్టుకున్న వాళ్లు కోలుకోవడం కష్టం అన్నంతగా రాణించిందామె. ఇప్పుడు దాదాపు ఆ స్థాయికి చేరింది సోనియాగాంధీ. తండ్రి (రాజశేఖర్ రెడ్డి) మరణానంతరం సీఎం సీటు తనకు దక్కలేదన్న తలంపుతో కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించి, తరువాత ఆ పార్టీలో ఇమడ లేక జగన్ కొత్త పార్టీ పెట్టాడు. ఏమీ తెలియని అమాయకుడిగా అనుకుని అతడిని వదలటం.. ఎంత పెద్ద నేరమో తెలుసుకుంది సోనియాగాంధీ. ప్రస్తుతం అతడు గనుక ఈ ఉపఎన్నికల్లో గెలిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ కూచాలు కదులుతాయి. ప్రభుత్వం పడిపోయి మధ్యంతరం వచ్చే పరిస్థితి కూడా వుంది. కనుక జగన్ అడుగులు అల్లాటప్పాగా వేస్తున్నవి కావు. కనుక, ఈ విషయాన్ని తప్పనిసరిగా సీరియస్ గా తీసుకోవాలని తలచి సోనియాగాంధీ ఇంతగా అతడ్ని కట్టడి చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ని జైల్లో పడేయటం  ఒక్కటే మార్గం.. అతడు జనంలోకెళ్లకుండా జైల్లో కూర్చోవడమే రాబోయే మధ్యంతరాన్ని ఆపగల తారక మంత్రం. అలా కూర్చోవాలంటే తగిన సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చిన సోనియాగాంధీకి ఇంతకన్నా మించిన టైం దొరకదు. ఇన్నాళ్లూ సీబీఐని పకడ్బందీగా వాడుకుని పావులు కదుపుతూ వచ్చింది అందుకే. ఇప్పుడు జగన్ కి చెక్ పెట్టడానికి కాలంధర్మం బాగా కలిసొచ్చింది. ఉపఎన్నికల ముందు అరెస్టు చేయడం వల్ల ఒక లాభం వుంది. ఏ మాత్రం అల్లర్లు చెలరేగినా.. జగన్ ఇన్నాళ్లు చేసిన ప్రచారం బూడిదలో పోసినట్టే. ఉపఎన్నికలు అటకెక్కుతాయి. అలా జరక్కూడదంటే, జగన్ అరెస్టైనా ఆయన పార్టీ కార్యకర్తలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి తీరాల్సిందే. ఇక్కడ పదే పదే చెబుతున్నదేమిటంటే ఇంత పక్కాగా జగన్ కు చెక్ పెట్టగలగడం నిజంగా ఒక చాణక్యమే. సోనియా ఎంతగానో రాటు దేలితే తప్ప.. ఇంతగా ప్రత్యర్ధుల పనిపట్టడం సాధ్యమయ్యే పని కాదు. అందుకే అంటున్నది.. అత్త ఇందిరను మించిన కోడలుగా సోనియా చెలరేగిపోతోందని. భవిష్యత్ పరిణామాలు ఎలా వున్నప్పటికీ.. సోనియా రాజకీయ చదరంగం ఆడుతున్న తీరు ఎంత ఆక్షేపణీయంగా అయినప్పటికీ.. ఆమెలోని రాజకీయ పరిణితి పరాకాష్టకు చేరిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

No comments:

Post a Comment